- మరో చిన్నారి సురక్షితం
ప్రజాశక్తి- నెల్లూరు :
ప్రమాదవశాత్తు బోరు బావిలో ఇద్దరు చిన్నారులు పడిపోయారు. వారిలో ఒకరు మృతి చెందారు. మరొకరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాళెంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.... ఇరుగుపొరుగు కుటుంబాలకు చెందిన ఇద్దరు చిన్నారులు ఆటలాడుతూ ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిపోయారు. దీన్ని గుర్తించిన చుట్టుపక్కల వారు అధికారులకు సమాచారం అందజేశారు. చిన్నారులను కాపాడేందుకు కలెక్టర్ ఎం.వి.శేషగిరిబాబుకు ఆదేశాల మేరకు అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. బోరు బావికి సమాంతరంగా జెసిబితో మట్టిని తొలగించారు. బోరు బావిలో పడిపోయిన గోపిరాజును సహాయక బృందం సురక్షితంగా బయటకు తీసింది. దీంతో, ఆ చిన్నారి తల్లిదండ్రులు పాపయ్య, నాగమ్మ ఊపిరి పీల్చుకున్నారు. మరో చిన్నారి మోక్షిత (3) బోరు బావిలో సుమారు పది అడుగుల లోతులో చిక్కుకుపోయింది. ఆ చిన్నారిని కూడా సహాయక బృందం ఎంతో కష్టపడి బయటకు తీసింది. అయితే, అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న మోక్షిత...108 వాహనంలో ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. దీంతో, ఆ చిన్నారి తల్లిదండ్రులు పోలమ్మ, ఈశ్వరయ్య కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
చిన్నారిని మింగేసిన బోరు బావి
