విశాఖ పోర్టు డైమండ్ జూబ్లీ మైదానంలో మూడురోజుల పాటు జరిగిన పదవ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ మీట్ శనివారం ముగిసింది. తమిళనాడు ఆరు స్వర్ణాలతో ఓవరాల్ ఛాంపియన్ షిప్ చేజిక్కించుకుంది. కేరళ ఐదు స్వర్ణాలతో రన్నర్‌గా నిలిచింది. జూనియర్ పురుషుల విభాగంలో మూడు స్వర్ణాలతో ఉత్తరప్రదేశ్, జూనియర్ మహిళల విభాగంలో నాలుగు స్వర్ణాలతో కేరళ ప్రథమస్థానాల్లో నిలిచాయి. ఉత్తమ అథ్లెట్లుగా పంజాబ్‌కు చెందిన క్రిపాల్‌సింగ్, పశ్చిమబెంగాల్‌కు చెందిన రేణుబాల మహంత ఎంపికయ్యారు. డిస్కస్‌త్రోలో క్రిపాల్‌సింగ్ 58.10 మీటర్లు డిస్క్ విసిరి 1014 పాయింట్లు సాధించి ఉత్తమ అథ్లెట్ స్థానాన్ని కైవశం చేసుకున్నారు. లాంగ్‌జంప్‌లో రేణుబాలమహంత 6.09 మీటర్లు జంప్ చేసి 1007 పాయింట్లతో జూనియర్ మహిళల విభాగంలో ఉత్తమ అథ్లెట్‌గా నిలిచారు. ఆరు స్వర్ణ, ఆరు రజిత, రెండు కాంస్య పతకాలతో తమిళనాడు ప్రథమస్థానం కైవసం చేసుకుంది. ఐదు స్వర్ణ, ఏడు రజత, ఎనిమిది కాంస్య పతకాలతో కేరళ ద్వితీయస్థానంలో నిలిచింది. ఐదు స్వర్ణ, ఐదు రజత, నాలుగు కాంస్య పతకాలతో ఉత్తరప్రదేశ్ తృతీయస్థానంలో నిలిచింది. రెండు రజిత, 2 కాంస్య పతకాలతో ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో ఉంది.
జూనియర్ పురుషుల విభాగంలో మూడు స్వర్ణ, మూడు రజిత, రెండు కాంస్య పతకాలతో ఉత్తరప్రదేశ్, పాయింట్ల సాధనలో కొద్దిగా వెనుకబడిన తమిళనాడు అవే సంఖ్య పతకాలతో ఒకటి, రెండు స్థానాల్లో నిలిచాయి. మూడు స్వర్ణ, రెండు రజిత, మూడు కాంస్య పతకాలతో మహారాష్ట్ర, మూడు స్వర్ణ, రెండు రజిత, కాంస్య పతకంతో పంజాబ్ 3, 4 స్థానాలను సాధించాయి. ఒక రజిత పతకంతో గుజరాత్ చివరిస్థానంలో ఉంది.
జూనియర్ మహిళల విభాగంలో 4 స్వర్ణ, ఐదు రజిత, నాలుగు కాంస్య పతకాలతో కేరళ పతకాల పట్టికలో అగ్రభాగాన నిలిచింది. మూడు స్వర్ణ, మూడు రజిత పతకాలతో తమిళనాడు, మూడు స్వర్ణ, రెండు రజిత, ఒక కాంస్యతో కర్నాటక, రెండు స్వర్ణ, నాలుగు రజిత, నాలుగు కాంస్య పతకాలతో పశ్చిమబెంగాల్ 2, 3, 4 స్థానాల్లో నిలిచాయి. బీహార్ ఒకే కాంస్య పతకంతో చివరిస్థానంలో ఉంది.విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ విజేతలకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడావేదికగా విశాఖను తీర్చిదిద్దేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అథ్లెటిక్స్ సంఘం రాష్ట్ర కార్యదర్శి రంగారావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జెఎన్ చౌదరి, డి.నాగేశ్వరరావు, విపిటి చీఫ్ విజిలెన్స్ అధికారి మురళీమోహనరావు తదితరులు పాల్గొన్నారు.