* జాయింట్ కలెక్టర్-2 శివారెడ్డి
ప్రజాశక్తి- కడప అర్బన్
భారతీయ తత్వవేత్త, కవి, సంగీత కారుడు భక్త కనకదాస చేసిన రచనలు సామాన్యులకు సైతం అర్థమయ్యేవని కడప జిల్లా జాయింట్ కలెక్టర్-2 శివారెడ్డి పేర్కొన్నారు. బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కడప కలెక్టరేట్లోని సభాభవన్లో కనకదాస జయంత్యుత్సవాలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన శివారెడ్డి మాట్లాడుతూ కర్ణాటక సంగీతం కోసం కనకదాస ఎనలేని సేవలు చేశారన్నారు. సాధారణ కన్నడ భాషలో ఎన్నో కీర్తనలు రచించారని తెలిపారు. సమాజాన్ని అన్ని కోణాల్లో సూక్ష్మ పరిశీలన చేశారని పేర్కొన్నారు. కనకదాస సైన్యంలో పనిచేసినట్లు అతని కీర్తనలు ఆధారంగా తెలుస్తోందన్నారు. ఒకసారి యుద్ధంలో తీవ్రంగా గాయపడిన ఆయను అనూహ్య రీతిలో ప్రమాదం నుంచి తప్పించుకుని తరువాత తత్వజ్ఞానాన్ని అలవర్చుకున్నారని తెలిపారు. కుర్వ సామాజిక తరగతికి చెందిన కనకదాస అప్పట్లోనే కులవివక్షతను ఎదుర్కొన్నారన్నారు. అనంతరం పలువురు కురవ సంఘ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల పైచిలుకు కురవ కుటుంబాలు ఉన్నాయని, ప్రభుత్వం వీరిని గుర్తించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖ అధికారి గోపాల్ పాల్గొన్నారు.
సామాన్యులకు అర్థమయ్యేలా కనకదాస రచనలు
