అపరాధభావం చంపేస్తుంటే.. ఆన్నా కెరనీనా గుర్తుకొచ్చి జీవితాన్ని విషాదాంతం చేసుకోవద్దని వేడుకుంటుంది. బతుకు పోరులో యుద్ధం దేనితో చేయాలో అర్థంకాక సతమతమైతే.. హాజీ మురాద్ సాహసంతో గుర్రపుడెక్కల చప్పుడుని భీకరంగా చేస్తూ దండెత్తుకువస్తాడు. దారితప్పిన జీవితాన్ని ఎలా సరిదిద్దుకోవాలో తెలీక సంక్షోభంలో పడిపోతే.. జీవితానికో అర్థామిస్తానంటూ పియెర్ కావలించుకుంటాడు. ఎన్నడో చేసిన నేరానికి శిక్ష వేసుకుంటే సరిపోతుందా..? పరివర్తన పశ్చాత్తాపంతో సాధ్యమవుతుందా..? అని ప్రశ్నలో పడిపోయినప్పుడు అవకాశమున్నంతవరకూ మంచిని చేస్తూ నేరభారం తగ్గించుకునే ఉపాయాన్ని దిమిత్రీ నేర్పిస్తాడు. వీరంతా.. మనోకవి లియో టాల్‌స్టారు సజీవ పాత్రలు. ఆ పాత్రల ద్వారానే టాల్‌స్టారు అంతరంగం అర్థమవుతుంది. వాటి నవలా జీవితాలు సాగిన తీరులోనే టాల్‌స్టారు చెప్పాలనుకున్న మానవీయ విలువల అంతరార్థం బోధపడుతుంది.
కారు రోడ్డు పక్క ఆగింది. వారంతా ఫుట్‌పాత్‌పై. ఎడమవైపు చెక్కలతో కట్టిన రైలింగ్ లాంటి గోడ ఉంది. దీనికో చిన్న గేటు. దాన్ని దాటి లోపలకు వెళ్ళారు. ''ఇదే టాల్‌స్టారు మాస్కో ఇల్లు'' అంది ఎలీనా. ఆ ఇల్లు కిందాపైనా కలిపి రెండంతస్తులు ఉంది. ఓల్గా అని ఓ పెద్దావిడ రష్యన్ గైడ్. ఆమె రష్యన్లో చెబుతూ ఉంటే, ఎలీనా ఇంగ్లీషులోనికి అనువాదం చేసి వారికి చెబుతోంది. ''అవే చలికాలంలో టాల్‌స్టారు వేసుకొనే ఓవర్కోట్లు'', ''ఇవిగో ఆయన స్వయంగా చేసుకొన్న తోలుబూట్లు.. అది అతిధులను కలుసుకొనే హాలు, అదిగో ఆ మూల గదిలోనే కనిపిస్తున్న టేబుల్ పైనే కూర్చుని ఆయన చివరి కాలంలో 'నవజీవనం' ఇతర కథలు రాశారు'' అంది. ''ఈ టేబుల్ని ముట్టుకోవచ్చా!''... వాళ్లలో ఒకరు. ''వద్దు దయచేసి ముట్టుకోకండి. ఇంకా చాలామంది ముందు తరాల వాళ్ళు కూడా ఈ వస్తువులను చూడాలి!'' అంది ఓల్గా. వాళ్ళు మరోచోట ఏదో చూస్తూఉండగా... టేబుల్ని తాకితే ఒళ్ళు జలదరించింది. ఆ తర్వాత నెమ్మదిగా కిందకి దిగి బయట ఉన్న తోటలోనికి ఆ బృందం వెళ్లింది. టాల్‌స్టారు నడిచిన బాట అది. టాల్‌స్టారు, సోఫియా బొమ్మల దగ్గర నిల్చోని ఫొటోలు తీసుకున్నారు. ఏవో రంగుల బొమ్మలు, పుస్తకాలను కొన్నారు. ఆయన గురించి ఆయన కన్న కలల గురించి, ఆయన జీవితం గురించి, కలలు, కథలు, నవలలు, అందులోని పాత్రలూ కళ్లెదుటే తిరిగింది. గడిపింది రెండు గంటలే అయినా, నాలుగు దశాబ్దాల పాటు ప్రజల ఆలోచనలను ప్రభావితం చేసిన, అద్భుత సోవియట్ సాహిత్యం ముప్పిరిగొంది. అలా కలలో నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయారు. లియో టాల్‌స్టారు అభిమానికి ఆయన ఇంటిని సందర్శిస్తే అంతకన్నా గొప్ప అనుభూతేముంటుంది.! వందల ఏళ్లు సజీవంగా నిలిచిపోయే పాత్రలు పురుడుపోసుకున్న ఆ ఇంట సాహితీపరిమళం జ్ఞాపకాల్లో గాఢంగా హత్తుకుపోతుంది.
