గాజా: మంగళవారం ఉదయం గాజాలో ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడుల్లో 10 మంది పాలస్తీనీయులు మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ కాల్పుల్లో మరో 10 మంది గాయపడ్డారని, వీరిలో అధికశాతం మంది సాధారణ పౌరులేనని అది తెలిపింది. పాలస్తీనాకు చెందిన ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్ గ్రూప్ అధినేత బహా అబూ అల్ అత్తా, అతడి భార్య వారి ఇంటిలో వున్న సమయంలో ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడికి ప్రతిగా పాలస్తీనా మిలిటెంట్ దళాలు రాకెట్ దాడులకు దిగాయి. ఈ వైమానిక దాడిలో తమ నేత అబూ అల్ అత్తా మరణించినట్లు ఇస్లామిక్ జిహాద్ సాయుధ విభాగం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ దాడికి తాము తగిన విధంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఆ సంస్థ స్పష్టం చేసింది. పాలస్తీనా భూభాగం నుండి తమ భూభాగంపైకి అనేక రాకెట్లు ప్రయోగించారని, వాటిని తమ సైన్యం మార్గమధ్యంలోనే అడ్డుకున్నదని, మరికొన్ని రాకెట్లు ఖాళీ ప్రదేశాలలో పడిపోయాయని ఇజ్రాయిల్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇజ్రాయిల్ దాడుల్లో 10 మంది పాలస్తీనీయుల హతం
