ఇస్లామాబాద్ : ఉగ్రవాద సంబంధిత నేరాలలో పాల్గొన్న 13 మంది కరడుగట్టిన ఉగ్రవాదులకు పాక్ సైనిక న్యాయస్థానం విధించిన మరణశిక్షను సైన్యాధిపతి జనరల్ కమర్ జావేద్ బజ్వా ధ్రువీకరించినట్లు సైన్యం వెల్లడించింది. 2014లో అధికశాతం మంది విద్యార్థులతో సహా మొత్తం 150 మందిని బలితీసుకున్న పెషావర్ స్కూల్‌పై తాలిబన్ల దాడి తరువాత పాకిస్తాన్లో సైనిక న్యాయస్థానాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరణశిక్షకు గురైన 13 మంది మిలిటెంట్లు సైనికులపై దాడులు, స్కూళ్ల విధ్వంసం, అమాయకుల ప్రాణాలు తీయటం వంటి ఘటనలతో సంబంధం వున్న వారేనని సైన్యం తన ప్రకటనలో వివరించింది. వీరి దాడుల్లో 151 మంది పౌరులు, 51 మంది సైనిక, సరిహద్దు భద్రతా దళాల సిబ్బంది హతమయ్యారని, మరో 249 మందికి పైగా గాయాల పాలయ్యారని సైన్యం పేర్కొంది. వీరి వద్ద నుండి ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపిన సైన్యం, వీరి మరణశిక్ష అమలు తేదీ, ప్రదేశం వంటి వివరాలను భద్రతా కారణాల రీత్యా వెల్లడించటం లేదని తెలిపింది.
పాక్‌లో 13 మంది ఉగ్రవాదులకు మరణశిక్ష
