- ప్రజాశక్తి మాజీ ఎడిటర్ వినయకుమార్
- 'ప్రపంచశాంతి పరిరక్షణ ఆవశ్యకత' అంశంపై సెమినార్
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
సామ్రాజ్యవాద ముసుగులో సమాజంలో హింస కొనసాగుతోందని, దాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిన అవసరముందని ప్రజాశక్తి దినపత్రిక మాజీ ఎడిటర్ ఎస్.వినయకుమార్ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని లిటిల్ బర్డ్స్ స్కూల్లో అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఆధ్వర్యంలో 'ప్రపంచశాంతి పరిరక్షణ ఆవశ్యకత' అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. వినయకుమార్, సామాజిక వేత్తలు రఘుపాల్, కేవీఎల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వినయకుమార్ మాట్లాడుతూ యుద్ధోన్మాదం మానవాళీ మనుగడకు పెనుప్రమాదమని హెచ్చరించారు. సామ్రాజ్యవాదం పేరుతో గుత్తాధిపత్యం సాధించుకునేందుకు అనేక చిన్న చిన్న దేశాలపై అమెరికా యుద్ధాలు చేస్తూ ఆ దేశాలను నిర్వీర్యం చేస్తున్నదన్నారు. చమురుపై ఆధిపత్యం కోసం అనేక దేశాలు యుద్ధాలకు సిద్ధపడుతున్నాయని వివరించారు. నేడు విదేశీ పెట్టుబడులు భారతదేశంలో గుత్తాధిపత్యాన్ని అమలు చేస్తున్నాయనీ, అందులో భాగంగానే ప్రస్తుతం హైదరాబాద్లో అన్ని బడా కార్పొరేట్ ఆస్పత్రులు మొత్తం విదేశీ పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లాయనీ చెప్పారు. యూరప్ దేశాలలో విద్య, వైద్యం అక్కడి ప్రజలకు ఉచితంగా అందిస్తున్నారనీ, మనదేశంలో మాత్రం ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయనీ వాపోయారు. మనుషుల మధ్య, దేశాల మధ్య విద్వేషాలను తొలగించి ప్రజలు సుఖసంతోషాలతో మెలగాలని కోరుకోవడమే ప్రపంచ శాంతి సంఘం లక్ష్యమని వెల్లడించారు. భారతదేశంలోనూ అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఏర్పడిందన్నారు. సెమినార్లో సిపిఎం వనపర్తి జిల్లా కార్యదర్శి ఎండీ.జబ్బార్, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డి.చంద్రయ్య తదితరలు పాల్గొన్నారు.
సామ్రాజ్యవాద ముసుగులో హింస
