- యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ కైవసం
- ఫైనల్లో డెల్‌పొట్రో చిత్తు
గాయాల కారణంగా ఏడాదికాలంగా టెన్నిస్‌కు దూరంగా గడిపిన సెర్బియా స్టార్ ఆటగాడు జకోవిచ్ మరో గ్రాండ్‌స్లామ్‌ను గెలిచాడు. సోమవారం తెల్లవారుఝామున జరిగిన ఫైనల్లో డెల్‌పొట్రోపై గెలిచి కెరీర్లో 14వ గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఏడాదికాలంగా గాయాలబారినపడి టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పాల్సిన దశనుండి తిరిగి మైదానంలోకి దిగిన జకో నంబర్‌వన్ దిశగా దూసుకెళ్తున్నాడు.
న్యూయార్క్: ప్రతిష్టాత్మక యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సెర్బియా స్టార్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ ఎగరేసుకుపోయాడు. ఈ ఏడాది వింబుల్డన్ టైటిల్‌ను గెల్చిన జకో యుఎస్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌నూ తన ఖాతాలో వేసుకున్నాడు. సోమవారం తెల్లవారుఝామున జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 2009 విజేత డెల్‌పొట్రోపై ఘన విజయం సాధించాడు. దీంతో మూడోసారి యుఎస్ ఓపెన్ టైటిల్‌ను ముద్దాడాడు. ఆరో సీడ్ జకోవిచ్ 6-3, 7-6,(7-4), 6-3 సెట్ల తేడాతో అర్జెంటీనాకు చెందిన మూడోసీడ్ డెల్‌పొట్రోను చిత్తుగా ఓడించాడు. తొలి సెట్‌ను కోల్పోయిన అనంతరం డెల్‌పొట్రో అనూహ్యంగా పుంజుకున్నాడు. రెండోసెట్ నువ్వా-నేనా అన్నట్టు సాగినా.. జకోవిచ్ దూకుడు ముందు అర్జెంటీనా ఆటగాడు నిలువలేకపోయాడు. ఇక మూడో సెట్లోనూ జకో ఏ చిన్న అవకాశం ప్రత్యర్థికి ఇవ్వలేదు. దీంతో చివరి సెట్ కూడా గెలిచి 14వ గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకొని పీట్ సంప్రాస్ సరసన చేరాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెల్చిన ఆటగాళ్ల జాబితాలో రోజర్ ఫెడరర్(20 టైటిల్స్), రఫెల్ నాదల్(17) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇప్పటి వరకు వీరిద్దరూ 19సార్లు తలపడగా 15సార్లు జకోవిచ్‌దే విజయం. గతంలో 2011, 2015లో జకోవిచ్ యుఎస్ ఓపెన్ విజేతగా నిలిచాడు. తాజా విజయంతో తన ఆరోర్యాంకును మెరుగుపరుచుకొని మూడు స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి ఎగబాకనున్నాడు.
సీన్ రివర్స్..
2017లో రఫెల్ నాదల్ యుఎస్ ఓపెన్ ట్రోఫీ సొంతం చేసుకున్న వేళ గాయం కారణంగా సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ ఇంట్లో ఉన్నాడు. సంవత్సరం తిరిగేలోపు పరిస్థితి మారిపోయింది. డిఫెండింగ్ చాంపియన్ నాదల్ మాజీ విజేత డెల్‌పొట్రోతో జరిగిన సెమీఫైనల్లో మోకాలి గాయంతో మధ్యలోనే వైదొలగగా... పూర్తి ఫిట్నెస్ సంతరించుకున్న జకోవిచ్ ముఎస్ ఓపెన్ ట్రోఫీని ముద్దాడాడు.