ప్లాస్టిక్... ఈ పదం వింటేనే ఉలికిపడే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. పర్యావరణానికి ప్లాస్టిక్ కలిగించే హాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. అయితే, అడ్వాన్స్డ్ ప్లాస్టిక్‌తో ఈ సమస్యను అధిగమించడంతో పాటు, పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందవచ్చని సిపెట్ డైరెక్టర్ అండ్ హెడ్ వి.కిరణ్ కుమార్ తెలిపారు. ప్రజాశక్తి అమరావతి బ్యూరో ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పర్యావరణానికి హాని చేయని ప్లాస్టిక్ టెక్నాలజీతో పాటు దాని ఆధారంగా విద్యార్థుల కోసం రూపొందించిన వివిధ కోర్సులను వివరించారు. సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(సిపెట్) కోర్సులను పదోతరగతి, డిగ్రీ అర్హతలతో అందుబాటులోకి తెచ్చామని, కోర్సులు పూర్తికాగానే ఉద్యోగం పొందవచ్చని తెలిపారు. ఇంటర్వ్యూ వివరాలు క్లుప్తంగా :
ప్ర : సిపెట్ కోర్సులను ఎప్పుడు, ఎక్కడ ప్రారంభించారు?
జ : విజయవాడలో తాత్కాలిక భవనాల్లో 2015లో కోర్సులను ప్రారంభించాం. ప్రస్తుతం కృష్ణాజిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో రూ.50కోట్ల వ్యయంతో 12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన శాశ్వత భవనాల్లో ఈ కోర్సులు నిర్వహిస్తున్నాం. సిపెట్ భారత ప్రభుత్వ రసాయనాలు మరియు ఎరువులు మంత్రిత్వశాఖ, రసాయనాలు మరియు పెట్రో రసాయనాల విభాగంలో గత 50 ఏళ్లుగా పనిచేస్తున్న సంస్థ. ఈ సంస్థ ప్లాస్టిక్స్్ రంగంలో నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక సహాయక సేవలు, విద్యాబోధన, పరిశోధన మరియు అభివృద్ధి రంగాలకు అంకితం చేయబడి ఐఎస్ఒ 9001 : 2008, ఎన్ఎబిఎల్, బిఐఎస్, ఐఎస్ఒ 17020, 17025 గుర్తింపు పొందింది.
ప్ర : సిపెట్ ప్రత్యేకత ఏమిటి, సంస్థలో ఎన్ని సీట్లు ఉన్నాయి?
జ : విద్యార్థులకు ప్లాస్టిక్స్తోపాటు వాటి అనుబంధ పరిశ్రమలకు వారి అవసరాలకు అనుగుణంగా తగిన సాంకేతిక శిక్షణ ఇస్తుంది. సాధ్యమైనంత త్వరగా వారిని పరిశ్రమల్లో ఉద్యోగాలకు పంపిస్తోంది. ప్రస్తుతం లాంగ్ టర్మ్ సీట్లు 330, షార్ట్ టర్మ్ సీట్లు 530 ఉన్నాయి. 55మంది అత్యుత్తమ బోధనా సిబ్బంది, 40 మంది టెక్నికల్ ఇన్స్ట్రక్టర్లు సంస్థలో పనిచేస్తున్నారు. వచ్చే ఏడాది లాంగ్‌టర్మ్, షార్ట్ టర్మ్ రెండింటిలోనూ 5వేల మందికి శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం.
ప్ర : ప్లాస్టిక్‌ను నిషేధించాలని కలెక్టర్ల నుండి ప్రధాని వరకు చెబుతున్నారు కదా...
జ : పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ను నిషేధించాలని మేమూ చెబుతున్నా.ం గతంలో ఉన్న టెక్నాలజీ కంటే 20శాతం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన కోర్సులను మేము అందిస్తున్నాం. మేమందిచే టెక్నాలజీతో ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్ ఉత్పత్తుల వల్ల పర్యావరణానికి హాని ఉండదు. అదేవిధంగా ఇటీవల రీసైక్లింగ్ పద్దతి, ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్లు వేసేందుకు, ఆయిల్ తీసేందుకు ఇలా వివిధ రూపాల్లో పర్యావరణానికి హాని చేకూరని విధంగా టెక్నాలజీని ప్రవేశపెట్టాం.ఈ కోర్సులతో విద్యార్థుల భవిష్యత్తుకు ఎటువంటి ఢోకా లేదు. ప్లాస్టిక్‌కు అన్ని రూపాల్లో ప్రత్నామ్నాయం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు సిపెట్ విద్యాసంస్థలను నెల్లూరుజిల్లా నాయుడుపేట, విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వం త్వరలో స్థాపించబోతుంది.
