* ప్రమాదంలో పర్యావరణం
* పలువురి ఆందోళన
బ్రసీలియా: ప్రపంచంలోనే అతిపెద్ద వర్షపు అడవులుగా పేరొందిన అమెజాన్ అడవులు పెద్ద యెత్తున దగ్ధమవుతుండడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. భూగోళంపై అవసరమైన ఆక్సిజన్‌లో 20 శాతం వరకు అమెజాన్ అడవులే అంది స్తున్నాయి. అనేక విధాలుగా ప్రాధాన్యత సంతరించుకున్న ఈ అడవులు రానురాను అంతరించిపోతుండడంపై పర్యావరణవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచపు ఊపిరితిత్తులు మండిపోతున్నాయని, ఇకనైనా మేల్కొని అమెజాన్ అడవులను కాపాడాలని ముక్త కంఠంతో కోరుతున్నారు. అమెజాన్ రక్షణ కోసం ప్రముఖులు విన్నపాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రే ఫర్ అమెజాన్ అనే హాష్టాగ్ వీపరీతంగా సర్య్కూలేట్ అవుతోంది. భారత్‌లోనూ వివిధ రంగాల ప్రముఖుల తోపాటు బాలీవుడ్, టాలీవుడ్ టాప్ హీరోలు సైతం అమెజాన్ అడవులను రక్షించాలంటూ ట్వీట్లు, పోస్టులు పెడుతున్నారు.
బోల్సనారో హయాంలో అధిక నష్టం
అమెజాన్ వర్షపు అడవుల్లో అత్యధిక భాగం బ్రెజిల్‌లోనే ఉన్నాయి. గత ఏడాది బ్రెజిల్లో అధికార మార్పిడి జరిగి పచ్చి మితవాది బోల్సనారో అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాడు. అప్పటి నుండి అమెజాన్ అడవుల ధ్వంసం బాగా పెరిగిపోయింది. బొల్సనారో హాయంలో బ్రెజిల్ సర్కార్ పర్యావరణ పరిరక్షణకు బడ్జెట్లో 24 శాతం మేర కోత పెట్టింది. దీంతో అమెజాన్ అటవీ పరిరక్షణ చర్యలు కుంటుపడ్డాయి. ఈ ఏడాది జనవరి నుంచే దాదాపు మూడు లక్షల 44 వేల 500 హెక్టార్ల అటవీ భూమి మైదాన ప్రాంతంగా మారిపోయింది. మైనింగ్ మాఫియా ఎక్కడంటే అక్కడ అడువులను తగుల బెట్టి మైదాన ప్రాంతంగా మార్చివేస్తున్నారు. వీరిపై బొల్సొనారో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ ఏడాదిలో బ్రెజిల్లో దాదాపు 77,843 సార్లు అమెజాన్ అడవలకు నిప్పు పెట్టారు. దాదాపు 595 చదరపు కిలో మీటర్ల అటవీ ప్రారతం గత ఏడాది కాలంలో మాయ మయింది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య 25 శాతం భూమి అటవీ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతంగా మారి పోయింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ వేత్తలు, వివిధ రంగాల ప్రముఖుల నుండి నిరసన వ్యక్తమౌతోంది. అమెజాన్ అడవులను రక్షించుకోవాలంటూ వినిపించే గొంతుకలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు అమెజాన్‌ను సంరక్షించడంలో నిర్లక్ష్యంగా వ్యవహ రించిన బోల్సనారో తన రాజకీయ ప్రత్యర్థులపైకి నెపం నెట్టాలని చూస్తున్నారు. అడవులను ప్రభుత్వేతర సంస్థలు (ఎన్జివోలు) తగలబెడుతున్నాయని ఆయన ఆరోపించారు.