బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. వారికి సరైన వసతులు కల్పించకుండా సవతితల్లి ప్రేమ కనబరుస్తోంది. ఇప్పటికీ కొన్ని మండలాల్లో శాశ్వత భవనాలు ఏర్పాటు చేయకపోవడంతో సంక్షేమ వసతిగృహాలు అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయి. వాటిలో సైతం కనీస సౌకర్యాలు కరువై విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అందుకు నిదర్శనంగా బజార్‌హత్నూర్ మండలంలోని ఎస్‌సి బాలుర వసతి గృహాన్ని చెప్పుకోవచ్చు.
బజార్‌హత్నూర్ మండలకేంద్రంలో గల ఎస్ బాలుర వసతిగృహంలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెనుకబడిన తరగతులకు చెందిన పిల్లలకు మంచి పౌష్టికాహారాన్ని అందించి వారి అభివృద్ధికి పాటుపడేందుకు ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లను నెలకొల్పింది. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం పర్యవేక్షణ కొరవడడంతో అవి కాస్త అస్తవ్యస్తంగా మారుతున్నాయి. మరోవైపు లక్షలు వెచ్చించి హాస్టళ్లను అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా అందులో ఏమాత్రం వాస్తవంలేదు. అందుకు ఎస్‌సి బాలుర వసతిగృహమే ఉదారహణ. గత కొన్ని సంవత్సరాలుగా ఇరుకైనా అద్దె గదుల్లోనే వసతిగృహం కొనసాగుతోంది. దీంతో విద్యార్థులు ప్రతి నిత్యం సమస్యలతో సహవాసం చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. వసతిగృహంలో 50 మంది విద్యార్థులు ఉండగా వారికి ఒకే గదిని కేటాయించారు. చేసేదేమీ లేక ఇరుకైనా గదిలోనే అష్టకష్టాలు పడుతూ చదువును కొనసాగిస్తున్నారు. మరొకగదిని వార్డెన్, కామాటీలు విని యోగించుకుంటున్నారు. ఇంకొకదానిని వంటగది కోసం కేటాయించారు. అయితే వసతిగృహంలో కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం దుప్పట్లు కూడా పంపిణీ చేయకపోవడంతో విద్యార్థులు చలికి గజగజ వణికిపోతున్నారు. ఇద్దరు, ముగ్గురు కలిసి ఒకే దుప్పటి కింద తలదాచుకుంటున్నారు. విద్యార్థులకు అందజేసిన ఇనుప పెట్టేలు, ప్లేట్లు రెండు సంవత్సరాల క్రితం నాటివి కావడం గమనార్హం. విచిత్రమేమిటంటే అసలు వసతిగృహంలో వార్డెన్ ఉన్నట్లు చాలామంది విద్యార్థులకు తెలియదు. ఎందుకంటే ఆయన ఎప్పుడొస్తారో, ఎప్పుడెళ్లారో ఎవరికీ తెలియదు. వారానికి ఒకసారి వచ్చి సరుకులు ఇచ్చి వెళ్తుంటారని, వాటినే వారం రోజులపాటు వాడుతామని ఇక్కడి కామాటి చెప్పుకొచ్చారు. మెనుప్రకారం భోజనం పెట్టడంలేదని విద్యార్థులు వాపోతున్నారు. ప్రతిరోజూ సాంబారు, కిచిడి పెడతారని వారు పేర్కొంటున్నారు. వాస్తవానికి వార్డెన్ విద్యార్థులు అందుబాటులో ఉండి వారి యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. కానీ ఆయన పట్టణప్రాంతంలో నివాసముంటూ అక్కడి నుండి రాకపోకలు సాగించడంతో విద్యార్థులను పట్టించుకునేవారే కరువయ్యారు. ఇదంతా పై అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వసతిగృహాల్లో కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా వార్డెన్ సక్రమంగా విధులు నిర్వర్తించేలా చూడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది.