- అద్వానీ స్థానంలో అమిత్షా
- విశాఖ, నరసరావుపేట బరిలో పురందేశ్వరి, కన్నా
- 184 మందితో బిజెపి తొలి జాబితా
ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో :
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారణాసి నుండే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా గుజరాత్లోని గాంధీనగర్ స్థానం నుండి బరిలో దిగనున్నారు. 184 మందితో లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను బిజెపి సీనియర్ నేత జెపి నడ్డా గురువారం విడుదల చేశారు. బిజెపి కురువృద్ధుడు ఎల్కె అద్వానీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహజన్, మురళీ మనోహార్ జోషి, కేంద్ర మాజీ మంత్రి కల్రాజ్ మిశ్రా వంటి సీనియర్ నేతలకు తొలి జాబితాలో చోటు దక్కలేదు.
ఆంధ్రప్రదేశ్లోని రెండు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. విశాఖ నుండి దగ్గుబాటి పురందేశ్వరి, నరసరావు పేట నుండి కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. తెలంగాణలో పది మంది అభ్యర్థులకు తొలి జాబితాలో స్థానం కల్పించింది. లక్నో, నాగపూర్, ఘజియా బాద్, గౌతమ్ బుద్ధానగర్(నోయిడా)ల నుండి కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, వికెసింగ్, మహేష్ శర్మలు మరోసారి పోటీ చేస్తున్నారు. తూర్పు అరుణాచల్ ప్రదేశ్ స్థానాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజుకి కేటాయించింది. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న అమేథీలో స్మృతి ఇరానీని బరిలోకి దింపింది. మధుర నుండి నటి హేమమాలిని పోటీ చేస్తున్నారు.
కేరళలో కాంగ్రెస్, బిజెపి లాలూచీ
పరస్పరం దుమ్మెత్తిపోసుకొనే కాంగ్రెస్, బిజెపి కేరళలో మాత్రం అనైతిక పొత్తుకు తెర లేపాయి. ఐదు స్థానాల్లో కాంగ్రెస్కు అనుకూలంగా బలహీన అభ్యరు ్థలను నామమాత్రంగా పోటీ చేయించాలని బిజెపికి ఆర్ఎస్ఎస్ నిర్దేశించింది. దీనికి ప్రతిగా తిరువనంతపు రంలో బిజెపికి కాంగ్రెస్ సహకరించనుంది.