చట్టాలు ఆయుధాల వంటివి. అన్యాయాన్ని ఖండించి, బాధితులకు న్యాయం కలిగించడానికి ఉద్దేశించినవి. అయితే, వాటిని అమలు చేయడంలో అనేక ఇబ్బందులు ఉంటున్నాయి. చాలా సందర్భాల్లో అమాయకులు, నేరస్తులు కేసుల్లో ఇరికించబడుతున్నారు. విచారణ ఖైదీలుగా ఏళ్ల తరబడి జైళ్లల్లో మగ్గుతున్నారు. ఒకవేళ వాళ్లమీద ఆరోపణ రుజువై శిక్షపడినా, అది విచారణ ఖైదీలు అనుభవిస్తున్న జైలు జీవితం కంటే చాలా తక్కువే ఉంటుందనేది ఒక సర్వే ద్వారా సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది.
మన చట్టాలు బ్రిటిష్ కాలం నాటివి. స్వాతంత్య్రం తర్వాత కొన్ని సవరణ చట్టాలు, కొన్ని కొత్త చట్టాలు వచ్చాయి. అయితే, కాలమాన పరిస్థితులు, సాంఘిక, సామాజిక మార్పులకు అనుగుణంగా చట్టాలు చేయడంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పార్లమెంటులో ప్రభుత్వానికి తగిన మద్దతు కొరవడటం, తార్కికంగా విశ్లేషించి బిల్లులకు మద్దతు ఇవ్వటం ఇవ్వకపోవటానికి బదులు కేవలం అధికార పార్టీకి వ్యతిరేకత చూపటానికే కొన్ని పార్టీలు ప్రాధాన్యతనిస్తుండటం, చట్టాల రూపకల్పనలో జాప్యానికి కారణమవుతున్నాయి.
క్రిమినల్ చట్టాలు పదునుగా లేకపోతే, నేరస్తులు విచ్చలవిడిగా వ్యవహరిస్తారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారు. చట్టంలోని లొసుగులు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటారు. చట్ట వ్యాఖ్యానాలు కేసు తీర్పుల్లో కీలకపాత్ర పోషిస్తాయి. తెలివిగల న్యాయవాది తన తర్కంతో వ్యాఖ్యానాన్ని తనకి అనుకూలంగా మార్చుకుని తెలిసిన నేరస్తుణ్ని రక్షించగలడు. కేసు గెలవడం కన్నా న్యాయం గెలవడం చాలా ముఖ్యం. కానీ, ఈ దృష్టి కొరవడటం వల్లనే నిందితులు తప్పించుకోవడం, అమాయకులు శిక్షలకు గురవటం జరుగుతోందని విశ్లేషకుల అభిప్రాయం. సుప్రీంకోర్టు కూడా ఇలాంటి అభిప్రాయం వెలిబుచ్చింది. ఢిల్లీ హైకోర్టు తీర్పు ఈ అభిప్రాయాన్ని బలపరుస్తూ ఇచ్చిన తీర్పు పరిశీలిద్దాం.
వివరాలు : 1984లో దేశరాజధాని ఢిల్లీలోని త్రిలోక పురి ప్రాంతంలో ఇందిరా గాంధీ హత్యానంతరం, సిక్కుల మీద జరిగిన మూకదాడుల కారణంగా ఎందరో అమాయకులు చనిపోయారు. రాజకీయ కారణాల వల్ల నిందితుల్లో కీలకమైనవారు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అయితే, సిక్కుల డిమాండ్లు, ప్రభుత్వ మార్పిడి వంటివి పునఃవిచారణకు కారణమయ్యాయి. సుప్రీంకోర్టుకి వచ్చిన అభ్యర్థనలు కూడా సుమారు డెబ్బై మంది నిందితులకు శిక్ష పడేలా చేసింది. దీనిమీద వారు ఢిల్లీ హైకోర్టు అప్పీలు చేసుకున్నారు. అక్కడ కూడా వారికి చుక్కెదురైంది. హైకోర్టు తన తీర్పులో క్రిమినల్ చట్టాలు తగినంత పదునుగా లేవు. నిందితులకు రాజకీయ శక్తులు రక్షించడానికి విచారణ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడానికి ప్రోద్బలం చేస్తున్నాయి. సాక్ష్యాల సేకరణతోబాటు వాటిని భద్రపరచడంలో కూడా తగు శ్రద్ధ చూపటంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన వార్తాపత్రికలు, మీడియాల ద్వారా లభించే సమాచారం, ఫొటోలను స్వీకరించాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి.. అని వ్యాఖ్యానించింది. ఆయేషా కేసులో కూడా ఆం.ప్ర.హైకోర్టు ఇలాంటి అభిప్రాయాన్నే వెలిబుచ్చింది. నేర నిర్ధారణ సవ్యంగా జరిగేలా 1952 నాటి విచారణ కమిషన్ చట్టం. 1993 నాటి మానవహక్కుల చట్టాలను సవరించాలని సూచించడం గమనార్హం.
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్,
న్యాయ నిపుణులు