''రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ వచ్చి 20 రోజులు అవుతోంది. ఇంత వరకు రైతుల ఖాతాల్లో ఎందుకు జమచేయలేదు. పాదర్శకంగా పంపిణీ చేపట్టండి, ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి ఇన్‌పుట్ సబ్సిడీని పంపిణీ చేయండి'' అని అధికారులకు కలెక్టర్ దుర్గాదాస్ ఆదేశించారు. ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీలో అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం 245 కోట్ల రూపాయలు ఇన్‌పుట్ సబ్సిడీ ప్రకటించి మూడు వారాలు అవుతున్నా రైతుల ఖాతాలు తెరవకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏ జిల్లాకు కూడా ప్రకటించిన ఇన్‌పుట్ సబ్సిడీ మన జిల్లాకు ప్రకటించిందన్నారు. దీని పంపిణీ చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రెవెన్యూ సమావేశహాలులో కలెక్టర్ అధ్యక్షతన రెవెన్యూ అంశాలపై ఎంపిడిఓలతోను, తహసీల్దార్లతోను ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇన్‌పుట్ సబ్సిడీని రైతుల ఖాతాల్లోకి పకడ్బంధీగా జమ చేయాలన్నారు. తహసీల్దార్లు, బ్యాంకర్లు చిత్తశుద్ధితో పారదర్శకంగా పంపిణీ చేయాలన్నారు. బ్యాంకర్లు పాతబకాయిలకు జమ చేయరాదన్నారు. ప్రతి రైతుకూ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. తహసీల్దార్లు మండలాల్లో పర్యటించి గ్రామాల వారీగా ఖాతాలు లేని రైతుల జాబితాను తయారు చేయాలన్నారు. బ్యాంకర్లతో నేరుగా సంప్రదించి ఇన్‌పుట్ సబ్సిడీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 20వ తేదీలోగా రైతుల ఖాతాలు తెరిపించని పక్షంలో సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంక్రాంతి లోపు జమ చేస్తామని రైతులకు హామీ ఇచ్చామన్నారు. కానీ ఇంత వరకు ఖాతలు ప్రారంభించలేదన్నారు. పండుగ లోపు ఇన్‌పుట్ సబ్సిడీ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. మిగతా జిల్లాలో కూడా ఇదే తరహాలో ప్రజావాణిని నిర్వహించేందుకు శ్రీకారం చుడుతున్నారని తెలిపారు. పొలాల్లో తెరిచి ఉంచిన బోరుబావుల వల్ల చిన్నారులు ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. తహసీల్దార్లు, విఆర్‌ఓలు వాటిని మూసివేయించాలన్నారు. మహాత్మాగాంధీ జతీయ ఉపాధి హామీ పథకం కింద పనులను గుర్తించాలన్నారు. కూలందరికీ పనులు కల్పించాలన్నారు. మూడు రోజుల్లో బిల్లుల చెల్లింపులు జరగాలన్నారు. జెసి అనితారామచంద్రన్ మాట్లాడుతూ జనవరి 18 నుంచి ప్రారంభమవుతున్న రెవెన్యూ సదస్సులను పకడ్బంధీగా నిర్వహించాలన్నారు. అందులో భాగంగా భూసమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు జెసి చెన్నకేశవరావు, డిఆర్‌ఓ సుదర్శనరెడ్డి, ఆర్డీఓలు గౌతమిరెడ్డి, ప్రభాకర్‌పిళ్లై, ఈశ్వర్‌లు, గృహ నిర్మాణ శాఖ పీడీ ప్రసాద్, జడ్పీ సిఇఓ వెంకటసుబ్బారెడ్డి, బిసి కార్పొరేషన్ ఇడి వెంకటేశం, తహసీల్దార్లు, ఎంపిడిఓలు, బ్యాంకర్లు, తదితరులు పాల్గొన్నారు.