చైనా ఆధునీకరణపైనే దృష్టి !

  • జిన్‌పింగ్‌ దార్శనికతకు మద్దతు
  • ముగిసిన సిపిపిసిసి 14వ జాతీయ వార్షిక సమావేశాలు

బీజింగ్‌ : చైనా ఆధునీకరణపైనే పూర్తిగా దృష్టి సారిస్తూ చైనా అత్యున్నత రాజకీయ సలహా సంప్రదింపుల సంస్థ ి చైనా పీపుల్స్‌ పొలిటికల్‌ కన్సల్టేటివ్‌ కాన్ఫరెన్స్‌ (సిపిపిసిసి) 14వ జాతీయ కమిటీ సమావేశాలు ఆదివారంతో ఇక్కడ ముగిశాయి. రెండు సెషన్లుగా జరిగిన ఈ సమావేశాల్లో రాజకీయ సలహాదారులు పలు అంశాలపై సమర్ధవంతమైన, ఆచరణ్మాకమైన చర్చలు జరిపారు. దీర్ఘకాలంగా నలుగుతున్న సమస్యలతో పాటు కొత్తగా ముందుకొస్తున్న సమస్యలపైనా వారు దృష్టి సారించారు. అలాగే కృత్రిమ మేథస్సు (ఎఐ) అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి వ్యూహ రచనతో పాటు ఉపాధి అవకాశాలను పెంపొందించడంపై వారు చర్చించారు. జాతీయాభివృద్ధి నుండి జీవనోపాధి వరకు అన్ని అంశాలు ఈ సమావేశాల్లో చర్చకు వచ్చాయి. ఈ సవాళ్ళన్నీ సమర్ధవంతంగా ఎదుర్కొని, అధిగమించేందుకు సమిష్టిగా కృషి చేయాలని సిపిపిసిసి సంకల్పించింది.
ఈ సంస్థ జాతీయ కమిటీ చైర్మన్‌ వాంగ్‌ హ్యునింగ్‌ ముగింపు సమావేశంలో మాట్లాడుతూ, చైనా కమ్యూనిస్టు పార్టీ (సిపిసి) నేతృత్వంలో చైనా ఆధునీకరణకు సంబంధించి మెరుగైన అవగాహన కలిగిఉండాలన్నారు. వివిధ కోణాల్లో చైనా ఆధునీకరణను మరింత ముందుకు తీసుకెళ్ళడంపై ఈ ఏడాది అనేక ప్రతిపాదనలు వచ్చాయి. కృత్రిమ మేథస్సు (ఎఐ)ను అభివృద్ధిపరచడం వంటి కొత్త అంశాలతో పాటూ దీర్ఘకాలంగా వున్న సమస్యలు – జననాల రేటును పెంచడం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, పేద ప్రాంతాల అభివృద్ధికి దోహదపడడం వంటి అంశాలపై కూడా సవివరంగా చర్చలు జరిగాయి. కొత్త వాతావరణంలో ఈ పాత సమస్యలకు పరిష్కారాలు ఏ విధంగా అందించాలనే అంశంపై రాజకీయ సలహాదారుల నుండి అనేక సూచనలు, ప్రతిపాదనలు అందాయి.
రాజకీయ తీర్మానం
తైవాన్‌ సమస్యను పరిష్కరించేందుకు చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యూహాన్ని అధ్యయనం చేసి అమలు చేయాల్సిందిగా సిపిపిసిసి సభ్యులను రాజకీయ తీర్మానం కోరింది. ఆదివారం ఈ తీర్మానాన్ని ఆమోదించారు. మాతృభూమితో తైవాన్‌ శాంతియుత పునరేకీకరణ తప్పనిసరిగా జరిగి తీరుతుందని ఆ తీర్మానం ఉద్ఘాటించింది. తైవాన్‌ జలసంధి వ్యాప్తంగా వివిధ రంగాల్లో అభివృద్ధి కోసం అన్ని దేశభక్తియుత శక్తులను ఏకతాటిపైకి తీసుకురావాలని కోరింది. హాంకాంగ్‌ ప్రజలు హాంకాంగ్‌ను, మకావో ప్రజలు మకావోను పాలిస్తున్నారని, అత్యంత ఉన్నత స్థాయి స్వయంప్రతిపత్తితో ‘ఒక దేశం, రెండు వ్యవస్థలు’ అన్న సూత్రాన్ని కచ్చితంగా, సమగ్రంగా అమలు చేస్తామని తీర్మానం పేర్కొంది.

జిన్‌పింగ్‌ దార్శనితకు సంపూర్ణ మద్దతు
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ దార్శనికతకు, దేశాభివృద్ది కోసం ఆయన రూపొందించిన ప్రణాళికలకు సిపిపిసిసి వార్షిక సమావేశాలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. వారం రోజుల పాటు సాగిన ఈ సమావేశాలు సోమవారంతో ముగిశాయి. కమ్యూనిస్టు పార్టీపై తన పట్టును మరింత సంఘటితపరుచుకోవడంలో జిన్‌పింగ్‌ విజయం సాధించారని ఆసియా సొసైటీ పాలసీ ఇనిస్టిట్యూట్‌కి చెందిన నీల్‌ థామస్‌ వ్యాఖ్యానించారు.

➡️