- విజయనగరంలో వరి, చిత్తూరులో వేరుశనగ కొరత
- అరకొర సరఫరాతో ఇబ్బందుల్లో రైతులు
ప్రజాశక్తి- విజయనగరం, చిత్తూరు ప్రతినిధులు:
ఏటా మాదిరిగానే రైతులు ఈ ఏడాదీ విత్తనాల సమస్య ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఈ పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడంలేదు. విజయనగరం జిల్లాలో వరి విత్తనాల కోసం, చిత్తూరు జిల్లాలో వేరుశనగ విత్తనాల కోసం రైతులు బారులు తీరుతున్నారు. విజయనగరం జిల్లాలో 1001 రకం వరి విత్తనాలకు ప్రత్యామ్నాయ విత్తనాలు అందుబాటులో లేవు. వేరుశనగ విత్తనాలు ధర పెరుగుతుందనే ఉద్దేశంతో కంపెనీలు విత్తనాల సరఫరాలో జాప్యం చేస్తున్నాయి. దీంతో, రైతులు వరి, వేరుశనగ విత్తనాల కోసం రోడ్డెక్కుతున్నారు.
విజయనగరం జిల్లాలో ప్రత్యామ్నాయ విత్తనాల కొరత, కొత్తరకం విత్తనాలకు ప్రతికూల పరిస్థితులు ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది 4.5 లక్షల ఎకరాల్లో వరి పంట సాగుచేయవచ్చని అధికారులు అంచనా వేశారు. ఇందులో సుమారు రెండు లక్షల ఎకరాల వరకు 1001 రకం విత్తనాలే రైతులు ఉపయోగిస్తున్నారు. జిల్లాలో పెద్దగా సాగునీటి వనరులు లేకపోవడంతో ఎక్కువగా వర్షాధారంగానే వరి సాగవుతోంది. 1001 రకం వరి నారు రెండు నెలల తరువాత కూడా నాట్లు వేసుకునేందుకు అనువుగా ఉంటుంది. ఈ పంటకు నీటి ఎద్దడిని ఎదుర్కొనే శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రకం బియ్యాన్ని మిల్లర్లు రీసైక్లింగ్ చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో 1001 రకం వరి విత్తనాల సరఫరాను ప్రభుత్వం గత ఏడాది తగ్గించింది. రైతుల ఆందోళనతో చివరకు పూర్తిస్థాయిలో పంపిణీ చేసింది. ఈ ఏడాది పూర్తిగా ఆ విత్తనాల సరఫరా నిలిపివేసింది. వాటికి ప్రత్యామ్నాయంగా అందుబాటులోకి తెచ్చిన ఎంటియు 1121 రకం విత్తనాలను 19 వేల క్వింటాళ్లు, రెండో ప్రాధాన్యతలో 1156 రకం విత్తనాలను 5,600 క్వింటాళ్లు, 1075 రకం విత్తనాలను 5,800 క్వింటాళ్లు సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. రైతుకు 30 కేజీలు మించి సరఫరా చేయడం లేదు. ఇవి ఎకరాకు మించి సరిపోయే పరిస్థితి లేదు. దీంతో, మిగిలిన విత్తనాల కోసం ప్రయివేటు డీలర్లను ఆశ్రయించాల్సిన వస్తోందని సీతానగరం మండలం రెడ్డివానివలసకు చెందిన రెడ్డి లక్ష్మునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సీతానగరం మండలానికి ఐదు వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా, ఇప్పటి వరకు రెండు వేల క్వింటాళ్లు మాత్రమే అందుబాటులోకి ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. విత్తన కొరత పరిష్కరించాలని పార్వతీపురం, జియ్యమ్మవలస, బొబ్బిలిలో రైతు సంఘం ఆధ్వర్యాన రైతులు ఇటీవల ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా చెప్తున్న విత్తనాలు జిల్లాలో సాగుకు అనుకూలం కాదని రైతులు అంటున్నారు. ఈ రకాల వరి నారును 30 రోజుల్లోపు నాట్లు వేయకపోతే పనికొచ్చే పరిస్థితి లేదని, ఆ తరువాత కూడా పంట నీటి ఎద్దడి ఎదుర్కొనే పరిస్థితి లేదని చెబుతున్నారు. గతేడాది 1121 విత్తనాన్ని ఎకరాలో సాగు చేశానని, నీటి ఎద్దడి వల్ల పూర్తిగా పనికిరాకుండా పోయిందని గంట్యాడ మండలం వసాది గ్రామానికి చెందిన ఆదినారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో వేరుశనగ విత్తనాల పంపిణీ గందరగోళంగా మారింది. అనుకున్న లక్ష్యాల మేరకు కంపెనీలు సరఫరా చేయకుండా మొండికేస్తున్నాయి. దీంతో, ఒక రోజు పంపిణీ చేస్తే మరుసటి రోజు విత్తనాలు ఉంటాయో లేవో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో, తమకు విత్తనాలు అందుతాయో? లేదో? అనే ఉద్దేశంతో రైతులు విత్తన పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఈ ఖరీఫ్‌లో చిత్తూరు జిల్లాలో 3.25 లక్షల ఎకరాల్లో వేరుశనగను రైతులు విత్తుతారని అధికారులు అంచనా వేశారు.
