* డివైఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి అభయ్ ముఖర్జీ
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం :
కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ విధానాల వల్ల దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని డివైఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి అభయ్ ముఖర్జీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అంగన్వాడీ ఉద్యోగులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరుగుతున్న ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ 9వ అఖిల భారత మహాసభ సోమవారం రెండో రోజు జరిగింది. ఈ సందర్భంగా ఆయన సౌహార్థ్ర సందేశమిచ్చారు. పాలకుల తీరు వల్ల మనదేశంలో 58 శాతం మంది యువతకు ఉద్యోగాలు రావడం లేదని తెలిపారు. ఉపాధి కల్పనలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. మన దేశంలో నిరుద్యోగం ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. ఉద్యోగ కల్పనకు పోరాడుతున్నామన్నారు. అఖిల భారత కిసాన్ సభలు నవంబరు 11న నిర్వహించినప్పడు పలు అంశాలు సభ దృష్టికొచ్చాయన్నారు. అర్బన్ ప్రాంతంలోని యువతకు జాతీయ ఉపాధి హామీ చట్టం సక్రమంగా అమలు కావడంలేదని తెలిపారు. ఉపాధి పనులు కల్పించాలని, వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పోరాటాలకు యువకుల మద్దతు కూడగడుతున్నామన్నారు. బిజెపి ప్రభుత్వం ప్రాంతాలు, మతాలు, కులాలవారీగా దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతూనే ఉందని విమర్శించారు. ప్రజల మధ్య అనైక్యత సృష్టించి, విధ్వేషాలను మరింతగా రెచ్చగొడుతోందన్నారు. 'ఎస్సి, ఎస్టిలపై పెద్దఎత్తున దాడులు జరుగుతున్నా పట్టించుకోవడంలేదు. మహిళలకు సమాన హక్కులు కల్పించడంలేదు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా, నియంతృత్వంగా వ్యవహరిస్తోంది. దేశంలో చాలా క్షిష్టమైన పరిస్థితులున్నాయి. ప్రజలను చైతన్యపరిచి, హక్కుల సాధనకు పోరాడాల్సి ఉంది.' అని పేర్కొన్నారు. .
ప్రభుత్వ విధానాలతో పెరుగుతున్న నిరుద్యోగం
