వేసవి కాలంలో గ్రామాల్లో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ చంద్రమౌళి అధికారులను కోరారు. స్థానిక మండల పరిషత్ సమావేశమందిరంలో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి ఆరంభం కావడంతో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని, నీటి ఎద్దడి నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేసి ప్రజలకు తాగునీరందించాలని కోరారు. గ్రామాల్లో ఉన్న నీటి వనరులను సక్రమంగా వినియోగించుకునేలా చూడాలన్నారు. చెడిపోయిన బోర్లను, పూడిక నిండిపోయిన బావులను గుర్తించి వాటికి మరమ్మతులు చేయాలని కోరారు. ప్రజలు తాగునీటికి ఇక్కట్లెదుర్కొంటుంటే తమ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామని తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కరించేందుకు అత్యవసర పరిస్థితి కింద ఎంపిడిఓతో చర్చించి 5వేల రూపాయల వరకు ఖర్చు చేసి నీటి నమస్య పరిష్కరిస్తామని తెలిపారు. సమావేశంలో సప్రంచులు, ఎంపిటిసిలు, కార్యదర్శులు, విఆర్‌ఓలను గ్రామాల్లోని నీటి ఇక్కట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వేలాల సర్పంచ్ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల క్రితం వేసిన నీటి పథకం ఇప్పటికీ గుక్కెడు నీరందించలేకపోతోందని, దీన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని కోరారు. టేకుమట్ల సర్పంచ్ గోనె నర్సయ్య మాట్లాడుతూ ఇంధారం, టేకుమట్ల, రామారావుపేట గ్రామాలకు గోదావరి నీటినందించేందుకు 1.17కోట్ల సేఫ్ నిధులతో నిర్మిస్తున్న పథకం కేవలం ఇంధారం వరకే నీటినందిస్తోందని, ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించి మిగతా పనులు చేపట్టి గ్రామాలు నీరందించాలని కోరారు. పెగడపల్లి సర్పంచ్ మాట్లాడుతూ మాజీ కార్మిక శాఖ మంత్రి గడ్డం వినోద్ చేతుల మీదుగా ప్రారంభించిన ఎస్‌సి కాలనీలో నీటి సరఫరా కోసం వేసిన బోరుకు మోటార్ కనెక్షన్ ఇవ్వకపోడంతో నీరందించడం లేదని సమావేశం దృష్టికి తెచ్చారు. ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులకు నీటి సమస్య తెలిసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సమావేశంలో ఎంపిడిఓ అమరేందర్, జడ్‌పిటిసి చల్లా భారతమ్మ, ఎంపిపి కడారి మల్లీశ్వరి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ, ఎంపిటిసిలు, సర్పంచులు పాల్గొన్నారు.