- గ్రామస్తుల రాస్తారోకో
ప్రజాశక్తి - యు.కొత్తపల్లి
పెత్తందారుల పైశాచికత్వానికి ఓ దళితుడు బలయ్యాడు. భూమి కోసం అన్యాయంగా హత్య చేశారు. ఈ అనాగరిక సంఘటన తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. యు.కొత్తపల్లి మండలం గోర్స గ్రామానికి చెందిన మడికి అర్జునరావు (60) కొమరగిరిలోని డంపింగ్యార్డు పక్కన ప్రభుత్వ పోరంబోకు భూమి సర్వే నంబర్ 267లో 10 సెంట్లను 20 ఏళ్లుగా సాగు చేసుకుంటు న్నాడు. ఈ భూమి విషయమై ఆ గ్రామానికి చెందిన పెదిరెడ్ల నాగరాజు, పెదిరెడ్ల బాబూరావు మధ్య పలుమార్లు ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం ఈ భూమిని సాగుచేయొద్దని, లేకపోతే అంతుచూస్తామంటూ అర్జునరావును వారు హెచ్చరించారు. ఇదిలా ఉండగా బుధవారం యథావిధిగా పొలం పనికి వెళ్లిన అర్జునరావు చీకటిపడినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుమారులు మడికి కృష్ణ, రాజు, రవి తండ్రి కోసం వెతికారు. కొమరగిరిలోని శ్మశానవాటికలో తండ్రి మృతదేహం కన్పించింది. దీంతో వారు పెదిరెడ్ల నాగరాజు, పెదిరెడ్ల బాబూరావు కలిసి తన తండ్రిని హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వారిని అదుపులోకి తీసుకున్నామని కొత్తపల్లి ఎస్ఐ పార్థసారధి తెలిపారు. ఎస్సి, ఎస్టి, అట్రాసిటీ కేసు, హత్యానేరం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో
దళితుడిని అన్యాయంగా హత్య చేసిన పెత్తందారులను శిక్షించాలంటూ దళిత సంఘాల ఆధ్వర్యంలో గ్రామస్తులు గోర్స గ్రామంలో గురువారం రాస్తారోకో చేపట్టారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ ఆందోళన విరమించబోమని దళిత నేతలు వల్లూరి సత్తిబాబు, పలివెల నవీన్, ద్రాక్షారపు చంద్రరావు, ఏడిద నాగభూషణం డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పిఠాపురం సిఐ సూరి అప్పారావు, కొత్తపల్లి తహశీల్దార్ శివకుమార్ మృతుని కుటుంబ సభ్యులతోను, దళిత సంఘాల నేతలతోనూ చర్చించారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వపరంగా అన్ని రాయితీల కోసం కలెక్టర్కు నివేదిక పంపిస్తానని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. పిఠాపురం సిఐ సూరి అప్పారావు మాట్లాడుతూ మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సి, ఎస్టి, అట్రాసిటీ కేసు నమోదు చేశామన్నారు. మృతుని కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు.
తూర్పు గోదావరిలో దళితుడి హత్య
