- ఏజెన్సీలో విద్య, వైద్యం, ఉపాధి కల్పిస్తాం
- పాడేరు బహిరంగ సభలో పవన్ కల్యాణ్
ప్రజాశక్తి-విశాఖపట్నం ప్రతినిధి
''కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడే జనసేనను బలపర్చండి. మా ప్రభుత్వం వస్తే డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండి గిరిజనులకు వైద్యసేవలు అందించే బలమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించి గిరిజన ప్రాంతం అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటాం' అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. బుధవారం పాడేరు అంబేద్కర్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ బాక్సైట్ తవ్వి, పర్యావరణాన్ని ధ్వంసం చేసేవారికి వేల కోట్లు కనిపిస్తున్నాయిగాని లక్షలాది మంది జీవితాలు నాశనమవుతుండటం కనిపించడం లేదని విమర్శించారు. పర్యావరణ సమస్య లేని పరిశ్రమల ఏర్పాటు, టూరిజం ద్వారా విశాఖ ఏజెన్సీలో లక్ష మంది యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. టిడిపికి దోచుకోవడంలో ఉన్న చిత్తశుద్ధి ప్రజలకు సేవ చేయడంలో లేదన్నారు. ప్రజలను రక్షించాల్సిన ప్రజాప్రతినిధులే దోపిడీ వ్యవస్థలో భాగస్వామ్యం వహిస్తే ఏం చేస్తామని ప్రశ్నించారు. మైనింగ్ దోపిడీని అడ్డుకోకపోవడంతో నాయకులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. అక్రమ క్వారీలపై చర్యలు తీసుకొని వుంటే ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోయే వారు కాదన్నారు. నాయకుల మృతికి సిఎం బాధ్యత వహించాలన్నారు. గత ఎన్నికల్లో బాక్సైట్ తవ్వకాలు నిలుపుదల చేస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకొచ్చాక తవ్వకాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మైనింగ్ తవ్వకాలకు పాల్పడేవారు తమవారే కావడంతో చట్టసభలకు వైసిపి వెళ్లడం మానేసిందని విమర్శించారు. జనసేన, టిడిపి కలిసి పోటీ చేస్తాయని వ్యాఖ్యానించిన టిడిపి ఎంపీ టిజి.వెంకటేష్‌పై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మేం వదిలేసిన రాజ్యసభ సీటు పొందిన వెంకటేష్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం. పరిశ్రమలతో పర్యావరణానికి హాని చేసి నదులను కలుషితం చేస్తున్నారు. పెద్దరికం నిలబెట్టుకోవాలి. పిచ్చి పిచ్చి మాటలు వద్దు.' అని పవన్ హెచ్చరించారు. ఈ సభలో శాసన సభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి పి.బాలరాజు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.నర్సింగరావు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు పాంగి రాజారావు, పాడేరు నియోజకర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు తుడుమ అశోక్ జనసేన పార్టీలో చేరారు.
గిరిజనులకు అండగా వుంటాం
