ఉద్యోగులు, కార్మికులు తమ జీత భత్యాల పెంపు కోసం రోజులు, నెలల తరబడి ఆందోళన చేయాల్సిందే. లాఠీ దెబ్బలు తినాల్సిందే. కమిటీలు, చర్చల పేరుతో సర్కారు కాలయాపన చేస్తుంటే చకోర పక్షుల్లా ఎదురు చూపులు చూడాల్సిందే. చివరకు ప్రభుత్వం బేరసారాలాడి అరకొరగా జీతభత్యాలు పెంచుతుంది. కాని...ముఖ్యమంత్రి, మంత్రులు జీత భత్యాలు పెంచుకోవాలంటే ఎవరి అనుమతి అక్కరలేదు. రోజుల తరబడి చర్చలు అవసరం లేదు. ఆందోళనలు చేయాల్సిన అగత్యం ఎంతమాత్రమూ లేదు. అనుకున్నదే తడవుగా లక్షల్లో జీతాలు పెంచుకుంటారు. అడిగేవాళ్లు ఎవరూ ఉండరు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు తమ జీత భత్యాలను అమాంతం లక్షల్లో పెంచుకున్నారు. ఈ మేరకు శాసనసభలో మంగళవారం బిల్లును ఆమోదింపజేసుకున్నారు. జీతభత్యాలను ఏకంగా 400 శాతం పెంచుకున్నారు. ముఖ్యమంత్రి పాత జీతభత్యాల మొత్తం రూ.36,500 కాగా, మంత్రుల జీతభత్యాల మొత్తం రూ.66, 500. పెరిగిన దాని ప్రకారం ముఖ్యమంత్రి జీతభత్యాల మొత్తం రూ. 2,44,000. మంత్రుల జీతభత్యాల మొత్తం 2,42,000. వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ ప్రతిపాదించిన ఈ బిల్లులో జీవన వ్యయం గణనీయంగా పెరిగినందున, పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక, కేరళ, మహారాష్ట్రల్లో ముఖ్యమంత్రి, మంత్రుల జీతభత్యాలను పరిశీలించిన తర్వాత మన రాష్ట్రంలో కూడా పెంచాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. శాసనసభలో చీఫ్‌విప్, విప్, శాసనసభ, శాసన పరిషత్తులోని ప్రతిపక్ష నాయకునికి కూడా ఈ జీతభత్యాలు వర్తిస్తాయని తెలిపారు.