అతడు పరిచయమైతే...
సుమారు నలభై అయిదు సంవత్సరాల క్రితం, ఓ రోజు సాయంత్రం.. ఓ పుస్తకాల ఎర్రబస్సు ఊళ్ళో ఆగేది. ఎవరో వార్త ప్రతి ఇంటా చేర్చేవారు. పిల్లలందరూ పరుగెత్తుకుని వెళ్ళి, ఆ బస్సు చుట్టూ చేరేవారు. వారిని ఒక్కొక్కరినే బస్సులోనికి పంపించేవారు. అందులో బోలెడన్ని పుస్తకాలు. ఒక్కో పుస్తకాన్ని ఆశ్యర్యంగా చూసే పిల్లలకు ఎన్నో పుస్తకాల మధ్య.. అక్కడ టాల్‌స్టారు పరిచయమవుతాడు. చిన్నపిల్లల కథలు, మంచి మంచి బొమ్మలు భలేగా ఉండేవి. ఓ తరం వెనక్కు టాల్‌స్టారు అలా పరిచయమయ్యేవాడు. ఇప్పటితరానికి టాల్‌స్టారు నవలల మీద వచ్చిన చిత్రాల ద్వారా తెలుస్తున్నాడు. అతడి మాటల్లోని, రచనలల్లోని పలుకులతో తన సాహిత్యంలోకి లాక్కెళుతున్నాడు. అది మొదలు జీవిత ప్రయాణంలో ఆయన కథలు, నవలలు, చదవడంతో.. ఊహా సామ్రాజ్యాన్ని రష్యన్ సాహిత్యం ఆక్రమించేస్తుంది. ఈ కథలు, నవలల్లోని పాత్రలు మనల్ని ఇప్పటికీ పలకరిస్తూ ఉంటాయి. 'టాల్‌స్టారు' అనే పేరు చెవికి మధురంగానే వినపడుతూ ఉంటుంది.
ఇదో సందర్భం
ఇప్పుడో సందర్భం కలిసి వచ్చింది. ఇది టాల్‌స్టారు 190వ జయంతి సంవత్సరం. మరో దశాబ్దంలోనే 200 ఏళ్ల ఆయన సమక్షాన్ని ప్రపంచం చవిచూసినట్టు. ఈ సందర్భంగా ఆయన గురించి స్మరించుకోవడం సమంజసంగా ఉంటుంది. లియో టాల్‌స్టారు 1828 సెప్టెంబర్ 9న రష్యా సామ్రాజ్యంలోని 'యాస్నా పొలియానా' అనే గ్రామంలో జన్మించారు. ఆయన కుటుంబం రాచరిక సంబంధాలు కలిగిన జమీందారీ కుటుంబం. ఆయన పుట్టిన సంవత్సరానికే తల్లిని... ఏడు సంవత్సరాలకు తండ్రిని కూడా కోల్పోయాడు. పెంపుడుతల్లి వద్ద పెరిగాడు. యవ్వనంలో జులాయిగా తిరిగి, తరువాత కజాన్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలోనూ తరువాత తత్త్వశాస్త్రంలోనూ చేరి చివరికి చదువు పూర్తి చేయకుండానే తిరిగి తన ఎస్టేట్‌కు చేరాడు. అప్పటిలో జరిగిన రష్యా-క్రిమియా యుద్ధ కాలంలో సైన్యంలో చేరి పనిచేశాక, మాస్కోకు చెందిన ఓ డాక్టర్గారి కుమార్తె 'సోఫియా'తో వివాహం జరిగింది. వారికి మొత్తం 13 మంది సంతానం. చివరకు 10 మంది మిగిలారు. మొదట తన బాల్యం, కౌమారం, యవ్వనం (చైల్డ్‌హూడ్, బారుహూడ్, యూత్) గురించి మూడు పుస్తకాలుగా టాల్‌స్టారు రచనచేశాడు. ఆ తర్వాత సవస్థిపోల్ కథలు, కోసక్కులు యుద్ధము, శాంతి (1869), ఆన్నా కెరనీనా (1877) ఇవాన్ ఇలిచ్ మృతి (1886) నవజీవనం (1899) నవలలు రాశారు. వీటితోపాటు అనేక కథలు, నాటికలు, వ్యాసాలు కూడా రాశారు. ఆయన రచనలతో వాస్తవికవాదాన్ని ఆవిష్కరించారు. నవంబర్ 20, 1910లో 82 సంవత్సరాల వయస్సులో ఆయన చనిపోయారు.
