ఉగాది పురస్కారాలను ఈనెలాఖరు నాటికి పెద్దఎత్తున నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వెలువడ్డాయి. వ్యవసాయ అనుబంధరంగాల్లోని వారికి కూడా ఈ పురస్కారాలు అందజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక శాఖ, సెరికల్చర్, మత్స్యశాఖ, బ్యాంకర్లు, విద్యుత్ శాఖకు సంబంధించిన రైతులు, అధికారులకు ఈ పురస్కారాలు అందజేయనున్నారు. ముఖ్యంగా వ్యవసాయంలో సాగునీటి వసతి కింద అత్యధికంగా దిగుబడి సాధించిన రైతులను ఈ పురస్కారానికి ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఆహార ధాన్యాలు, నూనెగింజలు, వాణిజ్య పంటల్లో అధిక దిగుబడులు సాధించిన వారిని ఎంపిక చేస్తారు. వర్షాధారం కింద కూడా ఈ పంటల్లో అధిక దిగుబడులు సాధించిన వారిని పరిగణలోకి తీసుకుంటారు. ఉద్యానవన శాఖ కింద ఉద్యానవన పంటలు, ఎపిఎంఐపి, ఆయిల్‌పామ్‌లో అధిక దిగుబడులు సాధించిన వారికిస్తారు. పశుసంవర్ధక శాఖలో పాడి, గొర్రెలు, కొళ్ల పెంపకంలో అధిక లాభాలు సాధించిన వారిని ఉత్తమ రైతులుగా ఎంపిక చేస్తారు. మత్స్యశాఖ, సెరిక్చలర్‌లోనూ ఇదే విధంగా ఎంపిక ఉంటుంది. ఇక విద్యుత్ వినియోగంలోనూ చక్కటి మెళకువలు పాటించిన రైతును గుర్తించి సన్మానిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగులో ఉత్తమ సేవలందించిన బ్యాంకరును ఈ సందర్భంగా సన్మానించనున్నారు.
జిల్లా కలెక్టరు అధ్యక్షతన ఎంపిక కమిటీ...
గ్రామీణ ప్రాంతాలు, మండలాల వారీగా ఆయా శాఖల ద్వారా నివేదికలు తెప్పించుకున్న తరువాత పరిశీలించి ఉత్తమ రైతులను ఎంపిక చేస్తారు. ఈ ఎంపిక జిల్లా కలెక్టరు అధ్యక్షతన ఏర్పడిన కమిటీ చేస్తుంది. ఈ కమిటీలో కలెక్టరు అధ్యక్షులుగా ఉంటారు. కన్వీనర్లుగా వ్యవసాయ అనుబంధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు ఉంటారు. కో ఆర్డినేటర్లుగా ఆచార్య ఎన్‌జిరంగా వ్యవసాయ పరిశోధనా క్షేత్రం శాస్త్రవేత్తలు ఉంటారు. వీరందరూ క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన పేర్లను పరిశీలించి ఉత్తమ రైతులను, అధికారులను ఎంపిక చేస్తారు.
సన్మానాలు...
ఉత్తమ సేవలందించిన రైతులు, అధికారులను ఉగాది పురస్కారాల సందర్భంగా సన్మానించనున్నారు. ఉత్తమ రైతులకు ఆకుపచ్చని శాలువాతోపాటు ప్రశంసాపత్రాన్ని, ఐదు వేల రూపాయలు నగదు పురష్కారాన్ని అందజేయనున్నారు. అధికారులకు శాలువ, ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు. ఉగాది పండుగ తరువాత ఈనెల 23 నుంచి 30వ తేదీలోపు జిల్లా మంత్రులు, ఇంఛార్జీ మంత్రి ఇచ్చే సమయాన్ని బట్టి తేదీలను ఖరారు చేస్తారు.