ఏడాదికి ఏడాది ఎండలు పెరిగిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటేనే భయమేస్తుంటుంది. కానీ, తప్పని పరిస్థితుల్లో ఏంచేస్తాం.. చలువద్దాలు ధరించి, ముఖాన్ని కర్చిఫ్‌తో కప్పుకునో, గొడుగు వేసుకునో బయటకు వెళతారు. కళ్లపై కాంతి తీవ్రత పడకుండా ఉండేందుకు సన్‌గ్లాసెస్ తప్పక వాడతారు. అయితే వీటి తయారీలో ఎక్కువగా ప్లాస్టిక్‌ను వాడుతున్నారు. దానివల్ల కలిగే నష్టం అందరికీ తెలిసిందే. ఉక్రెయిన్‌కు చెందిన 'మాక్స్ గావ్రిలెంకో' తొలిసారిగా పర్యావరణహిత కళ్లజోళ్లను కాఫీ వ్యర్థాలతో రూపకల్పన చేసి మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇవి శరీరానికి, ప్రకృతికి మేలు చేస్తాయంటున్నాడు. మరి వాటి గురించి తెలుసుకుందామా...!
పర్యావరణహిత వస్తువులకు మార్కెట్లో ఎంతో డిమాండ్ పెరిగింది. వీటిని వాడేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. ఈ కోవలో సన్‌గ్లాసెస్ కూడా పర్యావరణహితమైనవి మన మధ్యకు రానున్నాయి.
'మాక్స్ గావ్రిలెంకో' తండ్రికి కళ్లజోళ్ల షాపు, వర్క్‌షాపు ఉన్నాయి. మాక్స్ చిన్నప్పటి నుంచి వర్క్‌షాపులో తన తండ్రి తయారు చేస్తున్న కళ్లజోళ్లను గమనిస్తుండేవాడు. తానూ డిఫరెంట్‌గా ఏదైనా చేయాలనుకున్నాడు. దీని కోసం రీసెర్చ్ చేసి సేంద్రీయ కళ్లజోడుల తయారీ మొదలుపెట్టాడు. ఐదు రకాల మోడల్స్‌లో వీటిని తయారు చేశాడు.
గ్రావిలెంకో మొదట్లో 'ఆకిస్ కాఫీపై దృష్టి పెట్టలేదు. వెదురుతో ఈ ఫ్రేమ్‌ను ఉత్పత్తి చేయాలనుకున్నాడు. కానీ, తన బృందంతో కలిసి పెట్రోలియం ఉత్పత్తులను నిషేధించాలనుకుని, వాటికి బదులుగా పాడైపోయిన కాఫీగింజలు, అవిసెగింజలు, సోయాబీన్ జిగురుతో వీటి తయారీ మొదలుపెట్టారు. కాఫీగింజల సేకరణ కోసం 'ఆకిస్ కాఫీ కంపెనీ'ని స్థాపించాడు. దీని ద్వారా పాడైపోయిన కాఫీగింజలను సేకరించి వాటిని రోస్ట్ చేసి తయారీలో వాడుతున్నారు.
ప్లాస్టిక్ వాటికన్నా అందంగా....
సాధారణంగా మనం ధరించే సన్‌గ్లాసెస్ ప్లాస్టిక్‌తో తయారై చాలా తేలికగా ఉంటున్నాయి. కానీ, గ్రావిలెంకో తయారు చేసిన కళ్లజోళ్లు ప్లాస్టిక్‌తో తయారు చేసిన వాటికన్నా చాలా తేెలికగా, అనువుగా ఉంటాయి. వీటికి అమర్చిన సెల్యూలోజ్ అద్దాలు యువిఫిల్టర్గా పనిచేసి తీవ్ర కాంతిని అడ్డుకుంటాయి. వీటికున్న ఫ్లెక్సిబుల్ టెంపుల్స్ ధరించేవారి సైజును బట్టి అమర్చుకోవచ్చు. ఇవి అందరి ముఖాలకు సరిపోతాయి. కళ్లజోడు ఫ్రే˜మ్ నుంచి అప్పుడే వేపిన కాఫీ గింజల సువాసన వస్తుంటుంది. వీటిని తాకినప్పుడు చాలా మృదువుగా ఉంటాయి. ఈ సన్‌గ్లాసెస్ ప్లాస్టిక్ వాటికన్నా 100 రెట్లు వేగంగా భూమిలో డీకంపోజ్ అయి సహజమైన ఎరువుగా తయారౌతాయి. తద్వారా మొక్కలకు పోషకాహారంగా పనిచేస్తుందంటున్నారు గ్రావిలెంకో. కళ్లజోళ్ల తయారీలో 15 సంవత్సరాల అనుభవం వల్ల వీటిని తయారు చేయడంలో మంచి క్వాలిటీలో చేయగలుగుతున్నారు. వీటి తయారీలో డిజిటల్ మెషీన్‌ను ఉపయోగించి వీటిని కట్ చేస్తారు. ఆ తర్వాత చేతితో తుది మెరుగులు దిద్దుతారు. ఇలా తయారైన కళ్లజోడు ఎంతో మన్నికైనదిగా ఉంటుంది. ఈ ఫ్రేమ్ దాదాపు 5 సంవత్సరాలపాటు విరిగిపోకుండా ఉంటుంది. 3 మీటర్ల ఎత్తు నుంచి కిందికి పడేసినా ఈ ఫ్రేమ్ విరగదంటున్నారు తయారీదారులు. 39 సార్లు దీనిని చేతులతో మలుస్తూ కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ మెషీన్ ద్వారా దీనిని సరియైన రీతిలో కట్ చేస్తారు. ఇలా తయారుచేసిన వాటి గురించి ఆకిస్ సంస్థ ప్రచారం మొదలుపెట్టింది. ఈ ప్రచారం ద్వారా అతి తక్కువ సమయంలోనే వారనుకున్న లక్ష్యాన్ని సగభాగం అందుకోగలిగారు.