- 7.37శాతమే అందిన ఏకరూప దుస్తులు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:
ప్రభుత్వ పాఠశాలల్లో ఫర్నిచర్ లేని పాఠశాలలు 33,245 ఉన్నాయని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. సోమవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఇందుకు సంబంధించిన గణాంకా లను తెలిపింది. రాష్ట్రంలో44,570 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో ఫర్నిచర్ లేని పాఠశాలలు 33,245 (71శాతం), ప్రహారీ గోడలు లేని పాఠశాలలు 270,34(44.20శాతం) ఉన్నా యని వివరించింది. 98.29శాతం పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, 95.38శాతం పాఠశాలల్లో మరుగుదొడ్ల సౌకర్యం, 94శాతం విద్యుత్ సౌకర్యం అందుబాటులో ఉందని తెలిపింది. గతంలో కంటే ఈ ఏడాది విద్యార్థులకు పుస్తకాలను కొంత మేరకు సకాలంలో అందజేసిన విద్యాశాఖ ఏకరూప దుస్తులను మాత్రం అందించలేకపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 29,27,692 మంది విద్యార్థులకు మూడు జతల చొప్పున 87,83,076 ఏకరూప దుస్తులు అందజేయాలి. ఇప్పటి వరకు ఒక జత చొప్పున 2,15,915(7.37శాతం) మందికే పంపిణీ చేసింది. తూర్పు గోదావరి, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఒక్క విద్యార్ధికి కూడా యునిఫాం అందించలేదు. అత్యధికంగా విజయనగరంలో జిల్లాలో 79,258 (18.30శాతం) మందికి అందజేసింది. 2019-20 విద్యాసంవ త్సరంలో 62,063 పాఠశాలల్లో 70,41,154 మంది విద్యార్థులు చదువుతున్నారని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. 44,570 ప్రభుత్వ పాఠశాలల్లో 37,21,436 మంది, 2,203 ఎయిడెడ్ పాఠశాలల్లో 2,08,825 మంది, 15,290 ప్రైవేట్ పాఠశాలల్లో 31,11,433 మంది విద్యార్థులు చదువుతున్నారని వివరించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ సారి 96.86శాతం పుస్తకాలు అందాయని వెల్లడించింది. 2,25,06,400 పుస్తకాలు కావాలని గుర్తించగా, జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు 2,21,60,183(98.46శాతం) పుస్తకాలు సోమవారం ఉదయం నాటికి అందించినట్లు వివరించింది.
ఫర్నిచర్ లేని పాఠశాలలు 33,245