మాస్కో నుంచి సెయింట్ పీటర్స్బర్గ్కు బుల్లెట్ ట్రైన్లో వెళ్ళినప్పుడు, రైల్వేస్టేషనులో 'ఆన్నా' గుర్తుకువస్తుంది. 140 సంవత్సరాల క్రితం టాల్‌స్టారు రాసిన 'ఆన్నా కెరనీనా' నవలలో కథానాయకి ఆన్నా!. ఆమె కథ మాస్కో నుంచి పీటర్స్బర్గ్ వెళ్ళే రైలు ప్రయాణంలో ప్రారంభమవుతుంది. అదే రైల్వేస్టేషన్లో జీవితం ముగిసిపోతుంది. పాపం పిచ్చి 'ఆన్నా'.. అనిపిస్తుంది. కళ్లెమ్మట నీటిధార తుడుచుకోకుండా ఆమె మనోలోకంలోకి మనం వెర్రిగా దారితెలియక తిరుగుతుంటాం. ఆన్నా పాత్రను అర్థంచేసుకోవడానికి మనోవిశ్లేషణ చేయగలిగే పాఠకమేధ ఒక్కటే సరిపోతుందా?. ఆమెను సరిగ్గా తెలుసుకోవాలంటే... మానవత, సెన్సిటివిటీ ఉన్న పాఠకహృదయమూ కలవాలి. ఆన్నా కెరనీనా చదివాక ప్రతి గుండె, మనస్సు, బుద్ధి.. ఎందుకో అతిమృదువైపోతుంది. ప్రేమ, మోహాలకు ఉన్న తీవ్రత కన్నా దయ, క్షమలకు ఉన్న ఉన్నతేంటో బోధపడుతుంది. పరిపరివిధాల పరుగులు తీసే ఆలోచనలు పుస్తకం చదవడం పూర్తయ్యాక ఒక్కసారిగా కుప్పకూలి.. అపరాధభావంతో గుండె తల్లడిల్లి గడ్డకట్టుకుపోతుంది. ఆన్నా పాత్ర అపరాధభావంతో చేసుకున్న ఘోరం కన్నా ఆ సమయంలో ఆన్నా పక్కన మనం నిలవలేకపోయామనే ఓదార్పునివ్వలేకపోయామనే భావన మనల్ని దహించేస్తుంది. ఆన్నాలానే మనమూ అంతా కోల్పోయామనే బాధలోకి లాక్కెళుతుంది. ఇంత భావోద్వేగాన్ని ఓ నవల కలిగించాలంటే రచన ఎంత అద్భుతంగా సాగాలి..? లియో టాల్‌స్టారు ఇలానే 'యుద్ధము-శాంతి' మనలో కలిగిస్తాడు.
పియెర్ పరివర్తనలోకి...
