* రివ్యూ పిటిషన్ల కొట్టివేత
న్యూఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో కేంద్రంలోని మోడీ సర్కార్‌కు సుప్రీంకోర్టు మరోసారి క్లీన్చిట్ ఇచ్చింది. రాఫెల్‌పై గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చుతూ.. ఈ కేసును పున:పరిశీలించాల్సిన అవసరం లేదని న్యాయస్థానం గురువారం పేర్కొంది. రివ్యూ పిటిషన్లపై గతంలో విచారణ పూర్తి చేసిన ఉన్నత న్యాయస్థానం ఈ ఏడాది మే 10న తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. ఫ్రెంచ్కు చెందిన దసాల్ట్ ఆవియేషన్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో అవకతవలు జరిగాయని గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2018, డిసెంబర్ 14న సంబంధిత పిటిషన్లను కొట్టివేస్తూ కేంద్రానికి క్లీన్చిట్ ఇచ్చింది. దీంతో ఈ తీర్పును పున:పరిశీలించాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్శౌరీలతో పాటు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు కోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోరు నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంపై తాజాగా తీర్పు వెల్లడించింది. సమీక్ష పిటిషన్లకు ఎలాంటి అర్హత లేదని గొగోరు, ఎస్కె పాల్, కెఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. రాఫెల్ విమానాల కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గతంలో కోర్టుకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చిందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఎటువంటి అధికారిక సంతకం లేని సీల్డ్‌కవర్‌ను కోర్టుకు అందించిందని తెలిపారు. తమ పిటిషన్లపై బహిరంగ కోర్టులో మౌఖిక విచారణ చేయాలని కోరారు. దీనికి కౌంటర్‌గా కేంద్రం మీడియా కథనాల ఆధారంగానే పిటిషన్‌దారులు కేసు తీర్పును పున:సమీక్షించాలని అడుగుతున్నారని కోర్టుకు తెలిపింది. రాఫెల్ డీల్‌కు సంబంధించి కేంద్రం కోర్టుకు అన్ని వివరాలు సమర్పించలేదని పలు మీడియా సంస్థలు కథనాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఏంటీ వివాదం.?
వాయుసేన బలోపేతంలో భాగంగా ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఇది. కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ-2 ప్రభుత్వ హయాంలోనే ఈ ఒప్పందంపై నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత కేంద్రంలో వచ్చిన మోడీ సర్కార్ దీన్ని కొనసాగించింది. యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ఫ్రాన్స్‌లోని దసాల్ట్ ఏవియేషన్ సంస్థకు భారత్ భాగస్వామిగా అనిల్ అంబానికి చెందిన రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్‌ను బిజెపి ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో రిలయన్స్ సంస్థను నిబంధనలకు విరుద్ధంగా ఎంపిక చేశారని కాంగ్రెస్‌తో సహా పలు ప్రతిపక్షాలు విమర్శించాయి. 36 యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి రూ.58 వేల కోట్ల ఒప్పంద వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించాయి. ప్రాథమికంగా నిర్ణయించిన ధర కంటే అనంతరం మార్పులు చేసి అధికంగా చెల్లిస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది. ఒప్పందానికి సంబంధించి వివరాలను కేంద్ర దాచిపెడుతోందని రాహుల్‌తో సహా పలువురు నేతలు ఆరోపించారు.