* వేలాది మందితో భారీ ర్యాలీ
కొచబాంబా: మాజీ అధ్యక్షుడు ఎవో మొరేల్స్ వ్యతిరేక కుట్రను నిరసిస్తూ ఆందోళన చేసిన వారిపై భద్రతా దళాలు కొనసాగించిన ఊచకోతపై భారీయెత్తున నిరసన వెల్లువెత్తింది. కొచబాంబ నగరంలో ప్రభుత్వ ఊచకోతను నిరసిస్తూ వేలాది మంది ప్రజలు వేర్వేరుగా మూడు భారీ ప్రదర్శనలు నిర్వహించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని స్వయం ప్రకటిత అధ్యక్షురాలు అనీజ్ నేతృత్వంలోని నియంత సర్కారుకు చరమగీతం పాడాలని వారు నినాదాలతో హోరెత్తించారు. మాజీ అధ్యక్షుడు మొరేల్స్కు మద్దతుగా కొచబాంబా నగరంలో గత శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న వారిపై బలీవియా భద్రతా దళాలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి ఊచకోతగా మారటంతో భద్రతా దళాల చేతుల్లో తొమ్మిది మంది ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఊచకోతను నిరసిస్తూ కొచబాంబా నగరంలో సోమవారం నాడు వేలాది మంది ప్రజలు మూడు ప్రాంతాలలో వేర్వేరుగా భారీ ప్రదర్శనలు నిర్వహించారు.
నకిలీ ట్విట్టర్ ఖాతాలు
మొరేల్స్ వ్యతిరేక కుట్రను సమర్ధించిన దాదాపు 68 వేలకు పైగా నకిలీ ట్విట్టర్ ఖాతాలను తాజా అధ్యయనం వెలుగులోకి తెచ్చింది. బలీవియా కుట్రకు మద్దతుగా దాదాపు 68 వేలకు పైగా నకీలీ ఖాతాలను సృష్టించినట్లు స్పెయిన్కు చెందిన పొడెమాస్ పార్టీ సోషల్ నెట్వర్క్స్ విభాగం ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడయినట్లు ఆ విభాగం ప్రతినిధి జులియన్ మాషియస్ తోవర్ చెప్పారు.
బొలీవియాలో సర్కారీ ఊచకోతపై వెల్లువెత్తిన నిరసన
