యుపిఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో ఉందని కలెక్టర్ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు, గురువారం స్తానిక జిల్లా పరిషత్ సమావేశభవనంలో మండల అద్యక్షులకు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ కూలీలకు ఎక్కువ రోజులు పనికల్పించిన జిల్లాలో మన జిల్లానే ప్రథమస్థానంలో ఉందన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో జిల్లాలో 252 కోట్ల రూపాయలను ఖర్చు చేశామన్నారు. కుటుంబంలో ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డు ఇవ్వడం వల్ల దాదాపు నాలుగు లక్షల మంది పనిచేయని వారు ఉన్నారని చెప్పారు. వారి వల్ల కార్డుల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు అలా కాకుండా పనికి రాని వారికి కార్డులను తొలగించాలన్నారు. మండల పరిధిలో ఉన్న అధికారులు గ్రామ స్థాయిలో పర్యటించి ఎక్కడ ఏ పనులు నిర్వహించాలన్న దానిపై అవగాహన రావాలని చెప్పారు. వేసవిని దృష్టిలో ఉంచుకోని ప్రతి గ్రామంలోనూ ఉపాధి పనులు చేసే చోట కనీస వసతులను తప్పనిసరిగా కల్పించాలన్నారు. ఈ సదస్సులో ద్వామా పిడి మురళి మాట్లాడుతూ కొన్ని గ్రామాలలో పొలాలకు రహదారి ఏర్పాటు చేసుకునేందుకు పనులను అడిగారని, అటువంటి నివేదికను పరిశీలించి పనులు కేటాయించడం జరుగుతుందన్నారు. కొన్ని గ్రామాలలో పోస్టాఫీస్ వారు అకౌంటును తెరిచేందుకు నిర్లక్షం చేస్నున్నారని ఎంపిపిల సంఘం జిల్లా అధ్యక్షులు బ్రహ్మయ్య కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ వెంటనే సంబంధిత అధికారులకు పిలపించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్తు సిఇఓ జయపాల్‌రెడ్డి, వివిధ మండలాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.