ఈ మేరకు 80 వేల క్వింటాళ్లు అవసరమవుతాయని ప్రభుత్వానికి నివేదిక పంపారు. ప్రభుత్వం సుమారు 76 క్వింటాళ్లు మాత్రమే కేటాయించింది. ఎపి సీడ్స్ 19,234 క్వింటాళ్లు సరఫరా చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు పది వేల క్వింటాళ్లు మాత్రమే సరఫరా చేసింది. వాసన్ కంపెనీ నుంచి 4,500 క్వింటాళ్లు రావాల్సి ఉంది. ఆయిల్‌ఫెడ్ కంపెనీ అత్యధికంగా 52,750 క్వింటాళ్లు సరఫరా చేయాల్సి ఉండగా జిల్లాకు ఇంతవరకూ 18 వేలు మాత్రమే చేర్చింది. ధర పెంచాలని ప్రభుత్వాన్ని ఈ కంపెనీలు డిమాండు చేస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే విత్తనాల సరఫరాలో జాప్యం చేస్తున్నటు జిల్లాలో చర్చ సాగుతోంది.
నిల్వలు లేక ఇక్కట్లు
జిల్లాకు వస్తున్న విత్తనాలు ఒకటి రెండు రోజులకు మించి సరిపోవడం లేదు. రైతులకు టోకెన్లు ఇచ్చి పంపుతున్నారు. గంగాధర నెల్లూరు మండలంలో రెండు రోజుల క్రితం విత్తనాల పంపిణీ ప్రారంభించారు. మొదటి రోజు సాఫీగా సాగింది. రెండో రోజు కంపెనీల నుంచి స్టాకు రాలేదు. దీంతో, నోస్టాక్ బోర్డులు పెట్టారు. దీంతో, ఆగ్రహించిన రైతులు చిత్తూరు-పుత్తూరు రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. పాకాల మండలంలో కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. విత్తనాలు పంపిణీ చేస్తామని చెప్పి టోకెన్లు ఇచ్చారు. తీరా రైతులు కేంద్రం వద్దకు వస్తే స్టాకు రాలేదని చెప్పారు. దీంతో వారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మే నెల రెండో వారంలోనే వేరుశనగ విత్తనాల పంపిణీ జిల్లాలో ప్రారంభమవుతుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం, సబ్సిడీ విషయం తేలకపోవడం వంటి కారణాల వల్ల ఈసారి నెల రోజులు ఆలస్యంగా ఈ నెల 14వ తేదీ నుంచి విత్తన పంపిణీ ప్రారంభించారు. జిల్లాలో 38 మండలాల్లోనే పంపిణీ ప్రారంభమైందని, మిగిలిన 12 మండలాల్లో సోమవారం నుంచి ప్రారంభిస్తామని, విత్తనాల రాకుండా చూస్తుమని జిల్లా వ్యవసాయాధికారి విజరుకుమార్ చెప్పారు.