ప్ర : కోర్సులు ఎన్ని రకాలు, వాటికి అర్హతలేమిటి?
జ :సిపెట్ రెండు రకాల కోర్సులు అందిస్తోంది. అవి : 1. డిప్లమో, 2. పిజి డిప్లమో. డిప్లమో కోర్సు వ్యవధి మూడేళ్లు. పిజి డిప్లమో కోర్సు కాల వ్యవధి సంవత్సరంన్నర. డిప్లమో కోర్సుకు అర్హత పదోతరగతి, పిజి డిప్లమో కోర్సుకు ఏదైనా కెమిస్ట్రీ సబెక్టుతో కూడిన బిఎస్సి డిగ్రీ ఉంటే చాలు. అయితే ఈ కోర్సులు చదవాలనుకునే వారు ఆలిండియా సిపెట్ జెఇఇ ఎంట్రన్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ ఎంట్రన్స్ పరీక్షను సాధారణంగా ప్రతి సంవత్సరం మే నెలలో నిర్వహిస్తారు. ఫిబ్రవరి నెల నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకోవడం, పరీక్ష రాయడం రెండూ ఆన్‌లైన పద్ధతిలోనే. మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు చేసుకునే వీలుంది.
ప్ర : కోర్సుల ఫీజు, సౌకర్యాల వివరాలు?
జ : సంవత్సరానికి రెండు సెమిస్టర్లు ఉంటాయి. ఒక్కో సెమిస్టర్‌కు డిప్లమో కోర్సుకు రూ.16,800, పిజి డిప్లమో కోర్సుకు రూ.20వేలు. అర్హతగల విద్యార్థులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వం నుండి ఫీజురీయింబర్స్‌మెంటు సౌకర్యం ఉంది. విద్యార్థులు చెల్లించే ఫీజు మొత్తం రీయింబర్స్‌మెంటు ద్వారా తిరిగి పొందవచ్చు. అంటే ఉచితంగా ఈ కోర్సులు పూర్తిచేసుకునే అవకాశం ఈ సంస్థలో ఉంది. సంస్థలో అత్యాధునిక ల్యాబ్‌లు, సెంట్రల్ అండ్ డిజిటల్ లైబ్రరీ, అతిపెద్ద వర్క్‌షాపులు ఏర్పాటుచేశాం. విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణపై ప్రత్యే శ్రద్ధ తీసుకుంటున్నాం.
ప్ర : సిపెట్ ఇంకా ఏవైనా కోర్సులు అందిస్తుందా?
జ : మెషిన్ ఆపరేటర్, ఇంజక్షన్ మోడలింగ్, రీసైక్లింగ్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి వృత్తివిద్యా కోర్సులు, షార్ట్‌టర్మ్ కోర్సులను సిపెట్ ఉచితంగా అందిస్తోంది. శిక్షణా కాలంలో విద్యార్థులకు ఉచిత వసతి, భోజన ఏర్పాట్లు కూడా ఉంటాయి. ఈ కోర్సులు 3-6 నెలల వ్యవధిలో ఉంటాయి. కోర్సు పూర్తికాగానే సంస్థ ఆధ్వర్యంలోనే ఉపాధి అవకాశాలు పొందవచ్చు. ప్రారంభ నెలసరి వేతనం రూ.10వేలు ఉంటుంది. ఈ కోర్సులకు పదోతరగతి(పాస్/ఫెయిల్), ఇంటర్(పాస్/ఫెయిల్), ఐటిఐ(పాస్/ఫెయిల్), డిప్లమో (పాస్/ఫెయిల్) అయిన వారు అర్హులు.
ప్ర : ఉద్యోగాలు, వేతనాల వివరాలు?
జ : కోర్సు పూర్తయ్యేలోపు సంస్థకు అనుబంధంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్లాస్టిక్ రంగం ఎంఎన్‌సి కంపెనీలతో ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తాం. కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగంలో చేరొచ్చు. ప్రారంభ నెలసరి వేతనం రూ.15 వేలు, పిజి డిప్లమో కోర్సు చేసిన వారికి రూ.15వేలు-22వేల వరకు ఉంటుంది.