బాగ్దాద్ : ఇరాక్ ప్రధానమంత్రి ఆదెల్ అబ్దుల్ మహదీ రాజీనామాను ఆ దేశ పార్లమెంటు ఆదివారం నాడు ఆమోదించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు నెలలుగా జరగుతున్న ఆందోళనల్లో వివిధ ఘటనల్లో ఇప్పటి దాకా 420 మంది పైగా చనిపోయారు. ఈ నేపథ్యంలో షియా మత గురువు గ్రాండ్ అయతుల్లా అలీ సిస్తానే జోక్యం చేసుకోవడంతో మహాదీ రాజీనామా చేయకతప్పలేదు. ప్రధానమంత్రి పదవికి ఆయన శనివారం రాజీనామా చేసారు. ఆయన తన రాజీనామా లేఖను పార్లమెంట్‌కు సమర్పించారు. మహదీ రాజీనామాపై చర్చించిన సభ్యులు ఆదివారం ఆమోదం తెలిపారు. ప్రధానమంత్రి పదవికి కొత్త పేరును సూచించాల్సిందిగా దేశాధ్యక్షుడు బర్హం సాలేV్‌ాను స్పీకర్ తెలిపారు.
రాజీనామా సరిపోదంటున్న నిరసనకారులు
ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలకు తలొగ్గి ప్రధాని రాజీనామా చేసినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావని ఆందోళనకారులు స్పష్టం చేశారు. ప్రధాని రాజీనామా ప్రకటనతో సంతృప్తి చెందని ఆందోళనకారులు తమ ఆగ్రహాన్ని మతపెద్దలపైకి మళ్లించారు.
నజాఫ్ నగరంలో ఒక ప్రార్థనా మందిరం ప్రవేశ ద్వారాన్ని దగ్ధం చేసిన ఆందోళనకారులు, తమపై బాష్పవాయు ప్రయోగంతో చెదరగొట్టేందుకు ప్రయత్నించిన భద్రతా దళాలతో ఘర్షణకు దిగారు. మరికొందరు ఆందోళనకారులు ప్రార్థనా మందిరాన్ని దగ్ధం చేసిన వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇరాక్ దక్షిణ ప్రాంతంలోని నస్సినియా, నజాఫ్ నగరాలలో పెద్దయెత్తున ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. నజాఫ్ నగరంలో ఇరాన్ కన్సలేట్ కార్యాలయ భవనాన్ని గత బుధవారం ఆందోళనకారులు దగ్ధం చేయటంతో ఈ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి.