తెల్ల ఏనుగులా తాగునీటి పథకాలు

  • పురపాలక సంఘాలకు నిర్వహణ తలకు మించిన భారం
  • ప్రజల నెత్తినవేసేందుకు సిద్ధం

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా చేపట్టిన తాగునీటి పథకాలు పురపాలక సంఘాలకు తెల్ల ఏనుగులాగా మారనున్నాయి. పురపాలక సంఘాలకు ఆర్థిక స్థోమతను ఏ మాత్రమూ పరిగణలోకి తీసుకోకుండా చేపట్టిన ఈ పథకాలు ప్రజల నెత్తిన భారం మోపేందుకు సిద్ధమవుతున్నాయి. భారం మోపని పక్షంలో కోట్లాది రూపాయలతో చేపట్టిన తాగునీటి పథకాలు వృధా అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అనంతపురం జిల్లాలో ఒక కార్పొరేషన్‌, ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో తాడిపత్రి మున్సిపాలిటీ మినహా అనంతపురం కార్పొరేషన్‌, కదిరి, ధర్మవరం, రాయదుర్గం, హిందూపురం, గుంతకల్లు మున్సిపాలిటీల్లో రూ.287.35 కోట్ల వ్యయంతో తాగునీటి ప్రాజెక్టులు నిర్మాణ దశలోనున్నాయి. 2004లో మొదటిసారి కాంగ్రెసు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మున్సిపల్‌ ఎన్నికలకు ముందు యుఐడిఎస్‌ఎస్‌ వంటి పథకం కింద అనంతపురానికి రూ.65 కోట్లు, ధర్మవరాకు రూ.65.02 కోట్లు, రాయదుర్గం రూ.46.50 కోట్లు, కదిరికి రూ.74.75 కోట్లు, హిందూపురం రూ.19 కోట్లు, గుంతకల్లుకు రూ.17.66 కోట్లతో తాగునీటి ప్రాజెక్టులకు అనుమతులిచ్చింది. అవి అప్పటి నుంచి పబ్లిక్‌ హెల్త్‌ శాఖ వారి ఆధ్వర్యంలో నత్తనడకన సాగుతూ వచ్చిన పనులు మరో రెండు, మూడు మాసాల్లోపు పూర్తవనున్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ పట్టణాలకు దాదాపు 20 కిలోమీటర్ల పైబడి పైప్‌లైన్‌ ద్వారా నీటిని అందించే విధంగానే ఉన్నాయి. నిర్మాణపు పనులు పూర్తయిన వెంటనే పబ్లిక్‌ హెల్త్‌ శాఖ వాటి నిర్వహణ బాధ్యతలను ఆయా పురపాలక సంఘాలకు అప్పగించనున్నారు.

నిర్వహణ తడిసి మోపెడు...

ఈ తాగునీటి పథకాలు నిర్మాణం పూర్తయిన తరువాత నిర్వహణ మున్సిపాలిటీలకు తడిసి మోపెడవనున్నాయి. ప్రస్తుతమున్న తాగునీటి పథకాలకే నిధులు వెచ్చించలేని పరిస్థితుల్లో అవి నడుస్తున్నాయి. అటువంటి తరుణంలో కొత్తగా పూర్తయ్యే ప్రాజెక్టు భారాన్ని మెసే ఆర్థిక స్థోమత వాటికి లేవు. ఉదాహరణ అనంతపురం కార్పొరేషన్‌ వార్షిక బడ్జెట్‌ ప్రభుత్వ గ్రాంట్లు, రుణాలు, సొంత ఆదాయం అన్నీ కలిపి రూ.40 కోట్ల వరకు ఉన్నాయి. నిర్వహణకే ప్రతి ఏటా నాలుగు కోట్ల వరకు ఖర్చుపెడుతున్నారు. పిఎబిఆర్‌ నుంచి అనంతపురానికి తాగునీరందించే ప్రాజెక్టు పూర్తయితే అదనంగా మరో నాలుగు కోట్ల రూపాయల భారాన్ని కార్పొరేషన్‌ భరించాల్సి ఉంటుంది. దీన్ని నిర్వహించేంతటి ఆర్థిక స్థోమతగాని, అధికార యంత్రాంగంగాని రెండూ లేవు. ధర్మవరం మున్సిపాలిటీపైన మూడు కోట్లు, రాయదుర్గం రెండు కోట్ల 21 లక్షల రూపాయలు, కదిరి మూడు కోట్ల 20 లక్షల రూపాయలు, హిందూపురం రెండు కోట్ల 77 లక్షలు, గుంతకల్లు రెండు కోట్ల రూపాయల వరకు అదనంగా భారాన్ని మోయాల్సి వస్తుంది.

ప్రజలపై అదనపు భారం తప్పదా...?

ప్రాజెక్టులు పూర్తవడం ద్వారా నిర్వహణకు అయ్యే అదనపు ఖర్చును ప్రజలపైనే మోపే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ప్రజారోగ్య శాఖ ఇప్పటికే వీటి నిర్వహణకు ఎటువంటి చర్యలు చేపట్టాలి అన్న దానిపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు నివేదికలను రూపొందించినట్టు తెలుస్తోంది. కుళాయి మీటర్లు అమర్చి ప్రతి నీటి చుక్కకు వెలకట్టి డబ్బులు వసూలు చేయడంతోనే వీటి నిర్వహణ సాధ్యమన్నది తెలుస్తోంది. లేదంటే వందల కోట్లు వెచ్చించి చేపట్టిన ప్రాజెక్టులు ఎందుకు పనికి రాకుండా పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. యుఐడిఎస్‌ఎస్‌ఎంటి పథకం కింద చేపట్టిన ఈ ప్రాజెక్టు వ్యయంలో 80 శాతం కేంద్ర ప్రభుత్వం గ్రాంటుగా ఇస్తుండగా పది శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. తక్కిన పది శాతం ఆయా మున్సిపాలిటీలు భరించాల్సి వస్తుంది. అయితే మున్సిపాలిటీలకు అంతటి ఆర్థిక స్థోమత లేకపోవడంతో వాటి వాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. దీంతో ప్రతి ఏటా సాధారణంగా ఇచ్చే గ్రాంట్లు ఇక ఇచ్చే అవకాశాల్లేవు. ఇక నుంచి ప్రభుత్వం నుంచి ఒక్క పైసా నిధులు మున్సిపాలిటీలకు వచ్చే అవకాశాల్లేవు. దీంతో నిధుల సమీకరణ బాధ్యత ఇక పూర్తిగా మున్సిపాలిటీలపైనే కాకుండా భవిష్యత్తులో ప్రజలపై మరిన్ని భారాలు తప్పేలా లేవు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్