- సంస్కరణల ఫలితమే ఆర్థికమాంధ్యం
- ప్రొఫెసర్ జయతి ఘోష్
ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో
దేశం ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లడానికి 1990 నాటి ఆర్థిక సంస్కరణలు పునాదులు వేశాయని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యు) ప్రొఫెసర్ జయతి ఘోష్ అన్నారు. ఈ విధానాలు 2000 వరకూ బాగున్నట్లుగాను, అందరికీ ఉద్యోగాల కల్పన, కొనుగోలు శక్తి పెరిగినట్లు గాను కనిపించాయన్నారు. బ్యాంకులు కూడా విరివిగా రుణాలు ఇవ్వడంతో ఈ విధానాలను చాలామంది సమర్థించారన్నారు. కానీ ఇప్పటి ఆర్థికమాంద్యానికి ఆ సంస్కరణలు ఆజ్యం పోయగా, మోడీ విధానాలు మరింతగా తోడయ్యాయన్నారు. గురువారం విశాఖలోని పౌరగ్రంథాలయంలో 'ఆర్థికమాంద్యం - కారణాలు - చిక్కులు - నివారణలు' అనే అంశంపై జరిగిన సెమినార్లో ఆమె ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వాలు జిడిని ఏడు శాతం నుంచి ఎనిమిది శాతం సాధించినట్లు చెప్పుకుంటూ వాస్తవాలను దాస్తున్నారన్నారు. వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు దేశం వెలిగిపోతుందని చెప్పుకుంటున్నా మాంద్యం ఉందన్నది వాస్తవమన్నారు. 2000 నుండి విదేశీ పెట్టుబడులు పెరిగాయని, ఆ పెట్టుబడులు మన దేశ సహజ వనరులను తరలించుకుపోవడానికే వచ్చాయని వివరించారు. పారిశ్రామికవేత్తలకు రాయితీలివ్వడం, రైతులకు రుణాలివ్వకపోవడం, కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకపోవడం వంటి విధానాలను ప్రభుత్వాలు అనుసరించడం వల్లనే 2012 నుంచి దేశంలో పరిస్థితులు మారిపోయాయన్నారు. 2011-12 నుంచి 2017-18 మధ్య కాలంలో ప్రయివేటీకరణ పెరిగి దేశంలో మొత్తంగా 90 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారన్నారు. ఇందులోనూ ఉపాధి కోల్పోయిన వారిలో ఎక్కువగా మహిళలలే ఉన్నారన్నారు. పెద్ద నోట్ల రద్దు, జిఎస్టి వంటి వాటిని మోడీ ప్రభుత్వం అమలు చేయడంతో రాత్రికి రాత్రే అసంఘటిత రంగంలోని కార్మికులు ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. మధ్య, చిన్న తరహా పరిశ్రమలు మూతపడటంతో లక్షలాది మంది ఉద్యోగాలు పోయి రోడ్డున పడ్డారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ రోజువారీ కూలి దొరక్క ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను నిర్వీర్యం చేసే దిశగా మోడీ ప్రభుత్వ విధానాలున్నాయన్నారు. బ్యాంకింగ్రంగం దెబ్బతిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు రుణాలు, రాయితీలివ్వడం, కార్మికులకు మెరుగైన వేతనాల అమలు, యువతకు పెద్దఎత్తున ఉపాధి కల్పిస్తే కొనుగోలు శక్తి పెరిగి ఆర్థికమాంద్యం నుండి దేశం బయటపడుతుందన్నారు. ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేసన (ఎఐఐఈఎ) విశాఖ డివిజన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సెమినార్‌కు ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కెవి.రమణ అధ్యక్షత వహించారు. ఎఐఐఈఎ విశాఖ డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కామేశ్వరి, రమణాచలం, పెద్ద సంఖ్యలో కార్మికులు, మహిళలు, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
రుణాల,ఉపాధి మాంద్యానికి పరిష్కారం
