- ప్రయివేట్ పరం కానున్న ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థలైన ఎయిర్ ఇండియా, భారత్ పెట్రో లియం కార్పొరేషన్ల విక్రయం వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి కావచ్చునని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆమె వెల్లడించారు. ఎయిర్ ఇండియా రూ.58 వేల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలిపారు. విక్రయానికి సంబంధించిన కార్యాచరణను ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేయాలని భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా భారంగా పరిణమించడంతో పెట్టుబడుల ఉపసంహరణ తప్పదని ఈ నెల మొదటివారంలో ఎయిర్ ఇండియా ఛైర్మన్ అశ్వని లోహాని సిబ్బందికి ఒక బహిరంగ లేఖ రాశారని వెల్లడించారు. ఎయిర్ ఇండియాలో వాటాలు కొనుగోలు చేసేందుకు పెట్టుబడిదారులు ఉత్సాహం కనబరుస్తున్నారని సీతారామన్ తెలిపారు.
ఎయిర్ ఇండియా, బిపిసిఎల్ పరిస్థితి ఏమిటి?
పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. గతేడాది ఎయిర్ ఇండియాలో 76 శాతం వాటాలను విక్రయించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. అప్పుల భారినపడిన సంస్థను కాపాడేందుకు ఐదేళ్ల సమయం ఇవ్వాలని పార్లమెంటరీ ప్యానెల్ కమిటీ చేసిన సిఫార్సును సైతం అప్పట్లో ప్రభుత్వం తోసిపుచ్చింది. అయినప్పటికీ, ఎయిర్ ఇండియా కొనుగోలుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో వంద శాతం వాటాలు ప్రభుత్వం కిందే ఉన్నాయి. 76 శాతం వాటాలు విక్రయించినా, 24 శాతం వాటాలతో ప్రభుత్వ జోక్యం అధికంగా ఉంటుందని పెట్టుబడిదారులు భయపడుతున్నందునే గత ఏడాది వాటాల విక్రయానికి స్పందన రాలేదని ఏవియేషన్ కన్సల్టెన్సీ సంస్థ సెంటర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ ఒక నివేదికలో పేర్కొంది. చమురు కంపెనీలకు చెల్లింపులు, విదేశీ నష్టాల రూపంలో ఎయిర్ ఇండియాకు గత ఆర్థిక సంవత్సరంలో ప్రధానంగా రూ.4600 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని, 2019-20లో చేపట్టే కార్యాచరణతో లాభదాయకంగా మారే అవకాశం ఉందని సీనియర్ అధికారులు తెలిపారు.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్) విషయంలో, కార్యదర్శుల బృందం అక్టోబర్లో కంపెనీ మొత్తం 53.29 వాటాను విక్రయించడానికి అంగీకరించింది. భారత్ పెట్రోలియం మార్కెట్ విలువ సుమారు రూ.1.02 లక్షల కోట్లు. బిపిసిఎల్లో ప్రభుత్వానికి ఉన్న 53 శాతం వాటాలను రూ. 65వేలకోట్లకు విక్రయించాలని భావిస్తోంది.
మార్చిలోగా అమ్మేస్తాం