టాల్‌స్టారు రాసిన ప్రఖ్యాత నవలలో ఒకటి 'యుద్ధము-శాంతి'. ఈ నవల 1805-13 కాలంలో రష్యాపై నెపోలియన్ (ఫ్రెంచ్) దండయాత్ర నేపథ్యంలో సాగిన చారిత్రాత్మక నవల. సుమారు 1500ల పేజీలతో సాగిన ఈ నవలను 1867లో మొదటి సీరియల్‌గా వెలువరించారు. ఈ నవలలో ప్రధానంగా ప్రిన్స్ ఆంద్రే, నటాషాలు పాత్రధారులైన మరో రెండు జంటలు, ప్రేమకథ అంతర్లీనంగా సాగుతుంది. మరో 30 ప్రధాన పాత్రలు వందలు పాత్రలతో సాగుతుంది. ఇన్ని పాత్రలున్నా పియెర్ బెజుఖోవ్ పాత్రలోనే టాల్‌స్టారు అద్భుత మనోవిశ్లేషణ.. మానసిక పరివర్తనల రచనాచేతన మహాద్భుతంగా కనిపిస్తుంది. ఆంద్రే ప్రాణమిత్రుడైన పియెర్ జీవితంలో యుద్ధం తెచ్చిన మార్పులే ప్రధానంగా నవలకు ప్రాణంపోశాయి. విపరీత ప్రవర్తన, భావోద్వేగాల కలబోతగా పరిచయమయ్యే ఈ పాత్రలో వచ్చిన గుణాత్మకమైన మార్పు.. జీవితార్థం కోసం సాగించే అన్వేషణ... నవలని నడిపిస్తుంది. అందుకే, పియెర్ పాత్ర గురించి మెరియమ్-వెబ్‌స్టర్ 'సాహిత్యంలోనే అత్యంత ఆకర్షణీయమైన, సహానుభూతినొందిన పాత్ర'గా గుర్తించింది. వందల పాత్రల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే.. నిలచిపోయే పాత్ర పియెర్ది. 7 లక్షల సైన్యంతో నెపోలియన్ రష్యాపై దండెత్తి వచ్చాడు. సుమారు 8 సంవత్సరాలు సాగిన యుద్ధంలో 1812లో మాస్కోను ఆక్రమించిన తరువాత 1813లోనే తిరిగి వెనక్కుపోవాల్సి వచ్చింది. అప్పటికి అతడి సైన్యం 20 వేలకు పడిపోయింది. యుద్ధం మిగిల్చిన గాయాలు, పేదరిక చిత్రమైన జీవితాల నేపథ్యమే 'యుద్ధము- శాంతి'. సామాన్యమైన చిన్న చిన్న ప్రజా సమూహాలే చరిత్రను సృష్టిస్తాయి. పెద్ద సామ్రాజ్యాలు, సైన్యాలు, చక్రవర్తుల పటాటోపాలు వాళ్ళ నిర్ణయాలు చరిత్ర చోదక శక్తులు కాలేవు' అని టాల్‌స్టారు నమ్మాడు. ఈ భావాలనే ఈ నవలలో ప్రతిబింబింపచేశాడు.
నవజీవనానికి..
సమాజం నుంచి వెలివేయబడినవారు, దురదృష్టవంతుల జీవితాలపై, ప్రేమను, వెలుగును చూపించిన నవల ఇది. ఈ నవల 1899లో సీరియల్‌గా ప్రచురించబడింది. ఈ నవలలో ప్రధాన పాత్రలు దిమిత్రి నికలరుడోవ్, మస్లొవాలు. మనిషి తాను చేసిన తప్పులకు, నేరాలకు పశ్చాత్తాపపడి హృదయమున్న మానవునిగా ఆవిర్భవించవచ్చు అనే హామీని ఈ నవల ఇస్తుంది. దయ, మానవత్వమే చివరకు నిలుస్తాయని ఈ నవల చెబుతుంది. దిమిత్రి పాత్ర స్వార్థానికి, నిర్దయతో పరిచయమై.. ఆ తర్వాత పశ్చాత్తాపంతో తనను సరిచేసుకునే ప్రయత్నం చేసే తీరులో ఎంతో మనోవిశ్లేషణ చేస్తాడు టాల్‌స్టారు. ఎప్పుడో చేసి మరిచిపోయి నిర్లక్ష్యం చేసిన నేరం ఆ పాత్రను తర్వాతి జీవితంలో బలంగా తాకే తీరులోనే నవజీవనానికి బీజం పడుతుంది. మనిషి ఎలా బతుకును మొదలుపెట్టినా ఎలా ముగించాలనే.. జీవిత పాఠాన్ని దిమిత్రి పాత్ర చెబుతుంది. టాల్‌స్టారు కళాత్మక వైభవం, అతని రచనాశైలి ఈ నవలలో విశ్వరూపం దాలుస్తాయి.
