ప్రజాశక్తి - రాజమహేంద్రవరం క్రైం
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం వెలుగుబందలోని నన్నయ యూనివర్సిటీలో ఎంఎ ఇంగ్లీషు విద్యార్థినులను వేధిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ ఎన్.సూర్యరాఘవేంద్రను ఆయన స్వస్థలమైన కృష్ణా జిల్లా నందిగామలో పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నన్నయ విశ్వవిద్యాలయంలో ఎంఎ ఇంగ్లీష్ విభాగాధిపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ నిమ్మగడ్డ సూర్యరాఘవేంద్ర విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, సెల్ ఫోన్ ద్వారా అసభ్యకర మెసేజ్‌లు పెడుతూ వారిని లైంగికంగా వేధిస్తున్నట్లు సిఎం జగన్ పేషీకి ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. ప్రొఫెసర్‌ను అరెస్టు చేసి, విద్యార్థినులకు న్యాయం చేయాలని కోరుతూ ఐద్వా, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీసులు రాఘవేంద్రపై 489/2019 అండర్ సెక్షన్ 354 (ఎ), 354 (డి), 509, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇతన్ని శుక్రవారం రాజమహేంద్రవరం కోర్టులో హాజరుపరచనున్నారు.
లైంగిక వేధింపుల కేసులో 'నన్నయ' ప్రొఫెసర్ అరెస్టు
