- మిర్చి, పసుపు యార్డుల ఆధునికీకరణ : మంత్రి మోపిదేవి
ప్రజాశక్తి-గుంటూరు సిటీ ప్రతినిధి
దళారీ వ్యవస్థ వల్లే రైతులకు సరైన ధరలు రాక దోపిడీకి గురవుతున్నారని, ఈ వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్ శాఖా మంత్రి మోపిదేవి వెంకటరమణరావు తెలిపారు. గుంటూరులో తన పరిధిలోని శాఖల అధికారులతో బుధవారం సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. దళారుల దోపిడీ నుండి రైతులను కాపాడటానికి రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. మంచి ధరలు కల్పించడానికి వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలను సమన్వయం చేస్తానన్నారు. మిర్చియార్డు తరలింపుపై అధ్యయనం చేసి, రైతులతో సమావేశమై నిర్ణయం తీసుకుంటామన్నారు. గుంటూరులోని మిర్చి యార్డు, దుగ్గిరాలలోని పసుపు యార్డును ఆధునికీకరించి రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. కల్తీలు, నకిలీలపై విజిలెన్స్ మానిటరింగ్‌ను ఏర్పాటు చేశామన్నారు. రాజధాని తరలింపుపై స్పందిస్తూ ఆలాంటి అపోహలేమీ వద్దని, జిల్లా నుండి రాజధాని తరలిపోదని స్పష్టం చేశారు. అయితే రాజధాని నిర్మాణం పేరుతో రూ.వేల కోట్లను చంద్రబాబు దొడ్డిదారిన మళ్లించారని, ఇప్పటి వరకు చేపట్టిన నిర్మాణాలకు చదరపు అడుగుకు రూ.10 వేలు చెల్లించారని విమర్శించారు. దీనిపై విచారణ చేయించి ఆ మొత్తాన్ని తిరిగి రాబడతామన్నారు.
దళారీ నిర్మూలనకు ప్రత్యేక విభాగాలు