మరణం తర్వాత జీవితం
క్రూరత్వానికి, కోమలత్వానికి... భీకరదాడికి, ఆత్మరక్షణకి.... ఇలా అనేక విరుద్ధకోణాల్ని పెనవేసుకున్న పాత్ర హాజీ మురాద్. మరణం తర్వాత జీవితాన్ని మిగుల్చుకున్న గెరిల్లా పోరాటయోధుడు, చారిత్రాత్మక చెచెన్-డాగిస్తాన్ నేత హాజీ మురాద్ కథను తన యుద్ధానుభవాల్ని మిళితం చేసి అటు ఊహాత్మక పాత్రో, యదార్థజీవితమో.. తెలీనంతగా ఓ ప్రత్యేక శైలిలో లియో టాల్‌స్టారు రాశాడు. ఆ పుస్తకం విడుదల చేయాలనే ఆలోచన లేకుండా.. కేవలం తన మృత్యువు, నిస్సత్తువలపై యుద్ధం ప్రకటించి... రచనను ఎలాగైనా ముగించాలనే పోరాటపటిమతో టాల్‌స్టారు ఈ చిన్ని నవలని పూర్తిచేశారు. ఆయన మరణానంతరం ఇది ప్రచురితమైంది. తన జీవిత చరమాంకంలో సల్పినపోరుకు హాజీ స్ఫూర్తిగా తీసుకున్నాడని టాల్‌స్టారు చెప్పాడు. హాజీ మురాద్ సాగిస్తున్న బాహ్య యుద్ధం కన్నా అతడి లోలోపల సాగుతున్న ఆంతర్యుద్ధమే పాఠకుల్ని ప్రభావితం చేస్తుంది. ఈ పాత్రలో తన మానసిక లక్షణాల్ని కలిపి చేసిన మనోవిశ్లేషణ అద్భుతం.
ఆయనవే అత్యుత్తమం
ఐరిష్ రచయిత జేమ్స్ జోయిస్, బ్రిటిష్ రచయిత్రి వర్జీనియా వోల్ఫ్, టాల్‌స్టారు రచనలు మానవ చరిత్రలోనే ఉద్భవించిన ఉత్తమ కళాఖండాలుగా వర్ణించారు. మన జాతిపిత మహాత్మగాంధీకి ఇష్టమైన రచయిత టాల్‌స్టారు. వీరిద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా నడిచాయి. సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన, అమెరికన్ రచయిత విలియం ఫాల్కనర్... టాల్‌స్టారు రాసిన 'ఆన్నా కెరనీనా' నవలని మానవజాతి ఆవిర్భవించాక వెలువడిన ఉత్తమ సాహిత్య కళాఖండంగా వర్ణించాడు. టైమ్ మేగజీన్ - ఎప్పటికీ నిలిచిపోయే పది సాహిత్య గ్రంథాలలో 'ఆన్నా కెరనీనా'ను మొదటిస్థానంలోనూ 'యుద్ధము-శాంతి'ని తరువాతి స్థానంలోనూ ఉంచింది.
టాల్‌స్టారు రచనలు.. మానవ హృదయ వేదనను ఆవిష్కరించాయి. అందుకే అవి ప్రపంచ ప్రజల మనస్సులలో చిరస్మరణీయంగా నిలిచిపోయాయి. ఆయన రచనలతోపాటు రష్యన్ మహా రచయితలు దస్తోయిస్కీ, చెకోవ్, పుష్కిన్, నికలారు, గోర్కి, మిహాయిల్, కుప్రిన్. మైకోవిస్కీ, ఆస్థ్రవిస్కీ.. ఇలా సాహిత్యం, రెండో ప్రపంచయుద్ధం కాలం నాటి రచయితలు, రష్యాలోని ఇతర ప్రాంతాల రచయితలు వీరందరి సాహిత్యాన్ని కొత్తతరానికి అందుబాటులో తీసుకుని వస్తే... అవి తెలుగు ప్రజల్లో అభ్యుదయ భావాల వ్యాప్తికి ఎంతో ఉపయోగపడుతుంది.
మాస్కోలోని క్రెమ్లిన్ పక్కనే పబ్లిక్ లైబ్రరీ ఎదురుగా ఉన్న దోస్తాయిస్కీ విగ్రహం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలగజేస్తుంది. పీటర్స్బర్గ్ కోట జైల్లో, ఆయనను బంధించిన జైలు గదులు చూసి మనస్సు చివుక్కుమంటుంది. 'పేదజనం' అనే నవలలో రష్యాలోని ప్రజల దుస్థితిని వివరించినందుకు, జార్ చక్రవర్తి ఇచ్చిన బహుమానం... ఈ శిక్ష. సాహిత్యకారుల పేరిట సబ్వే స్టేషన్లు, కూడలి ప్రాంతాలు, పెద్ద శిలా విగ్రహాలు.. రష్యాలో కనిపిస్తాయి. అవి సాహితీఅభిమానులకు ఎంతో ఆనందం కలుగజేస్తాయి. మాస్కో శ్మశానంలో చెకోవ్, గోగోల్, మైకవిస్కీ సమాధుల వద్ద వారిని స్మరించునేపుడు... రష్యా ప్రయాణం రష్యన్ సాహిత్య వైభవాన్ని తిరిగి గుర్తు చేస్తుంది. గత స్మ్రృతులను ప్రేరేపిస్తుంది. ఏదో చెయ్యమని ముందు తరాలకు ఈ సాహిత్యాన్ని అందించమని కోరినట్లు అనిపిస్తుంది.
