- గుంటూరు నుండి తెలంగాణకు రవాణా
ప్రజాశక్తి - గుంటూరు జిల్లా ప్రతినిధి
తెలుగు రాష్ట్రాలను నిషేధిత బిజి-3 (హెర్బిసైడ్ టోలరెంట్- హెచ్‌టి) పత్తి వితనాలు ముంచెత్తుతున్నాయి. కాండం తొలిచే పురుగుతో పాటు, కలుపు బాధ లేకుండా పత్తి మొక్కలు పెరగుతాయని వీటి రూపకర్తలు చెబుతున్నారు. అయినప్పటికీ రైతులు, రైతు సంఘాల్లో వీటిపై అనేక అనుమానాలున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం బిజి3 విత్తనాల సాగును ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ, గుంటూరు నుండి వివిధ పేర్లతో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు ఈ విత్తనాల రవాణా సాగుతోంది. రకరకాల పేర్లతో మార్కెట్లను ముంచెత్తుతుండటంతో రైతులకు మరో మార్గం లేని పరిస్థితి ఏర్పడుతోంది. బిజి-2 విత్తనాల ప్యాకెట్లలో వీటిని నింపి రవాణా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆ విత్తనాల్లోని కలిపి విక్రయిస్తున్నారు. దీంతో ఏది కొనుగోలు చేస్తున్నారో తెలియని అయోమయ పరిస్థితికి రైతులు గురవుతున్నారు. వివిధ ప్రాంతాల నుండి గుంటూరుకు విత్తనాలు తీసుకువచ్చి ఆకర్షణీయమైన ప్యాకింగులతో స్థానికంగా విక్రయిస్తున్నాయి. ఇక్కడ నుంచి రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు, తెలంగాణ ప్రాంతానికి జిల్లాలోని కొంత మంది వ్యాపారులు పంపుతున్నట్లు తెలిసింది. లేబుల్స్ లేకుండా గన్నీ బ్యాగ్స్‌తో కొంత మంది రవాణా చేస్తున్నారు. మరికొంతమంది కొత్త లేబుళ్లతో పలు కంపెనీల పేరుతో నకిలీ విత్తనాలను తీసుకొస్తున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసారా చేసుకుని తక్కువ ధరకు మంచి దిగుబడి వచ్చే విత్తనాలంటూ నమ్మిస్తున్నారు. కొందరు ప్రజా ప్రతినిధుల అండతోనే నిషేధిత విత్తనాల వ్యాపారం జోరుగా సాగుతోందనే ఆరోపణలూ వస్తున్నాయి. బిజి-3 విత్తనాల సాగు వల్ల భూసారం దెబ్బతింటుందని వరుసగా నాలుగేళ్లపాటు ఈ విత్తనాలను సాగు చేయడం వల్ల భవిష్యత్తులో ఏ పంటలూ సాగుచేయలేని పరిస్థితి ఏర్పడుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. మొదట్లో కలుపు, పురగులు తగ్గినట్టు కనిపించినా, ఆ తరువాత నివారణశక్తిని పెంచుకుని విరుచుకుపడుతాయన్న ఆందోళనా వ్యక్తమవుతోంది. అంతేగాకుండా పంట సాగు చేశాక దిగుబడి పూత, కాయ రాకపోయినా ఏపుగా పెరిగినా ఎందుకూ ఉపయోగం లేకుండా పోయినా, వాతావరణ పరిస్థితుల దృష్టా అలా జరిగిందని, అనావృష్టి., అతివృష్టి, తెగుళ్లు తదితర కారణాలను చూపి చేతులు దులుపుకుంటారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ప్రతి ఏటా 15 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. ఒక్కో ఎకరాకు సగటున 900 గ్రాముల విత్తనాలు వినియోగిస్తారు. ఒక్కో ప్యాకెట్లో 450 గ్రాములుంటాయి. ఎకరాకు రెండు ప్యాకెట్ల విత్తనాలు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో రైతులు ఇప్పటికే భారీగా పత్తి విత్తనాలు కొనుగోలు చేశారు. వర్షాల్లేక సాగు ఇంకా ప్రారంభించలేదు. గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పత్తి ఎక్కువగా సాగవుతుంది. మిగతా జిల్లాల్లో సాధారణ స్థాయిలోనే పత్తి సాగుచేస్తారు.
ముంచెత్తుతున్న బిజి3
