ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న శింగనమల నియోజకవర్గంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. వర్షాకాలం వేసవి కాలాన్ని తలపిస్తోదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక చేసేది లేక ప్రజలు వ్యవసాయ బోర్లను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. కరెంటు కోతలతో అల్లాడుతున్న ప్రజలు బోర్ల దగ్గర కూడా కరెంటు ఉంటేనే నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఇళ్ల చుట్టూ తిరిగిన మంత్రి శైలూ ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారు. లేదా నగరంలోని ఆర్‌అండ్‌బి గెస్టుహౌస్‌కే పరిమితమయ్యారు. శింగనమలకు రాక సుమారు ఐదు నెలలు కావస్తోదంటే నియోజకవర్గ సమస్యలపై మంత్రికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోంది. గతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రికి వెస్టునరసాపురం, నాగులగుడ్డం, మట్లగొంది గ్రామస్తులు తాగునీటి సమస్యను పరిష్కరించాలని నిలదీశారు. అయినా మంత్రి తన నిర్లక్ష్య వైఖరిని వీడనాడడం లేదు. మాటలు చూస్తే కోటలు దాటుతాయి... అమలు చూస్తే శూన్యమని నియోజకవర్గ ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో మంత్రికి తగిన బుద్ధి చెబుతామని బహాటంగానే ప్రజలు చర్చించుకోవడం గమనార్హం.
శింగనమల నియోజకవర్గ పరిధిలో బుక్కరాయసముద్రం, నార్పల, గార్లదిన్నె, యల్లనూరు, పుట్లూరు, శింగనమల మండలాలు ఉన్నాయి. దాదాపు ఈ మండలాలన్నింటిలోనూ తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. విద్యుత్ కోతలతో రక్షిత మంచినీటి పథకాలు సరిగా పనిచేయలేదు. దీంతో చేతి పంపులపైనే ప్రజలు ఆధారపడ్డారు. ఇందులో కూడా చాలా వరకు మరమ్మతుకు గురయ్యాయి. నియోజకవర్గంలోని ఆరు మండలాలకు కలిపి ఇద్దరు మెకానిక్‌లు ఉన్నారు. సిబ్బంది తక్కువగా ఉండటంతో చేతి పంపులను మరమ్మతు చేయడం భారంతో కూడుకున్న పనైంది. గుక్కెడు నీటి కోసం ప్రజలు వ్యవసాయ బోర్ల వద్దకు పరుగులు తీయాల్సిన దుస్థితి నెలకొంది. నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు పలు సందర్భాల్లో మంత్రి ప్రకటించారు. అయితే ఆయన మాటలు హామీలకే పరిమితమయ్యాయి. జెసి నాగిరెడ్డి ప్రాజెక్టు ద్వారా మండలాల్లో తాగునీటి సమస్య పరిష్కరిస్తామని మంత్రి ఇచ్చిన హామీ నేటికీ పూర్తి స్థాయిలో ఆచరణకు నోచుకోలేదు. ఈ ప్రాజెక్టు పనులు చేపట్టి ఇప్పటికి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్నా ఇంత వరకు ఒక్క ట్యాంకు నిర్మాణం కూడా పూర్తి కాలేదు.
