ఎన్నికల్లో ఎన్‌ఆర్‌ఐలు

Apr 29,2024 00:43 #election

– కొందరు ప్రత్యక్ష పోటీ

– ప్రచార బాధ్యతల్లో మరికొందరు

– ప్రధాన పార్టీలకు ప్రవాసాంధ్రుల మద్దతు
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలూ తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. అధికార వైసిపి తిరిగి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జట్టుగా వస్తున్నాం.. ఈ ఎన్నికల్లో ఓట్లు చీలనీయకుండా మేమే అధికారంలోకి వస్తామంటూ టిడిపి, జనసేన, బిజెపి నేతలు చెబుతున్నారు. అయితే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది సస్పెన్స్‌గా మారింది. సంక్షేమ జపాన్ని వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌ వల్లెవేస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తామని, ఉద్యోగాలు ఇస్తామంటూ చంద్రబాబు కూడా హామీలు గుప్పించేస్తున్నారు. తాను పోటీచేసే స్థానంలో సహా జనసేన పోటీచేస్తున్న 21 నియోజకవర్గాల్లో రెబల్స్‌, వ్యతిరేకత మూటగట్టుకున్న పవన్‌కల్యాణ్‌ సైతం గెలిచేస్తామంటూ బీరాలు పలుకుతున్నారు. క్షేత్రస్థాయి రాజకీయాలు మరోలా ఉంటున్నాయి. గ్రామాల్లో పెత్తందారులు, ఆయా పార్టీల్లో కీలక స్థానాల్లో ఉన్నవారు సైతం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో ప్రతిరోజూ ఉదయం అల్పాహారం దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం, రాత్రికి డిన్నర్‌ సైతం గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మరో గమ్మత్తు ఏమిటంటే గ్రామాల్లో చదువుకుని విదేశాల్లో స్థిరపడిన వారైన ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) ఈ ఎన్నికల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐలు చెబితే ఓట్లు పడతాయనే భావనలో వైసిపి, కూటమి (టిడిపి, జనసేన, బిజెపి) వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. చదువు, ఉద్యోగంతోపాటు కుల, మత, ప్రాంతం అంశాలను ప్రభావితం చేసేలా ఎన్‌ఆర్‌ఐలను ప్రోత్సహిస్తున్నారు. వైసిపి, కూటమి తరపున ఆరునెలల నుంచి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఏర్పాట్లు జరిగాయి. ఎన్నికల్లో ఎలా పనిచేయాలి, అభ్యర్థుల విజయం కోసం ఎలా కృషి చేయాలి, ఓటర్లను ఎలా ప్రభావితం చేయాలనే అంశాలపై ప్రధానంగా కేంద్రీకరించాయి. సొంత నియోజకవర్గం, లేదా బలహీనంగా ఉన్న రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం, లేదా కీలక నియోజకవర్గాల్లో పనిచేసేలా ప్రతిఒక్కరికీ మూడు ఆప్షన్లను టిడిపి కూటమి ఇచ్చింది. అవసరం ఉన్న, సామాజిక బలం కోసం, అభ్యర్థుల అవసరాల మేరకు ఆయా నియోజకవర్గాలను వైసిపి కేటాయించి పనిచేయాలని నిర్ధేశించింది. ఏదేమైనా ఆయా పార్టీలకు అనుబంధంగా వివిధ దేశాల్లో పనిచేస్తున్న ఎన్‌ఆర్‌ఐలు ఈ ఎన్నికల్లో తమవంతుగా కృషిని ఇప్పటికే కొనసాగిస్తున్నారు.
వైసిపి ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆధ్వర్యాన కూడా ఎన్నికల ప్రచారంలో ఎన్‌ఆర్‌ఐలు విస్తృతంగానే కృషి చేస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐ వైసిపి ద్వారా తమ ప్రాంతాల్లో ప్రభావితం చేసేలా కృషి చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఆ దిశగా ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో వైసిపికి అనుకూలంగా పనిచేస్తున్నారు. ఏ దేశంలో పనిచేస్తున్నా ఈ ఎన్నికల్లో మాత్రం వచ్చి వైసిపికి అనుకూలంగా పనిచేయాలని కోరుతున్నారు. నియోజకవర్గాల ఎంపిక వారికే అవకాశం ఇచ్చారు. పట్టున్న ప్రాంతాల్లోనే పనిచేయాలని సూచించారు. వైసిపి సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జి సజ్జల భార్గవరెడ్డి, ఆయన బృందం కూటమి ఎత్తుగడులను సోషల్‌ మీడియా ద్వారా తిప్పికొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నెల 23న విశాఖపట్నంలో వైసిపి సోషల్‌ మీడియా ప్రతినిధులు, ఎన్‌ఆర్‌ఐ వింగ్‌తో సిఎం వైఎస్‌ జగన్‌ ముఖాముఖీ గానూ, మరికొందరితో అదే వేదికపైనా ఆన్‌లైన్‌ ద్వారా ముచ్చటించారు. ఏదేమైనా ఈ ఎన్నికల్లో ఎన్‌ఆర్‌ఐలు ఎంతమంది ఓటర్లను ప్రభావితం చేస్తారో వేచి చూడాల్సిందే.
– నివాస్‌

➡️