నన్ను గెలిపించాలని చూడకండి
ఇప్పుడు ఓటమి నాశ్వాస
తననుండి దూరమై ఒక్కనిమిషం కూడ
బతకలేని నిస్సహాయస్థితి నాది
ఓటమిప్పుడు నా పాణంలో ప్రాణం
గెలుపుకోసం వేసిన అడుగుల మడుగుల్లో
అడుగడుగునా ఓటమి ఓదార్చింది
అందినట్టేఅంది చేజారిన గెలుపు రాపిడిలో
వరుసుకుపోయిన గాయాల సలపరింతలపై
ఏదో మాయాలేపనం పూసి
మనసును ఓలలాడించింది
ఇప్పుడు ఓటమి నానుంచి విడదీయలేని బంధం
బతుకు వయోజన విద్యాకేంద్రంలో
ఓనమాలు నేర్పుతున్న గురువు
ఓటమిప్పుడు జీవితపాఠాలను
గుణపాఠాల మాద్యమంలోకి
తర్జుమాచేసి భోదిస్తున్న ఓ విశ్వవిద్యాలయం
అదేదో సినిమాలో చెప్పినట్టు
గెలుపుదేముంది .., మహాయితే
నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది
ఒక్కసారి ఓడిపోయి చూడు
ప్రపంచం నీకు పరిచయమౌతుంది
అవును ప్రపంచం
ఇప్పుడిప్పుడే పరిచయమౌతుంది
కష్టం విలువను
క్షణాల లెక్కన కొలుచుకుంటున్నాను
ఓటమిప్పుడు దొంగిలించబడని
నా విలువైన సొత్తు
తన నుండి దూరం చేస్తూ
నన్ను గెలిపించాలని చూడకండి
ఓటమి నాతో విసుగుచెందే వరకు
మా ఇద్దరికీ బంధం తీరిపోయే వరకు
నన్ను గెలిపించాలని చూడకండి
- డా. బంగార్రాజు కంఠ
8500350464