గతంలో దొంగలు ఎక్కడైనా దొంగతనం చేస్తే అమ్ముకోవడం పెద్ద ఇబ్బందిగా మారేది. కాని ఇప్పుడు ఫైనాన్స్ సంస్థలు ఒక వరంగా మారాయి. ఓటరుకార్డు, రేషన్‌కార్డు, లేదా స్థానికంగా నివాసం ఉంటున్నట్టు ధ్రువీకరణ పత్రం ఉంటే చాలు నిమిషాల్లోనే ఏ బంగారాన్ని అయిన తాకట్టు పెట్టుకుని డబ్బులిచ్చేస్తున్నాయి ఫైనాన్స్ కంపెనీలు. సొమ్ము విలువలో 75 శాతం వరకు రుణం కింద ఇస్తున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకున్న కొందరు దొంగతనం చేసిన సొమ్మును ఫైనాన్స్ సంస్థల్లో కుదవపెట్టి డబ్బులు దండుకుంటున్నారు. సొమ్ములు కుదవ పెట్టుకునే ముందు ఆ సంస్థలు ఎటువంటి విచారణ చేయడం లేదు. జిల్లాలో కదిరి ప్రాంతంలోని ఓదొంగల ముఠా ఇటీవల ఇదే తీరున బంగారు నగలను తాకట్టు పెట్టి సొమ్ము చేసుకున్నట్టు సమాచారం. సుమారు కిలో బంగారాన్ని ఈ ముఠా దొంగతనం చేసి ఒక ఫైనాన్స్ సంస్థలో కుదవ పెట్టి డబ్బులు తీసుకున్నారు. ఈ డబ్బులతో వారు జల్సాలు చేసుకున్నారు. కదిరి పోలీసులకు పట్టుబడిన సమయంలో వారిని విచారిస్తే ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరిపై కేసు నమోదు చేసి దొంగ సొమ్మును రికవరీ చేద్దామంటే వీలుకాని పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. సాధారణంగా అయితే దొంగ సొమ్మును కొనుగోలు చేసిన వారిపైనా పోలీసులు కేసు నమోదు చేసి రికవరీ చేసేవారు. కాని ఇక్కడ తాకట్టు పెట్టింది ఫైనాన్స్ సంస్థలు కావడంతో ఏమి చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో గుట్టుగా అరెస్టు చూసి కోర్టు ముందు హాజరుపరిచి జైలుకు పంపించారు. ఇప్పుడు ఫైనాన్స్ సంస్థపైన కేసు పెట్టాలా... లేక ఏమి చేయాలి అన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా దొంగలకు ఫైనాన్స్ సంస్థలు ఒక వరంగా మారాయి. ఈ విధంగా దొంగలు దొంగ సొమ్మును దర్జాగా ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుని జల్సాలు చేసుకుంటున్నారు. తాకట్టు పెట్టిన ఈ సొమ్మును అలాగే వదిలేస్తున్నారు. ఇది ఫైనాన్స్ సంస్థలకు లాభసాటిగానే మారింది. పెరుగుతున్న బంగారు ధరలు వాటికీ లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ప్రతి ఫైనాన్స్ సంస్థ బంగారు అభరణాలను పెట్టుకుంటున్నాయి. 75 శాతం ధరతో కుదవపెట్టుకున్న సొమ్మును పూర్తి ధరకు అమ్ముకు లబ్దిపొందుతున్నాయి.