రాష్ట్ర ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించకుండా ఉపాధిహామీ మేట్లను చిన్నచూపు చూస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ధరపు అశోక్ అన్నారు. స్థానిక మండల కార్యాలయంలో ఉపాధిహామీ మేట్ల మండల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న మేట్లకు ప్రభుత్వం ఎటువంటి సౌకర్యాలు కల్పించడంలేదన్నారు. వేసవికాలంలో ఎండతీవ్రతకు ఎంతోమంది సొమ్మసిల్లి పడిపోయిన సంఘ టనలు ఉన్నాయన్నారు. పనిప్రదేశాల్లో నీడకోసం కనీస టెంట్లు కూడా ఏర్పాటు చేయలేదన్నారు. అదేవిధంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రథమ చికిత్సకోసం కిట్లు అందుబాటులో ఉంచాలని ఎన్నిమార్లు విన్నవించుకున్నా అధికారులు పెడచెవిన పెడుతున్నారని అన్నారు. అలాగే ఉపాధిహామీ కూలీలకు రూ. 150, మేట్లకు రూ. 200 చెల్లించాలని డిమాండ్ చేశారు. మేట్లు ఐక్యంగా ఉండి పోరాడితే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మేట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని అన్నారు. ప్రతినెలా వేతనాలు సక్రమంగా చెల్లించాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 13న నిర్వహించే బాడి సమావేశానికి మేట్లందరూ హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో కొడప ఆనంద్‌రావు, చంద్రబోస్, నాందేవ్, శంకర్, సంతోష్, విఠల్, ఇస్రు, నాగోరావు, గణపతి, అమృత్ పాల్గొన్నారు.