ఎండ కోపంగా ఉంది. గవర్నమెంటు ఆస్పత్రి మీద మరీ కోపంగా ఉంది. ఎక్కడా నీడనివ్వగల చెట్లు లేకపోవడంతో, ఎండ కోపాన్ని రోగులే భరిస్తున్నారు. చెమటలతో తడిసిపోతున్నారు. గాలికోసం అల్లాడుతున్నారు. గర్భిణులు తమ వంతు కోసం నిరీక్షిస్తూ, ఎప్పుడు పిలుస్తారా..! అని లేడీ డాక్టరు రూమ్కేసి అదేపనిగా చూస్తున్నారు.
సూరమ్మ అసలు పేరు సూర్యకాంతం. తన పేరుగల పడతి అనే జాలి కూడా లేకుండా సూర్యుడు వేడి వేడి వెలుగు బాణాలతో వేధిస్తున్నాడు. దాహం వేసినప్పుడల్లా వెంట తెచ్చుకున్న ప్లాస్టిక్ బాటిల్లోంచి కొద్ది కొద్దిగా నీళ్లు చప్పరిస్తోంది.
వైద్యానికి డబ్బులు వెచ్చించలేని బీద బతుకులకు గవర్నమెంటు అస్పత్రే దిక్కు. ఉచిత సేవలు చేసేవాళ్లు అనుచితంగా ప్రవర్తించడం షరామామూలు. సూర్యకాంతానికి పెళ్లై రెండేళ్లయ్యింది. కాపురానికి వచ్చిన నాటినుంచీ ఎప్పుడు నీళ్లుపోసుకుంటుందా అని అత్త ఆరాటపడింది. మూడు నెలలు ఓపిక పట్టంది. ఇక లాభం లేదని కోడల్ని వెంటబెట్టుకుని గుళ్ల చుట్టు తిప్పింది. మొక్కులు మొక్కింది. ముడుపులు కట్టింది. ఏదీ పనిచెయ్యకపోయే సరికి కోపంతో రగిలిపోయింది. కోడల్ని తిట్టి చివరకు 'దేవుడు మన మాట వినడు. పద నీకూ, నా కొడుక్కీ వైద్య పరీక్షలు చేయిస్తా'నంటూ తను దాచుకున్న డబ్బులు తీసుకుని ఆస్పత్రికి బయలుదేరింది. లేడీడాక్టరు అన్ని పరీక్షలు చేయించింది. రిపోర్టులు చూసి 'నీ కోడలుదేమీ లోపం లేదు. మీ అబ్బాయి వీర్యకణాలు తక్కువగా ఉన్నాయి. మందులు వాడితే బాగు పడొచ్చు' అంది.
లోపం కొడుకులోనే ఉందనే సరికి ముసల్ది కోడల్ని తిట్టినందుకు సిగ్గుపడింది. 'నువ్వేం బాధపడబాకా ఆడికి నేను వైద్యం చేయిత్తాలే' అంది భరోసా ఇస్తూ.
ముసల్దానికి మొగుడి పెన్షను వస్తుంది.
ముసలాడు రైల్వేలో నాలుగో తరగతి ఉద్యోగం చేశాడు. ఒక రైలు ప్రమాదంలో చచ్చిపోయాడు. అప్పట్నుంచీ ముసల్దానికి గవర్నమెంటు పెన్షను వస్తోంది. కొడుకు ఒక కార్ఖానాలో పనిచేస్తాడు. పనిమంతుడు బుద్ధిమంతుడు. కానీ, ఆదాయం తక్కువ. వేణ్ణీళ్లకి చణ్ణీళ్లన్నట్టు తన పెన్షనులోంచి ఇంటి అవసరాలకి కొంత ఖర్చు పెడుతుంది. ఇప్పుడు కొడుక్కి సంతానయోగం కల్గించేందుకు తన గుప్తనిధిలోంచి ఖర్చు చేస్తోంది. కొడుకు రుపాయి దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటాడు. అది పొదుపులా కనిపించే పీనాసితనం!