శింగనమల మండలంలో 18 గ్రామ పంచాయతీల్లో 48 వేల జనాభా ఉంది. మండల వ్యాప్తంగా 250 చేతిపంపులుండగా వాటిలో 150 వరకు చెడిపోయాయి. రక్షిత మంచినీటి పథకాలకు సంబంధించి 49 ట్యాంకులు ఉన్నాయి. వీటిలో చాలా వాటికి నీళ్లు అందడం లేదు. శివపురం, ఇరువెందుల, సి.బండమీదపల్లి, చిన్నజాలాలపురం, మట్లగొంది, సలకంచెరువు, ఆనందరావు పేట, నాగులగుడ్డం, వెస్టునరసాపురం, శింగనమల దళితవాడల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గార్లదిన్నె మండలంలో 18 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో 54,223 మంది జనాభా ఉంది. ఈ గ్రామాల్లో 273 చేతిపంపులున్నాయి. వీటిలో 73 చేతిపంపులు పనిచేయలేదు. వీటి మరమ్మతుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. పాపినేపాళ్యం, కోటంక, కనంపల్లి, యర్రగుంట్ల, కొట్టాల గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. చేతి పంపుల్లో వస్తున్న అరకొర నీటితోనే ప్రజలు సర్ధుకుంటున్నారు. బుక్కరాయసముద్రం మండల పరిధిలో 42 గ్రామాలున్నాయి. దాదాపు 70 వేల జనాభా ఉంది. మండల వ్యాప్తంగా 134 చేతిపంపులున్నాయి. వీటిలో 30 వరకూ పాడిపోయాయి. జనాభాకు అనుగుణంగా తాగునీటి కోసం గ్రామాల్లో ఓవర్‌హెడ్ ట్యాంకులు, చేతిపంపులు ఏర్పాటు చేయలేదు. రోటరీపురం, సిద్ధరాంపురం, గోవిందపల్లి, దంతులూరు, వడియంపేట, రేగడికొత్తపల్లి, పొడిరాళ్ల, భద్రంపల్లి గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. డి.గోవిందంపల్లిలో ఓవర్‌హెడ్ ట్యాంకున్నా ఆ నీటిలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉంది. దీంతో ఆ గ్రామస్తులు కొట్టాలపల్లికొచ్చి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. నార్పల మండలంలో 17 గ్రామ పంచాయతీలుండగా, 62 వేల జనాభా ఉంది. 334 చేతిపంపులున్నాయి. వీటిలో 180కి పైగా మరమ్మతులకు నోచుకోకుండా వృథాగా పడి ఉన్నాయి. 22 మంచి నీటి ట్యాంకులున్నాయి. అయితే వీటికి సంవృద్ధిగా నీళ్లు అందడం లేదు. నాయనపల్లి, సోదనపల్లి, గడ్డంనాగేపల్లి, నార్పల దళితవాడలో నీటి ట్యాంకులు నిరుపయోగంగా ఉన్నాయి. దుర్గం, చామలూరు గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది. పులసనూతల, రంగాపురం, జంగంరెడ్డిపల్లి గ్రామాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది.
యల్లనూరు మండలంలో 21 గ్రామ పంచాయతీలున్నాయి. దాదాపు 33 వేల జనాభా ఉంది. మండల వ్యాప్తంగా 142 చేతిపంపులున్నాయి. వీటిలో ప్రస్తుతం 85 వినియోగంలో ఉన్నాయి. మిగిలినవి పాడిపోయాయి. చిత్రావతి నది ఒడ్డున రూ.నాలుగు కోట్లతో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు నిరుపయోగంగా మారింది. మండలంలో పెద్దమల్లేపల్లి, నిట్టూరు, మేడికుర్తి, వాసాపురం, వేమలపల్లి, పాపంకొండాపురం, తిరుమలాపురం, దగ్గుపల్లి, గడ్డంవారిపల్లి గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. పుట్లూరు మండలంలో 23 గ్రామ పంచాయతీలుండగా 36 వేల జనాభా ఉంది. మంచినీటి పథకాలతో పాటు 160 చేతి పంపులున్నాయి. వీటిలో దాదాపు 50 వరకు పాడైపోయాయి. చిత్రావతి నది నుంచి రక్షిత మంచినీటి పథకం ద్వారా 14 గ్రామాలకు నీరు అందాల్సి ఉండగా కేవలం ఆరు గ్రామాలకు మాత్రమే నీరు అందుతోంది. మండల పరిధిలోని చింతకుంట, కడవకల్లు, గొల్లపల్లి, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండటంతో రకటివేమల, కొండాపురం, గూడూరు, కొండుగారికుంట, పుట్లూరు, బాలాపురం గ్రామస్తులు ఫిల్డర్‌వాటర్‌ను కొనుగోలు చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు సమీక్షలతోనే కాలయాపన చేస్తున్నారు.
రూ.82 లక్షలు ఏమయ్యాయి..?
తాగునీటి సమస్య పరిష్కారం కోసం పూర్తి స్థాయిలో నిధులున్నా వాటిని సక్రమంగా వినియోగించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తాగునీటి సమస్య పరిష్కారం కోసం మంజూరయిన 82