అమరం.. సార్వజనీనం
మనిషి మాటలకు, చేతలకు నైతిక బాధ్యత వాడిదే... అని టాల్‌స్టారు విశ్వసించాడు. 'ఆన్నా కెరనీనా' నవల... దోషం, నింద, మానవ స్వయంకృతాపరాధ విముక్తి అనే సమస్యలను విస్తృతంగా లేవనెత్తేందుకు టాల్‌స్టారుకి భూమిక మాత్రమే ఈ నవల. మన జీవితంలో గల యావత్ వ్యవస్థను, కఠినంగా, నిర్దాక్షిణ్యంగా విచారణ చేస్తుంది.. అని రష్యన్ ఎ.ఫెత్ రాశారు. గాఢంగా రష్యన్ స్వభావాన్ని ప్రతిబింబించడం, అలాగే సార్వజనీన సత్యాలను కలిగి ఉండటం వల్ల టాల్‌స్టారు నవల అందరి మనస్సు చూరగొంది. 'ఆన్నా కెరనీనా' కాలం వరకే పాతబడింది. కానీ, ఆయన సృష్టికి వార్దక్యం లేదు. నవలలో గల ఆత్మీక సౌందర్యం, విశిష్ట లక్షణాలతో, ఇప్పటికీ అందరి మన్నలనూ పొందుతుంది. ''నేను రాసిన దాన్ని ఈ నాటి పిల్లలు ఇరవై ఏళ్ళ తరువాత చదువుతారని, వాళ్ళు ఏడ్చి, బాధపడి, జీవితాన్ని ప్రేమిస్తారని నాకు గనక చెబితే... నేను నా జీవితాంతం సకల శక్తులు దానికే అంకితం చేసేవాణ్ణి'' అని టాల్‌స్టారు రాశారు. అలానే రాశారు. అందుకే ఆన్నా పాత్ర ఆయన్ను మనోకవిగా ప్రపంచానికి తెలిసేలా చేసింది.
(కవర్ టైటిల్ ఇల్లస్ట్రేటర్: గిరిధర్)
డెబ్బై సంవత్సరాలు తెలుగువాళ్ళను కుదిపేసిన రష్యన్ సాహిత్యం ఇప్పుడు తెరమరుగు అవుతుంది. దీనిని మరో తరానికి అందించాలనే ప్రగాఢ కోరికతో ఔత్సాహికులు, ప్రచురణకర్తలూ కలిసి, రష్యన్ తెలుగు సాహిత్య ఉత్సవం ఈ సంవత్సరమంతా జరపాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా రష్యన్ అనువాద పుస్తకాలన్నీ పునర్ముద్రించి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. సాహిత్యం అంటే ఇష్టపడే వారికి, సభలు నిర్వహించి ప్రచారం చేసేందుకు సిద్ధమవడం ఆనందదాయకం. ఈ ఉత్సవాన్ని సెప్టెంబర్ 9, 2018 రష్యన్ మహా రచయిత టాల్‌స్టారు 190వ జన్మదినం సందర్భంగా విజయవాడలో జరిగే ప్రథమ సభ ద్వారా ప్రారంభించడం గొప్ప విషయం.
ప్రేమే జీవితం
ప్రేమే జీవితం.. పక్కవాళ్ళను, మనుషులను, ప్రేమించడం, కరుణ, దయ, క్షమాపణలతో మెలగడమే జీవితం. నేను ఏమైనా జీవితం గురించి అర్థం చేసుకున్నానంటే.. అది కేవలం ప్రేమ వల్లనే! ప్రేమించడం, ప్రేమించబడడమే జీవితం. ఇంతకు మించి ఏమిలేదు.
- టాల్‌స్టారు
మనో చికిత్స
ఏదో కాలక్షేపం కోసం చదివేది, రాసేది సాహిత్యం కాదు. నిజమైన సృజనాత్మక సాహిత్యం, పాఠకుని మానసిక స్థాయిని అభివృద్ధి చేయాలి. అతని మనస్సుకు చికిత్సగా ఉపయోగపడాలి.
- టాల్‌స్టారు
- కూనపరాజు కుమార్
9989999599