శ్రీవరి సాగు పద్ధతి వల్ల రెట్టింపు దిగుబడులు సాధించొచ్చని భైంసా సబ్‌డివిజన్ వ్యవసాయ శాఖ ఎడిఎ మంగీలాల్ అన్నారు. మండలంలోని దేగాం గ్రామంలో రైతు చంద్రశేఖర్‌రెడ్డి పొలంలో శ్రీవరి పద్ధతిలో దగ్గరుండి గురువారం నాట్లు వేయించారు. ఈ పద్ధతిపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలోని రైతులు, ఆదర్శ రైతులను పిలిపించారు. నారుమడి తయారు చేయు విధానం, పొలం మడులు కట్టడం, నాట్లు వేసే ముందు పొలం తయారు చేయు పద్ధతులను దగ్గరుండి ప్రయోగాత్మకంగా చూపారు. అనంతరం నాట్లు వేయించారు. దండేపల్లి మండలర ధర్మరావుపేటకు చెందిన రైతులు గంగుల రమేష్, తోట బాబన్న, మంతెన భూమయ్యలతో పాటు నాట్లు వేసేందుకు మహిళా కూలీలు వచ్చారు. వీరి సాయంతో చంద్రశేఖర్‌రెడ్డి శ్రీవరి సాగునాట్లు వేయించారు.
ప్రతి గ్రామంలో ఒక్క ఎకరమైన నాటాలి : ఎడిఎ
ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వివిధ మండలాల రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎడిఎ మాట్లాడుతూ శ్రీవరి సాగుతో ఎకరానికి 70 బస్తాల వరకు వరిధాన్యం దిగుబడులు సాధించొచ్చన్నారు. ప్రతి గ్రామంలో రైతులు ముందుకొచ్చి ఒక ఎకరమైనా ఈ పద్థతిలో సాగు చేయాలని కోరారు. కార్యక్రమంలో భైంసా, కుభీర్, తానూర్ ఎఓలు శ్రీనివాస్, రాజశేఖర్‌రెడ్డి, ఇబ్రహీం అనీఫ్, ఎఇఓలు రాజన్న, శ్యాం, సంగీత, భైంసా, తానూర్, ముధోల్, లోకేశ్వరం మండలాల ఆదర్శ రైతులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రెట్టింపు దిగుబడులు: గంగుల రమేష్, రైతు, దండేపల్లి మండలం
నాలుగైదు సంవత్సరాలుగా శ్రీవరి సాగు చేస్తున్నాను. సాధారణ సాగులో 35 నుంచి 40 బస్తాలు దిగుబడి వచ్చేది. ఈ పద్ధతి వల్ల 75 నుండి 80 బస్తాల దిగుబడి సాధించాను. నా అనుభవాలను పలువురితో చెప్పడంతో మా గ్రామంలో చాలా మంది రైతులు శ్రీవరి సాగు చేస్తున్నారు.