సిరులు కురిపిస్తున్న తమలపాకు తోటలు

  • గ్రామంలో ఎక్కడ చూసినా ఆకుతోటలే..
  • అందరికీ చేతినిండా పని, డబ్బులు

ఆ.. ఊరిలో అందరికీ ఆకుతోటలున్నాయి. అందరికీ చేతినిండా పని, డబ్బులు ఉన్నాయి. ప్రతి యేడాది వేరుశనగపంట పెట్టడం, వర్షాభావంతో నష్టాలను చవిచూడటంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి సారించారు. తాతలకాలం నుంచి ఈ ఊరిలో తమలపాకు తోటలు పెంపకం అంటే మరీ ఇష్టం. అందుకే ప్రతి ఇంటికీ కనీసం పదిసెంట్లు నుంచి ఒక ఎకరం దాకా ఆకుతోటలు ఉన్నాయి. మండలంలోని దిగువచెక్కవారిపల్లి గ్రామ పంచాయతీ కేంద్రంలో నాలుగు వందల కుటుంబాలు ఉన్నాయి. నిత్యమూ ఆకుపచ్చని తోటలతో ఆఊరు కళకళలాడుతోంది. గ్రామంలో ఎక్కడ చూసినా తమలపాకుతోటలే దర్శనమిస్తాయి. ఒకరి మించినొకరు పంట నుంచి అధిక ఆదాయం గడించాలని పోటీపడుతారు.

గ్రామంలో ఉన్న 42బోర్లు కూడా ఉమ్మడి బోర్లు. ఒక్క బోరు కింద దాదాపు 5,6 ఎకరాలు సాగవుతాయి. ఒకరినొకరు అన్నదమ్ముల్లా కలిసి ఉంటూ నీటిని సమానంగా పంచుకుంటూ పంటలను సాగుచేస్తున్నారు. ఈ గ్రామంలో ప్రతివారమూ రెండులక్షల రూపాయల దాకా వ్యాపారం జరుగుతుందంటే అక్కడి పరిస్థితి అర్థమవుతుంది.

పంటలు తీయడంలో ఆగ్రామం ముందజ...

ఆకుతోటలతో సమానంగా, కూరగాయాల పంటలు తీయడంలో కూడా ఆగ్రామం ఆదర్శం. టమోటా, వంకాయ, పచ్చిమిరప, ఆకుకూరలు, కనకాంబరం, తదితర పంటలు కూడా పండించడంలో పోటీ పడి పండిస్తారు.

కషాయం ద్వారా సాగు...

గ్రామంలో సాగు చేసే పంటలకు సేంద్రీయ పద్ధతుల ద్యారానే పంటలకు కషాయాలు ద్వారా చీడపీడల నివారిస్తామని గ్రామానికి చెందిన గ్రామ కార్యకర్త రామాంజనేయలు తెలిపారు. తాను దశపత్ర కషాయం ద్వారా టమోటా పంటను పండించి, దాదాపు 12 వేల రూపాయల ఆదాయాన్ని పొందినట్లు చెప్పారు. దిబ్బ ఎరువులు, స్థానికంగా దొరికే పేడ, మూత్రం, వావిలాకుల కషాయం తదితర వాటి ద్వారానే తాము పంటలు సాగుచేస్తున్నామన్నారు. రసాయనిక ఎరువులు తగ్గించి, పంటలు పండిస్తామని తెలిపారు. ఈ రైతులు పండిస్తున్న పంటల విధానాన్ని పరిశీలించేందుకు కడప, చిత్తూరు జిల్లాల నుంచి రైతులు వస్తుంటారు.

విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేదు..

అయితే విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేకపోవడంతో తరుచూ బోర్లు ఉండడంతో తరచూ మోటార్లు కాలిపోతున్నాయి. మా గ్రామంలో పండిన తమలపాకులను చిత్తూరు జిల్లా మదనపల్లికి, చింతామణి, కోలార్‌, తిరుపతి, బెంగుళూరు, కదిరి, ములకలచెరువు, గాలివీడు, పెద్దమండ్యం, రాచోటీ, గుర్రంకొండ, పిటిఎం, బి.కొత్తకోట తదితర ప్రాంతాలకు తరలిస్తాం. (పుల్లయ్య, క్రిష్టప్ప, గంగులప్పు, మామిళ్లక్రిష్టప్ప, దూల్ల శివయ్య, సుబ్బరాయుడు, క్రిష్ణమ్మలు)

రవాణా వ్యవస్థ లేదు...

బస్సు సౌకర్యం సరిగా లేదు. ఉదయం వచ్చిన బస్సు మళ్లి రాత్రి పదిగంటలకు వస్తుంది. దీంతో మండలకేంద్రానికి రావాంటే ఆటోలను లేదా నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. నిత్యమూ వందమందికి పైగా డి.చెక్కవారిపల్లి నుంచి తనకల్లు, కదిరి, మదనపల్లికి వెళ్లేవారం. ఆకులు మోపులు కొక్కంటి దాకా మోయాల్సి వస్తోంది. ఆర్టీసి అధికారులకు ఎన్నిమార్లు చెప్పినా పట్టించుకున్న దాఖలాలు లేవు.

(రామాంజులు, పెద్దన్న, వేణు, మహిళా రైతులు పెద్దక్క, రమణమ్మ, క్రిష్టమ్మ)

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్