ఎప్పుడన్నా అవసరం వచ్చి అడిగితే, ఐదు రూపాయిలు కూడా లేదనేస్తాడు. అది అబద్ధం. డబ్బులు లేక కాదు. ఖర్చు పెట్టాలనిపించక. ముసల్ది డబ్బు అవసరం ఉన్నచోట వెనకాడదు. అవసరం లేకపోతే రూపాయి తియ్యదు. అది తండ్రి నేర్పిన విద్య.
కొడుక్కి మందులు పనిచేశాయి.
కోడలు నెలతప్పింది.
ప్రైవేటు ఆస్పత్రుల్లో కానుపు చేయించే స్తోమత లేదు. సర్కారు దవాఖానే దిక్కు. మూడో నెల నుంచి అక్కడికే వెళ్తోంది. పరీక్షలు చేస్తున్నారు, మందులిస్తున్నారు. శ్రద్ధగా వాడుతోంది. మొగుడు గోడమీద చిన్నికృష్ణుని క్యాలెండరు తగిలించి రోజూ ఆ బొమ్మనే చూస్తుండమన్నాడు. అలాచేస్తే కృష్ణుడిలాంటి అందమైన పిల్లాడు పుడతాడని ఎవరో చెప్పారట.
అది నిజమో అబద్ధమో తెలియదు.
జరుగుతుందో లేదో కూడా తెలీదు.
ఎవరో ఏదో చెప్పారని చెయ్యడమే మూఢ నమ్మకానికి ప్రచారం. రుజువులు లేనివన్నీ గుడ్డినమ్మకాలే. అలాగని చెయ్యకుండా ఉండలేరు.
కొందరు దేవుణ్ణి నమ్మరు. కానీ, దెయ్యాన్ని నమ్ముతారు.
దుష్ట స్వభావం ఉన్న మనిషికంటే మించిన పిశాచం ఎవరు?!
సూరమ్మ వైద్యం ముగించుకుని బయటకు వచ్చేసరికి ఎండ చండ ప్రచండంగా ఉంది. దాహంగా అలసటగా, నీరసంగా ఉండి నడవలేకపోయింది. నిండు గర్భిణి ఏం నడవగలదు? మెట్ల మీదనే కూర్చుండిపోయింది. కడుపులో కల్లోలంగా ఉంది. సన్నగా నొప్పులు మొదలై, అంతకంతకు ఎక్కువైనాయి. ఆమె అవస్థను గమనించిన వాళ్లు వెంటనే నర్సుకి చెప్పారు. నిమిషాల్లో సూరమ్మను 'లేబరు రూమ్'కి తరలించారు.
ప్రసూతి వార్డు వచ్చిపోయే జనాలతో సందడిగా ఉంది.
సూరమ్మ తన కలల పంటని దగ్గరగా హత్తుకుంది. పిల్లాడు బొద్దుగా ముద్దుగా ఉన్నాడు. తొమ్మిది నెలల సృష్టిని చూస్తున్న కొద్దీ సంతోషం పొంగిపోయింది. తను కనదేమో అని బెంగటిల్లిపోయింది. గొడ్రాలు అనిపించుకోవడం ఎంత బాధాకరం. ఏదైతేనేం... అన్నీ అనుకూలించి ఓ బిడ్డకు తల్లైంది. ఈ బతుకుకది చాలు అంటూ కళ్లుమూసుకుంది.
'ఏరు సూరమ్మా.. కాస్త చోటివ్వు..' ఉలిక్కిపడి కళ్లు తెరిచింది. నర్సు ఎవరో గర్భిణిని వెంటబెట్టుకొచ్చింది. ఆశ్చర్యంగా చూస్తున్న సూరమ్మతో 'ఈ అమ్మకు నీ మంచం మీద చోటివ్వు..' మాటల్లో ఎక్కడా మంచితనం లేదు. కరుగ్గా కంకరరాయితో కొట్టినట్లు ఉన్నాయి మాటలు.
'నా మంచం మీదా?!' సందేహిస్తూ అడిగింది సూరమ్మ.
'నువ్వు పక్కకు జరుగుతల్లీ.. ఈ అమ్మని కాస్తా పడుకోని.. ఎక్కడా మంచాలు ఖాళీ లేవు.. నువ్వు ఇక్కడ పడుకోమ్మా..' అంటూ విసవిస వెళ్లిపోయింది నర్సు.
