- అభివృద్ధి కమిటీ ఛైర్మన్లుగా ఎంఎల్ఏలు
- ఏజెన్సీల్లో వ్యాధుల నియంత్రణ
- కలెక్టర్ల సదస్సులో సిఎం జగన్మోహన్ రెడ్డి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:
ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉండవల్లి ప్రజావేదికలో ఏర్పాటుచేసిన కలెక్టర్ల సదస్సులో ఆయన వైద్యఆరోగ్య శాఖపై చర్చలో మాట్లాడుతూ ఎలుకలు వచ్చి పిల్లలను కొరకడం, టార్చ్ లైట్లో ఆపరేషన్లు చేయడం వంటి సంఘటనలు ఇక జరగకూడదన్నారు. నెట్ వర్క్ ఆస్పత్రులకు వెంటనే బకాయిలు చెల్లించాలని సిఎం అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ. 450 కోట్లు ఉన్నాయని, 9 నెలల నుంచి పెండింగ్‌లో ఉన్న విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే ఆ బకాయిలు చెల్లించాలని చెప్పారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఎక్కడ ఖాళీలున్నా వాటిని భర్తీ చేయాలని అధికారులకు సూచించారు. కుష్టు వ్యాధి పూర్తిగా నిర్మూలన కాలేదని, తనకు పాదయాత్రలో కొందరు వ్యాధిగ్రస్తులు తారసపడ్డారని అన్నారు. ఆ వ్యాధి నివారణ పై దృష్టిపెట్టాలని, మందులు, చికిత్స తదితర అంశాలపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అవసరమైతే కుష్టువ్యాధిగ్రస్తులకు పెన్షన్ పెంచాలని సూచించారు. ఎమ్మెల్యేలను ఆస్పత్రుల అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా నియమించాలని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అంటువ్యాధులను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని, వర్షాకాలంలో వచ్చే జ్వరాలు, ఇతర వ్యాధుల నివారణకు వెంటనే చర్యలు చేపట్టాలని సిఎం అధికారులను ఆదేశించారు. కిడ్నీ వ్యాధి, తలసీమియా వంటి దీర్ఘకాలికి వ్యాధులతో బాధపడుతున్నవారికి రూ. 10 వేలు ప్రతినెలా పెన్షన్‌గా అందచేయాలని సూచించారు. 108 వాహనాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాలని, మండలానికో అంబులెన్సు ఉండాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు. ప్రస్తుతం 439 అంబులెన్సులు అందుబాటులో ఉండగా, కొత్తవాటితో కలిపి వాటి సంఖ్య 705కు పెంచాలని నిర్ణయించారు. అలాగే మొబైల్ మెడికల్ యూనిట్లు (104 వాహనాలు ) కూడా మండలానికి ఒకటి చొప్పున అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఆ వాహనాలు 292 ఉన్నాయని, వాటిని 676కు పెంచాలని సూచించారు. రాష్ట్రంలో మాతా శిశు మరణాల రేటును తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సిఎం కలెక్టర్లను ఆదేశించారు.
ఎంత కావాలి?
పిహెచ్సిల నుంచి జిల్లా, బోధనాస్పత్రుల వరకు అన్నింటిలోనూ మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలన్నారు. అయితే ఎంసిఐ నిబంధనల ప్రకారం వసతుల కల్పనకు, ఎపివివిపి ఆస్పత్రుల అప్‌గ్రేడేషన్, 24గంటలు పిహెచ్‌సిలు పనిచేయాలన్నా రూ. 1435.94 కోట్లు అవసరమని అంచనాలు వివరించారు. ఇలా.. ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి మొత్తం రూ. 2211.09 కోట్లు అవసరమని, అభివృద్ధికి మూడేళ్ల సమయం పడుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.