క్రిమినల్ కేసుల విచారణ రిపోర్టింగ్‌పై మీడియా అనుసరించాల్సిన మార్గదర్శక సూత్రాలను సుప్రీం కోర్టు రూపొందించినట్లయితే అది న్యాయవ్యవస్థ అత్యుత్సాహం కాగలదని రాజ్యాంగ నిపుణులు పాలీ ఎస్.నారిమన్, మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జి శుక్రవారం సుప్రీం కోర్టుకు తెలిపారు. క్రిమినల్ కేసుల విచారణ జరుగుతున్నప్పుడు వాటిపై రిపోర్టు చేసే విషయంలో మీడియాకు మార్గదర్శక సూత్రాలు రూపొందించాల్సిన అవసరంపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం గత నెల రోజులుగా చర్చలు జరుపుతోంది. ఈ చర్చల ముగింపు రోజున నారిమన్, సొరాబ్జి తమ అభిప్రాయాలు వెల్లడించారు. సుప్రీం కోర్టు తనంత తాను ఏ మార్గదర్శక సూత్రాలను రూపొందించే కర్తవ్యాన్నీ నెత్తిన వేసుకోరాదని సొరాబ్జి అన్నారు. కోర్టు రూపొందించిన మార్గదర్శక సూత్రాలు ఒక పౌరునికి వాటిని సవాల్ చేసే హక్కును హరించివేస్తాయని పేర్కొన్నారు. ఒకవేళ ఈ మార్గదర్శక సూత్రాలే పార్లమెంట్ గానీ, అసెంబ్లీ గాని రూపొందిస్తే వాటిని పౌరుడు కోర్టులో సవాల్ చేయడానికి వుంటుంది గానీ కోర్టే రూపొందిస్తే ఇక ఆ హక్కు హరించుకుపోతుందన్నారు. మీరు చట్టాన్ని స్పష్టంగా, వివరంగా చెప్పవచ్చు, కానీ ఎలాంటి మార్గదర్శక సూత్రాలూ జారీ చేయరాదని పేర్కొన్నారు. నిజమైన మీడియా ఎన్నడూ కూడా విచారణ సందర్భంగా నిందితుడిపై వ్యాఖ్యానించడం ద్వారా సమాంతర విచారణ జరపబోదని, అయితే ఒకవేళ ఎవరికైనా బెయిల్ లభించి లేదా లభించకపోయినట్లయితే మాత్రం కచ్ఛితంగా దానిపై చర్చిస్తుందన్నారు. పత్రికా స్వేచ్ఛ, నియంత్రణ గురించి చెప్పాల్సినదంతా రాజ్యాంగంలోనే చెప్పారని, మళ్ళీ కోర్టులు విడిగా మార్గదర్శక సూత్రాలు విధించనక్కరలేదని అన్నారు. అసలు కోర్టు పూరించవలసిన స్థానం కూడా ఏమీ లేదని అన్నారు. ఒకవేళ అదనంగా ఆంక్షలు విధించాల్సిన అవసరముంటే అది పార్లమెంట్ చూసుకుంటుందన్నారు. తాము జర్నలిస్టులను శిక్షించాలనుకోవడం లేదని, కానీ, వారికి లక్ష్మణ రేఖ గురించి తెలియాలని భావిస్తున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనివల్ల వారు కోర్టు ధిక్కార కార్యకలాపాలకు దూరంగా ఉంటారని పేర్కొంది.