- వెనిజులా అధ్యక్షుడు మదురో ఆదేశం
కారకాస్ : అధ్యక్షుడు మదురో వెంటనే పదవి నుండి దిగిపోవాలన్న డిమాండ్‌తో ప్రతిపక్షం భారీ నిరసన ర్యాలీ తలపెట్టిన నేపథ్యంలో ప్రభుత్వం బందోబస్తును కట్టుదిట్టం చేసింది. ప్రతిపక్ష ఎంయుడి తలపెట్టిన ర్యాలీని అడ్డుకుంటే 'అంతర్జాతీయ స్పందన'ను చవి చూడాల్సి వస్తుందంటూ అమెరికా విదేశాంగ మంత్రిత్వశాఖ జారీ చేసిన హెచ్చరిక లపై మదురో తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్షాలు రాజేసే హింసాగ్నికి తమను బాధ్యులను చేయటం ద్వారా ప్రతిపక్ష ఎంయుడిని గద్దెనెక్కించేందుకు అమెరికా ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆయన మండిపడ్డారు. మదురో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంయుడి భారీ నిరసన ప్రదర్శన తలపెట్టటంతో 2002 ఏప్రిల్ 11 నాటి ఘటనలు పునరావృతమవు తాయన్న సందేహంతో ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. అప్పటి అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్‌ను గద్దె దించేందుకు ప్రతిపక్షం నిరసన ప్రదర్శన జరపటంతో ఛావెజ్ అనుకూలురు, వ్యతిరేకులు లియాగునో బ్రిడ్జ్ వద్ద పరస్పరం తలపడిన సమయంలో కొందరు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రతిపక్షం తలపెట్టిన నిరసనల్లో హింసను అడ్డుకుని, శాంతి భద్రతలను కాపాడేందుకు అన్ని సైనిక, పోలీసు, పౌర వ్యవస్థలను సమీకరించినట్లు మదురో చెప్పారు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం తలపెట్టిన నిరసన ప్రదర్శనను అడ్డుకునేందుకు ఎదురు ప్రదర్శన జరపాలని ఆయన తన పార్టీ మద్దతుదారులకు పిలుపునిచ్చారు.
గత రెండు వారాలుగా కొనసాగుతున్న ఎంయుడి నిరసన ప్రదర్శనలతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా దాదాపు 5 వేల కోట్ల బొలివర్ల విలువైన ఆస్థి ధ్వంసమయిందని అధ్యక్షుడు చెప్పారు.
ప్రతిపక్ష నిరసనల నేపథ్యంలో భారీ బందోబస్తు