ఇక తప్పదన్నట్టు సూరమ్మ సర్దుకుంది. గర్భిణీ ఆపసోపాలు పడుతూ సూరమ్మ తలవైపు కాళ్లు పెట్టి పడుకుంది. ఇలాంటి అనుభవం సూరమ్మకు కొత్త... అపరిచిత వ్యక్తి పాదాలకు తల తగిలేలా పడుకోవటం. మెల్లగా కళ్లు మూసుకుంది. అంతలో వార్డు చివర కలకలం విన్పించింది. సూరమ్మ ఉలిక్కిపడి లేచింది. మంచం మీద నుంచీ దిగింది.
జనం అటు పరుగులు పెడుతున్నారు. ఎవరో స్త్రీ పెద్దగా శోకాలు పెడుతోంది.
'ఏమైంది?' అటుగా వస్తున్న నర్సునడిగింది.
'పిల్లాడ్ని కుక్క ఎత్తుకుపోయింది..' అంటూనే వెళ్లిపోయింది.
'కుక్క ఎత్తుకుపోయిందా?!' సూరమ్మ గుండె గుభేలుమంది. గవర్నమెంటు ఆస్పత్రిలో పిల్లల్ని అపరిచిత స్త్రీలు ఎత్తుకుపోతారని వింది... ఇలా కుక్కలు కూడా ఎత్తుకుపోతాయా?!
ఇదెక్కడి ఘోరం!
'పిల్లల్ని తల్లి జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే ఇలాగే జరుగుతాయి..!' కాస్త అవతలగా మంచం దగ్గర కూతురికి సాయంగా వచ్చిన ముసలమ్మ వ్యాఖ్యానించింది.
సూరమ్మకి అత్త గుర్తొచ్చింది. ప్రసవం కాగానే వచ్చి మనవణ్ణి చూసుకుని మురిసిపోయింది. మొగుడి సంబరం సంగతి చెప్పనే అక్కర్లేదు! పగలు వచ్చిపోతోంది అత్త. రాత్రులు ఉండటం కుదరదు. ఇంటి దగ్గర లేకపోతే దొంగల భయం మొగుడు పడుకుంటే కుంభకర్ణుడే. ఏనుగులు తొక్కినా లేవడు. గురక పెట్టాడంటే, పక్కింట్లో దొంగతనానికి వచ్చిన దొంగ ధైర్యంగా ఇటొస్తాడు. గతంలో అలా రెండుసార్లు జరిగింది. అందుకే 'రాత్రులు రావటం కుదర్దు సూరమ్మా...! నువ్వే జాగ్రత్తగా చూసుకో' అనేసింది అత్త. మొగుడు కూడా పగలే వచ్చిపోతున్నాడు. రాత్రులు మగవారిని ఉండనివ్వరు. వార్డు బయట చెట్టుకింద పడుకోవాల్సిందే.
పగలంతా వార్డు సందడిగానే ఉంటుంది.
రాత్రి ముదురుతున్న కొద్దీ నిశ్శబ్దంతో వార్డు నిండిపోతుంటుంది. పసిపిల్లలకి దోమలు కుట్టినప్పుడు ఏడుస్తుంటారు. అంతలోనే తల్లి జోకొట్టి బాధని మరపింపజేస్తుంది. అంతకు మించి పెద్దగా నిశ్శబ్దానికి నిద్రాభంగం ఉండదు.
వార్డులోకి కుక్కలు యథేచ్ఛగా వచ్చిపోతుంటాయి. ఆస్పత్రివాళ్లు ఉచితంగా ఇచ్చే రొట్టె రుచించక కుక్కలకి పడేస్తుంటారు. తనూ పడేసింది. రొట్టెతో ఆకలి తీరాక విశ్వాసంతో తోక ఆడిస్తూ కాసేపు తన బెడ్ దగ్గర నిలబడి వెళ్లిపోతాయి.
