* త్రిపుర మాజీ సిఎం మాణిక్ సర్కార్
ప్రజాశక్తి ప్రతినిధి, కోల్‌కతా : ప్రభుత్వ ఉన్మాద చర్యలను తిప్పి కొట్టాలని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ పిలుపునిచ్చారు. పశ్చిమ మిడ్నపూర్ జిల్లా నందిగ్రామ్ 1 బ్లాక్‌లో పెద్ద ఎత్తున హాజరైన ప్రజలనుద్దేశించి మంగళవారం ఆయన ప్రసంగించారు. గత ఎన్నికలలో త్రిపురలో వామపక్ష ప్రభుత్వం ఓడిపోయిన తరువాత రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శించారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కార్మికుల ఐక్య పోరాటం వల్ల ఆగిపోయిందన్నారు. నియంతృత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా జెఎన్‌యు విద్యార్ధులు జరిపిన స్ఫూర్తిదాయక పోరాటం కూడా కార్మికులు జరిపే పోరాటాలకు నమూనాగా ఉంటుందన్నారు. ఉగ్ర రాజకీయాలను ఓడించాలన్నారు. ఎన్ఆర్సిని ప్రతిఘటించడంలో తృణమూల్ కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎత్తి చూపారు. రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించడమే ఎన్ఆర్సి లక్ష్యంగా ఉందన్నారు. త్రిపుర ప్రజలు ఇప్పుడు తమ అంచనాలు తప్పాయన్న వాస్తవాన్ని తెలుసుకుంటున్నారన్నారు.. త్రిపురను సురక్షితమైన పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని, గ్రామీణ ఉపాథి హామీ కింద 200 రోజులు పని కల్పిస్తామని ఇచ్చిన హామీలను బిజెపి నిలబెట్టుకోలేకపోవడంతో తాము మోసపోయిన సంగతి తెలుసుకున్నారన్నారు. ప్రతి స్థాయిలోనూ బిజెపి ఘోరంగా విఫలమైందన్నారు. ప్రజల కోసం లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం సృష్టించిన మౌలిక సదుపాయాలు కనిపించకుండా పోయాయని, ఆర్థికంగా వెనుకబడిన ప్రజల కోసం రూపొందించిన 33 సామాజిక సబ్సిడీ పథకాలు ఇప్పుడు నిలిచిపోయాయన్నారు. ప్రజలలో అసంతృప్తిని ప్రక్కదారి పట్టించేందుకు బాలకోట్, పుల్వామా సంఘటనలను ఉపయోగించుకుని మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా యుద్ధోన్మాదాన్ని, మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని ఆయన ధ్వజమెత్తారు.
ప్రభుత్వ ఉన్మాద చర్యలను తిప్పి కొట్టండి
