జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం కేటాయిస్తున్న సబ్సిడీ విత్తనాలు చాలా వరకు పక్కదోవ పడుతున్నాయన్న ఆరోపణలు చాలాకాలంగా వస్తున్నాయి. వీటిపైన సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. శాఖపరమైన విచారణ ఒకవైపు, రాష్ట్ర స్థాయి నుంచి విజిలెన్సు విచారణ, జిల్లాలోని విజిలెన్సు అండ్ ఎన్‌ఫోర్సుమెంటు శాఖలు విడివిడిగా విచారణకు సిద్ధమవుతున్నాయి. దీంతో విత్తన పంపిణీలో చేతివాటం చూపిన వ్యవసాయ శాఖ అధికారుల్లో ఆందోళన మొదలైంది. వేరువేరుగా మూడు విచారణలు సాగుతున్న నేపథ్యంలో తమ గుట్టు ఎక్కడ రట్టు అవుతుందోనన్న భయం వారికి కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. విత్తనసేకరణ ఏజెన్సీలు, విత్తన పంపిణీ ఏజెన్సీలు, వ్యవసాయ శాఖ అధికారులు కూడబలుక్కుని సబ్సిడీ విత్తనాలను పక్కదోవ పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిపైన సమగ్రమైన విచారణ ప్రారంభమవుతోంది.
2009-10 ఖరీఫ్, రబీ సీజన్‌లో కలిపి జిల్లాలో పెద్ద ఎత్తున సబ్సిడీ విత్తనాలను రైతులకు అందజేశారు. అందులో ప్రధానంగా వేరుశనగ విత్తనకాయలు ఉన్నాయి. ఖరీఫ్‌లో ఐదున్నర లక్షల క్వింటాళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే అంతకు మించి ఐదు లక్షలా 66 వేల క్వింటాళ్లు పంపిణీ చేశారు. విత్తన గ్రామ పథకం కింద మరో 11200 క్వింటాళ్లు రైతులకు అందజేసినట్టు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. రబీలో 9000 క్వింటాళ్లు వేరుశనగ విత్తనకాయలు పంపిణీ చేశారు. ఖరీఫ్‌లో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పప్పుశనగ 74 వేల క్వింటాళ్లు, పొద్దుతిరుగుడు 1500 క్వింటాళ్లు పంపిణీ చేశారు. ఇవికాక కందివిత్తనాలు 11 వేల క్వింటాళ్ల వరకు సబ్సిడీ ధరకు రైతులకు అందజేశారు.
రాష్ట్రంలో సగం'అనంత'లోనే...
సబ్సిడీకి అందజేసిన సరఫరా చేసిన వేరుశనగ, కంది, పప్పుశనగల్లో దాదాపు 50 శాతం వరకు ఒక్క అనంతపురం జిల్లాలోనే పంపిణీ చేశారు. ప్రధానంగా వేరుశనగ విత్తనకాయలను ఏ జిల్లాలో లేని విధంగా ఇక్కడ పంపిణీ జరిగింది. అయితే పక్కదోవ పట్టింది కూడా ఇక్కడే ఎక్కువన్న ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ, మార్కుఫెడ్, ఆయిల్‌ఫెడ్, నాఫెడ్, హాకాల ద్వారా విత్తన సేకరణ, పంపిణీ జరిగింది. వేరుశనగ అయితే ఆగ్రోస్ ఏజెన్సీల ద్వారా పంపిణీ చేపట్టారు. విత్తన సేకరణ, విత్తనపంపిణీ ఏజెన్సీలు, వ్యవసాయాధికారులు కూడబలుక్కుని సబ్సిడీ విత్తనాన్ని పక్కదోవ పట్టించి జేబులు నింపుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఇందులో ఇద్దరు జిల్లా స్థాయి అధికారులు కీలకపాత్రదారులుగానున్నట్టు తెలుస్తోంది.
నేటి నుంచి ఐదు బృందాలు రంగంలోకి...
సబ్సిడీ విత్తన పంపిణీలో చోటు చేసుకున్న అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రంలో ఎక్కువ శాతం సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేసిన అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం, చిత్తూరు, మహబూబ్‌నగర్ జిల్లాలో విచారణకు ప్రభుత్వం కమిటీలను వేసింది. ఒక్కొక్క జిల్లాలో ఐదు కమిటీలు సోమవారం నుంచి విచారణను ప్రారంభించనున్నాయి. ఒక్కొక్క బృందంలో ముగ్గురేసి చొప్పున పక్క జిల్లాల అధికారులను నియమించారు. వీరు పర్మిట్ల మంజూరు మొదలుకుని, బిల్లులు, ఏజెన్సీలు సాగించిన అమ్మకాల రిజిస్ట్రార్లు, స్టాకు పాయింట్లలో రికార్డుల పరిశీలన జరుపుతారు. అది కాకుండా క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు కూడా వెళ్లి విచారిస్తారు. ఈ విధంగా ప్రభుత్వం తరపున నియమించిన కమిటీ విచారిస్తుంది. ఇది కాక రాష్ట్ర స్థాయిలో విజిలెన్సు, జిల్లా స్థాయిలోని విజిలెన్సు అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ శాఖలు కూడా సబ్సిడీ విత్తన పంపిణీపై విచారణను ప్రారంభించనున్నాయి.
ప్రభుత్వం నియమించిన కమిటీల్లోని సభ్యుల వివరాలు...
కమిషరేట్ నుంచి నియమించిన అధికారులు ఎ.రామచంద్రారావు(డిడిఎ) రఫీ అహ్మద్ (ఎడిఎ) అశోక్‌కుమార్(ఎడిఎ), చంద్రప్రకాశ్ (డిడిఎ), భాస్కర్‌రెడ్డి (డిడిఎ) ఉన్నారు. కర్నూలు జిల్లా నుంచి తులసీప్రసాద్(డిడిఎ), సి.ప్రభాకర్‌రెడ్డి(ఎడిఎ), మహమ్మద్ ఇస్మాయిల్(డిడిఎ), ఎస్.వెంకటేశ్వర్లు (ఎడిఎ), కెవి.సుబ్బారావు (డిడిఎ), వి.సత్యనారాయణ(ఎడిఎ), ఎస్.వేణుగోపాల్‌రావు (ఎడిఎ), కడప జిల్లా అధికారులు టి.శేషయ్య(డిడిఎ), ఎం.గణశేఖర్(ఎడిఎ), బి.ప్రభాకర్‌రావు (డిడిఎ), ఎం.భగవత్‌స్వరూప్ (ఎడిఎ), జి.శ్రీనివాసులు (డిడిఎ), ఎ.మహ్మద్ ఇక్బాల్(ఎడిఎ), ఎంఎడిఎన్.ప్రసాద్(ఎడిఎ), ఎస్.రాజు (ఎడిఎ), లుద్రారెడ్డి(ఎడిఎ), పి.యర్రంరెడ్డి(ఎడిఎ), టి.శ్రీనివాసరావు (ఎడిఎ), బి.అశ్వనీకుమార్ (ఎడిఎ)లు జిల్లాలో విత్తన పంపిణీలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టనున్నారు.
వ్యవసాయశాఖలో ఉద్యోగులకు పదోన్నతులు
మాటలు చెప్పకండి... పని చేయండి..
అభద్రత నడుమ నాపరాయి పరిశ్రమ కార్మికులు
విద్యుత్ పోరాటంలో అసువులు బాసిన వీరునికి నివాళి
విద్యార్జణకు హద్దుల్లేవు:కలెక్టర్
మంత్రి రఘువీరా దిష్టిబొమ్మ దగ్ధం
ఎరువులెక్కడా పోలేదు
హైనా దాడిలో 50మందికి గాయాలు
తప్పును ఒప్పు చేసే ప్రయత్నాలు..