అలాంటిది కుక్కలు పసిపిల్లల్ని ఎత్తుకుపోవడం ఏమిటి? పిల్లల్ని తినేస్తాయా? సూరమ్మ అలా పడుకోగానే పసిపిల్లల్ని కుక్కలు పీక్కుతింటున్న భయంకర దృశ్యం ఊహలో మెదిలింది. కంపించిపోయింది. పిల్లాడికేసి చూసింది. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. తనలో తను నవ్వుకుంటున్నాడు. తను లేవగానే మంచాన్ని పంచుకుంటున్న గర్భిణి వత్తిగిలి తనచోటు ఆక్రమించింది. పాదాలు పిల్లాడికి తగుల్తున్నాయి. తట్టిలేపి, సర్దుకు పడుకోమని చెప్పి మళ్లీ తన జాగాలో నడుంవాల్చింది. పిల్లాణ్ని గుండెలకదుముకుంది 'నిద్ర మానుకునైనా బిడ్డని కాపాడుకోవాలి' అనుకుని చాలాసేపు నిద్రతో పోరాడి ఓడిపోయింది.
వార్డు కూడా నిద్రలోకి జారుపోయింది. ఒకరాత్రివేళ ప్రసూతి నొప్పుల బాధకి ఆపసోపాలు పడుతున్న గర్భిణిని నర్సు లేబరు రూమ్‌కు తీసుకెళ్లింది. సూరమ్మకి మంచం మళ్లీ సౌకర్యంగా ఉంది. ప్రశాంతంగా నిద్రలోకి ఒరిగింది.
'సూరమ్మా నువ్వు మంచం ఖాళీ చేసి బయట వరండాలో పడుకోవాలి. రేపు నిన్ను పంపించేస్తారు. కొత్తగా డెలివరీ అయిన వాళ్లకి మంచాలు లేవు... నువ్వు త్వరగా బయటకెళ్లు' నర్సు తొందరపెట్టింది. సూరమ్మ అయిష్టంగానే పిల్లాణ్ని తీసుకుని వరండాలో నేల మీద వేసిన పక్క సరిచేసుకుని పడుకుంది. పరిశీలించి చూస్తే ఇంకా అలాంటి పక్కలు చాలా కనిపించాయి. నిట్టూరుస్తూ నడుం వాల్చింది.
మనసు నిండా ప్రశ్నలు కష్టాలన్నీ బీదవాళ్లకేనా? బీదరికం శాపమా? తమకే డబ్బులుంటే ఈ గతి పట్టేదా? ఆలోచన్లతో అలిసిపోయి నిద్రలోకి జారుకుంది.
అందులో కల. ఏదో అందమైన తోట. పైన వెన్నెల. పిల్లాడు కేరింతలు కొడుతూ పరుగులు తీస్తున్నాడు. పట్టుకుందామంటే చేతికందటంలా...
'బాబు.. ఆగు..' అంటూ అరుస్తూ వెంటపడుతోంది. పక్కలోని పిల్లాడు పెద్దగా ఏడవటంతో ఉలిక్కిపడి లేచింది. ఎక్కణ్ణుంచి వచ్చాయో ఎలుకల మంద.. పిల్లాణ్ని పీక్కు తినేస్తున్నాయి. సూరమ్మకు క్షణకాలం ఏమీ అర్థం కాలా అంతలోనే ఆవేశం పొంగుకొచ్చింది. అందిన ఎలుకను అందినట్టు పట్టుకుని గట్టిగా గోడకేసి కొట్టసాగింది.
పిల్లాడి కండలన్నీ ఊడబీకాయి. తట్టుకోలేక మరణ రోదన చేస్తున్నాడు పసివాడు. ఎలుకలు మళ్లీ మళ్లీ దాడి చేస్తూనే ఉన్నాయి. సూరమ్మ ఎలుకల్ని తోలడానికి విఫలయత్నం చేస్తుంది. చివరికి పిల్లాడ్ని భుజానికెత్తుకుంది. తల వాల్చేశాడు చిధ్రమైన శరీరంలోంచి పిల్లాడి ప్రాణం అనంతంలోకి నిశ్శబ్దంగా నిష్క్రమించింది. ఒక బతుకు మొగ్గగానే రాలిపోయింది. ఆ తల్లి గుండె పగిలిన చప్పుడు ఎవరికి వినిపిస్తుంది.
- కేఆర్ట్టీ
98495 68901
బతుకు
