చలి పులి మళ్లీ విజృంభించింది. నాలుగైదు రోజులుగా జిల్లా వాసులు చలి చప్పేస్తోందని గొణుక్కుంటున్నారు. బారెడు పొద్దిక్కితేగాని జనం దుప్పట్లు తీయడం లేదు. ఇక పిల్లలు, ముసలివారైతే చలికి గజగజ వణికిపోతున్నారు. మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లే వారు చలి తీవ్రతకు వాయిదా వేసుకున్నారు. తుపాన్ ప్రభావంతో ఆకాశం మేఘావృతం కావడంతో జనవరి మొదటి వారంలో చలి ప్రభావమే కనిపించలేదు. ఉష్ణోగ్రతలు ఏకంగా 21 డిగ్రీలకు చేరిపోయాయి. కానీ నాలుగు రోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో ఉష్ణోగ్రతలు 9 డిగ్రీలకు పడిపోవడంతో జిల్లా ప్రజలు వామ్మో..! చలి అంటూ బయటకు రావడానికి జంకుతున్నారు.
జిల్లాలో ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోయాయి. వారం రోజుల క్రితం తుపాన్ ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా చలి తీవ్రత పడిపోయింది. అయ్యో..! అప్పుడే చలికాలం ముగిసిందా? అనే విధంగా పరిస్థితి తయారైంది. కానీ నాలుగైదు రోజుల నుండి చలి పులి మళ్లీ పంజా విసిరింది. దీని ప్రతాపానికి జిల్లా వాసులు వణికిపోతున్నారు. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. సాధారణంగా సంక్రాంతి పండగ పూట చలి తీవ్రత బాగానే ఉంటుంది. కానీ ఈ సారి పండగకు ముందు ఉష్ణోగ్రతల్లో మార్పు రావడంతో చలి పోయిందిలే అని ప్రజలు సంబరపడ్డారు. చలి తీవ్ర పెరగాల్సిన సమయంలో తగ్గిపోవడంతో ఊరట చెందిన ప్రజలు నాలుగు రోజులుగా ఉదయం పూట లేవడానికి జంకుతున్నారు. చలి ఇప్పుడే ఇలా ఉంటే జనవరి నెల ముగిసేలోపు ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో వాతావరణ పరిస్థితులు ఎప్పుడూ భిన్నంగా ఉంటాయి. వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రత, వర్షాకాలం అత్యధిక వర్షపాతం, చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంటాయి. ఈ ఏడు వర్షాలు ఆశించిన స్థాయిలో కురవలేదు. దీంతో ఈ సంవత్సరం చలి తక్కువగా ఉంటుందని భావించారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ చలి ఈ సారి గతంలో కంటే అధికంగా విజృంభిస్తుండడంతో జనం తట్టుకోలేకపోతున్నారు. చలికాలం ప్రారంభమైన తొలిసారి నవంబర్ 21న 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో జనం ఆందోళనకు గురయ్యారు. తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతూ 12-15 డిగ్రీల మధ్య నమోదు కావడంతో జనం కాస్త ఊరటచెందారు. డిసెంబర్ మధ్యలో గరిష్ట ఉష్ణోగ్రత 33.3, కనిష్ట ఉష్ణోగ్రత 9.7గా నమోదైంది. ఆ తర్వాత ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతూ 9.3, 9.2 డిగ్రీల మధ్య కొనసాగింది. 2010 జనవరి 21న 6.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. ఆ తర్వాత ఈ ఏడాది జనవరి 7వ తేదీన 4.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రికార్డును చెరిపేసింది. ఈసారి జనవరి 10న 9డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇలా మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా క్రమంగా ఏటా చలికాలంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ప్రజలు, రైతులు అవస్థలు పడుతున్నారు.
అన్నీ పనులు వాయిదా
చలి తీవ్రత పెరగడంతో చిన్నాపెద్ద పనులను వాయిదా వేసుకుంటున్నారు. ఉదయం పూట చేసే అన్నిరకాల పనులు వాయిదా వేసుకొని మధ్యాహ్న సమయాల్లో చేసుకుంటున్నారు. కానీ రెక్కాడితేగాని డొక్కాడని రోజూ కూలీలు చలిని లెక్కచేయకుండా పనిలో నిమగమైపోతున్నారు. పాలబ్బారు, పేపర్‌బారు, మున్సిపల్ పారిశుధ్యకార్మికులు, హోటల్ నిర్వాహకులు, రోజువారీ కూలీలు, కూరగాయల వ్యాపారులు, చిరువ్యాపారులు ఎంత చలి ఉన్నా రక్షణ ఏర్పాట్లు చేసుకొని పనులకు బయల్దేరుతున్నారు. ట్యూషన్లకు వెళ్లే విద్యార్థులు ఉదయం పూట చలితో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనైతే ఎక్కడా చూసినా చలి మంటలే దర్శనమిస్తున్నాయి. సాయంత్రమైందంటే ఉన్నిదుస్తులు వేసుకుని కనిపిస్తున్నారు. జిల్లా కేంద్రంతోపాటు ముఖ్యమైన మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, భైంసా, నిర్మల్, ఉట్నూర్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాల్లో చలికి ప్రజలు రోడ్డుపైకి రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. సింగరేణి కార్మికులు చలితో కుస్తి పడుతూ ఉదయం పూట విధులకు హాజరవుతున్నారు. చలి తీవ్రత ఉన్నా తప్పనిపరిస్థితుల్లో ఉదయమే లేచి ఇంట్లో పనులు ముగించుకుని విధులకు హాజరుకావాల్సి వస్తోంది. అలాగే రాత్రివేళ కూడా చలిలోనే అవస్థల మధ్య విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. రక్షణ కోసం స్వెట్టర్లు, టవల్ కప్పుకుని విధులకు హాజరవుతున్నారు. మొదటి షిప్టు ఉదయం ఆరుగంటలకు ప్రారంభం కావడంతో కార్మికులు ఉదయం 4 గంటలకే నిద్రలేచి స్నానం చేసి చలిలో విధులకు వెళ్లడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఇక మూడో షిప్టులోని కార్మికులు రాత్రి 11గంటలకు విధులు ముగించుకుని ఇంటికి వెళ్లడానికి అవస్థలు పడుతున్నారు.
జనవరి 1 నుండి ఉషోగ్రతల వివరాలు
తేది కనిష్ట గరిష్ట(డిగ్రీల్లో)
1 21.7 30.8
2 21.7 30.8
3 21,7 30.8
4 19.2 30.8
5 18.2 30.8
6 18.5 30.9
7 18.7 34.5
8 18.2 34.3
9 14.2 33.5
10 13.2 32.3
11 9.2 28.3