- క్రమంగా హైస్కూల్స్ అప్గ్రేడేషన్
- 70 వేల మంది ఉపాధ్యాయులకు ఆంగ్లంలో శిక్షణ
- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో
ప్రతి మండలంలో ఒక జూనియర్ కళాశాల వుండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అందుకు తగ్గట్టుగా భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేయాలని, ఉన్నత పాఠశాలలను క్రమంగా ప్లస్ టూ వరకూ పెంచాలని ఆదేశించారు. ఎక్కడెక్కడ, ఏ విధంగా చేయాలనే అంశాలపై ప్లాన్ సిద్ధం చేయాలని చెప్పారు. పాఠశాల విద్యాశాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఉన్నత పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా మారిస్తే ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు పది వరకే బోధిస్తారా లేక వారినీ అప్గ్రేడ్ చేస్తారా అనే అంశంతోబాటు పర్యవేక్షణ డిఇఒనే చేస్తారా లేక డివిఇఒనా వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేగాక కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన విద్యావిధానం ముసాయిదాలో ఉన్నత పాఠశాలలను పదో తరగతి వరకు కాకుండా పన్నెండు వరకూనని పేర్కొంది. ముఖ్యమంత్రి ప్రతిపాదనను బట్టి రాష్ట్రప్రభుత్వం కూడా ఈ ముసాయిదాను ఆమోదించే వైపు అడుగులు వేస్తుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ప్రతి మండలానికో పాఠశాల బాగుచేయాలనే తరహాలోనే ప్రతి నియోజకవర్గానికి ఒక కళాశాల చొప్పున బాగుచేయడంపై ప్రణాళిక వేయాలని సిఎం ఆదేశించారు. 'నాడు-నేడు' కార్యక్రమం కింద మొదటి విడతలో 15,410 పాఠశాలల్లో 9 రకాల కనీస వసతులను కచ్చితంగా కల్పించాలని, ఇందులో అన్ని విభాగాల పాఠశాలలు ఉండేలా చూడాలన్నారు. 2020 మార్చి 14 నాటికి తొలిదశ పాఠశాలలను పూర్తి చేస్తామని అధికారులు ముఖ్యమంత్రితో అన్నారు. పాఠశాలల బాగుకోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తల్లిదండ్రులు ప్రశంసిస్తున్నారని వివరించారు. బడుల బాధ్యత విద్యార్ధుల తల్లిదండ్రులదే అన్న భావన కలిగించాలని సిఎం చెప్పారు. పాఠశాలల అభివృద్దిలో పూర్వ విద్యార్ధుల సహకారం తీసుకోవాలని, అందుకోసం ప్రభుత్వం ప్రచారం చేయాలని వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి 1 నుంచి 8వ తరగతి వరకూ ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుందని, తర్వాత 9,10 తరగతులకూ ఉండాలన్నారు. 70వేల మంది ఉపాధ్యాయులకు ఆంగ్ల బోధనలో శిక్షణ ఇవ్వాలన్నారు. డైట్స్ కళాశాలలను బలోపేతం చేసి ఆంగ్ల బోధనపై శిక్షణ ఇచ్చేలా ఆలోచన చేయాలని చెప్పారు. విద్యార్ధుల సంఖ్యకు తగినట్టుగా ఉపాధ్యాయులను ఉంచడానికి కసరత్తు చేస్తున్నామని అధికారులు సిఎంకు వివరించగా ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రతి ఏడాది జనవరిలో పూర్తిచేయాలని చెప్పారు. ఏ శాఖ ఏ పరీక్షలు నిర్వహించాలన్నా జనవరిలోనే చేయాలని సూచించారు. పర్యావరణం, వాతావరణ మార్పు, రహదారి భద్రతపై పాఠ్యాంశాలు ఉండాలని తెలిపారు. పుస్తకాలు, ఏకరూప దుస్తులు, బూట్లు, స్కూల్ బ్యాగు అన్నింటినీ వచ్చే ఏడాది నుంచి పాఠశాలలో చేరిన రోజే ఇవ్వాలని, ఎక్కడా ఆలస్యం కాకుండా ప్రణాళిక ఉండాలని ఆదేశించారు. ప్రైవేట్ కళాశాలలకు అనుమతి ఇవ్వడం లేదన్నది అవాస్త మని, సరైన మౌలిక సదుపాయాలు, ఉన్నాయా? లేదా? అన్నది చూస్తున్నామ న్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నామని, ప్రైవేట్ కళాశాలలు, పాఠశా లల్లో సరైన సదుపాయాలు ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం తన పని చేస్తోం దని, ప్రైవేట్ సంస్థలు చేయాల్సిన పనులు అవి చేయాలని చెప్పారు. మధ్యాహ్న భోజనం పధకంలో నాణ్యమైన గుడ్లు విద్యార్ధులకు అందేలా ఎలాంటి విధానాలు అనుసరిం చాలన్నదానిపై మరిన్ని ఆలోచనలు చేయాలని చెప్పారు. ఈ కార్యక్ర మంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్, సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ చినవీరభద్రుడు పాల్గొన్నారు.
మండలానికో జూనియర్ కాలేజి
