ఖరీఫ్‌లో వర్షాభావంతో పంటలు ఎండిపోయి నష్టాలతో సతమతమైన రైతులకు రబీలోనూ అలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో కుంటలు, చెరువులు ఎండిపోయాయి. దీంతో రబీలో సాగు విస్తీర్ణంలో సగం మాత్రమే పంటలు సాగయ్యాయి. ఇందులో ఎక్కువ శాతం బోరు బావులపై ఆధారపడి రైతులు వరి సాగు చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయంతో వరి పంటలు ఎండిపోతున్నాయి. ఎన్నో ఆశలతో రబీ పంటలు సాగు చేస్తున్న రైతులకు కన్నీళ్లే మిగలనున్నాయి.
జిల్లాలో నెలకొన్న కరువు ప్రభావం రబీ సాగుపై పడింది. సాధారణ సాగులో 50శాతం మాత్రమే పంటలు సాగయ్యాయి. ఖరీఫ్‌లో వర్షాభావం కారణంగా నష్టపోయిన ఎక్కువ మంది రైతులు రబీ పంటల జోలికి వెళ్లలేదు. పంట కాలానికి సాగు నీరు అందుతుందనే భరోసా ఉన్న రైతులు మాత్రమే అక్కడక్కడ విత్తుకున్నారు. కాలువలు, బావులు, చెరువుల కింద వరి సాగు చేసే రైతులు కూడా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించారు. జిల్లాలో సాధారణ సాగు 2.54 లక్షల ఎకరాలు కాగా కేవలం 1.25 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గతేడాది 2.19 లక్షల ఎకరాల్లో రబీ పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది వర్షాభావం వల్ల పంటల సాగుకు రైతులు ముందుకు రాలేదు. రబీలో వరి, జొన్న, శనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు తదితర పంటలు అధిక విస్తీర్ణంలో సాగవుతాయి. అలాంటిది ఈ రబీలో సాగు విస్తీర్ణం పూర్తిగా పడిపోయింది. వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పంట పూర్తి కాలానికి నీరందుతుందనే భరోసా లేకపోవడంతో సాగు విస్తీర్ణం తగ్గింది. ఖరీఫ్‌లో సోయా సాగు చేసిన రైతులు రబీలో శనగ సాగు చేసే వారు. ఏటా రబీలో 40వేల ఎకరాల్లో సాగు కావాల్సిన శనగ ఈ ఏడాది 25వేల ఎకరాలకే పరిమితమైంది. జొన్న 75వేల ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా 35వేల ఎకరాల్లో సాగైంది. ఇతర పంటల పరిస్థితి కూడా అలాగే ఉంది. వరి సాగు కూడా అంతంతమాత్రమే సాగైంది. రబీలో ప్రాజెక్టులు, చెరువులు తదితర నీటి వనరులు కింద సాగు కావాల్సిన వరి ఈ ఏడాది 32వేల ఎకరాలకే పరిమితమైంది. గతేడాది 75వేల ఎకరాల్లో సాగు చేశారు. ఖరీఫ్‌లో నెలకొన్న పరిస్థితులు సైతం వరి సాగు తగ్గించి ఆరుతడి పంటలు సాగు చేసుకునే విధంగా చేశాయి. రైతులు కూడా నీరు, విద్యుత్ సరఫరాపై నమ్మకం లేక వరి సాగు పూర్తిగా తగ్గించారు. చాలా మంది రైతులు పొలాలను బీడుగా వదిలేయగా కొంత మంది ఆరుతడి పంటలు సాగు చేశారు.
విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలు
ఇప్పటికే వర్షాభావం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీని ప్రభావం జలాశయాలు, చెరువులు, కుంటలపై పడింది. దీంతో రైతులు రబీలో ఎక్కువ శాతం బోరుబావుల కింద పంటలు సాగు చేశారు. అయినప్పటికీ విద్యుత్ కోతల కారణంగా వేసిన పంటలు కూడా ఎండిపోతున్నాయి. రబీలో ముఖ్యంగా బోరుబావుల కింద వరి సాగు చేశారు. జిల్లాలో నిర్మల్, మంచిర్యాల డివిజన్లలో ఆరుతడి పంటలకు బదులుగా ఎక్కువగా వరి సాగు చేశారు. వరి సాధారణ సాగు విస్తీర్ణం 54వేల హెక్టార్లు కాగా ఖరీఫ్‌లో 49వేల175 హెక్టార్లలో సాగైంది. ఇందులో బోరుబావుల కింద 12వేల400 హెక్టార్లు. చెరువులు, కుంటల కింద 9వేల280 హెక్టార్లు. కాల్వల కింద 27వేల435 హెక్టార్లలో సాగు చేశారు. అయితే ఖరీఫ్‌లోనే వర్షాభావం నెలకొని పంటలు ఎండిపోవడంతో రబీలో రైతులు ఎక్కువ సాగు చేయడానికి సిద్ధం కాలేదు. దీంతో ఈ సారి 16వేల హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణానికి 12వేల800 హెక్టార్లు మాత్రమే సాగు చేశారు. ఇందులో 9వేల900 హెక్టార్లలో బోరు బావుల కింద సాగైంది. చెరువులు, కుంటల్లో నీరు లేకపోవడంతో బోరుబావులపై ఆధారపడి పంటలు సాగు చేశారు. అయితే విద్యుత్ కోతలు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. అధికారికంగానే వ్యవసాయనికి రోజుకు 7 గంటలపాటు విద్యుత్ కోత పెడుతున్నారు. దీంతో సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయి. దీని వల్ల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.